ఉప్పల్ నవంబర్ 8: ఆర్థిక సమస్యలతో కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకున్న ఘటన ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉప్పల్ మల్లికార్జుననగర్‌లో నివాసముంటున్న కానిస్టేబుల్ డీ శ్రీకాంత్ (42) ఫిలింనగర్ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్నాడు. గత నెల 23 నుంచి ఆయన విధులకు హాజరు కావడంలేదు. శనివారం ఉదయం శ్రీకాంత్ తన రూమ్‌కి వెళ్లి గడియ పెట్టుకున్నాడు. దీన్ని గమనించిన తండ్రి.. ఆ రూమ్ తలుపు బద్ధలుకొట్టి చూడగా అప్పటికే చీరతో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. 2009లో ఉద్యోగంలో చేరిన శ్రీకాంత్ గత కొంత కాలంగా ఆన్లైన్ బెట్టింగుల్లో డబ్బులు పోగొట్టుకొని ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నట్టు తెలుస్తున్నది. పోస్టుమార్టం నిమిత్తం ఆయన మృతదేహన్ని గాంధీ దవాఖానకు తరలించి కేసు నమోదు దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.