మేడ్చల్: న్యాయం కోసం పోలీస్టేషన్‌కు వచ్చిన యువతి (31)ని మాయ మాటలతో కానిస్టేబుల్ (Constable) లోబర్చుకున్నాడు. పెండ్లి చేసుకుంటానని నమ్మించి, గర్భవతిని చేశాడు. అప్పటికే పెళ్లి అయిందన్న విషయం తెలుసుకున్న యువతి అతడిని నిలదీయగా దాడిచేసి, నోరు మూయించాలని ప్రయత్నించాడు. ఇది మేడ్చల్ పోలీస్టేషన్ నేరా విభాగంలో పనిచేసే కానిస్టేబుల్ నిర్వాకం. బాధితురాలి ఫిర్యాదుతో కానిస్టేబుల్‌తోపాటు సహకరించిన అతని భార్య, సహచర కానిస్టేబుల్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళితే.. మేడ్చల్ పట్టణంలో నివాసం ఉండే యువతి తనకు రావాల్సిన డబ్బులు విషయంలో ఒకరితో వివాదం ఏర్పడింది. ఈ విషయమై గతేడాది మార్చి 21న మేడ్చల్ పోలీస్టేషన్‌కు వెళ్లి, సీఐని కలిసింది.
యువతి వెళ్తున్న సమయంలో అక్కడే ఉన్న సుధాకర్ రెడ్డి(31) డబ్బులు తిరిగి రావడానికి సహకరిస్తానని నమ్మబలికి, ఫోన్ నంబర్ తీసుకున్నాడు. ఈ తర్వాత రోజు సదరు యువతికి ఫోన్ చేసి డబ్బులు తిగిరి రావడానికి సహకరించే లాయర్‌ను కలిపిస్తానన్నాడు. నాలుగైదు రోజుల తర్వాత తన ఇంటికి లాయర్ వస్తున్నాడని డబ్బుల విషయమై మాట్లాడుదామని ఆమెను పిలిపించుకున్నాడు. లాయర్ వస్తున్నాడంటూ నమ్మబలికి ఇంట్లో కూర్చోబెట్టాడు. తనకు పెండ్లి కాలేదని అంగీకరిస్తే వివాహం చేసుకుంటానని, డబ్బు వచ్చేలా చేస్తానని నమ్మించాడు. ఇందుకు ఆమె అంగీకరించలేదు. ఇప్పటికే తానుమోసపోయానని, కోర్టు చుట్టూ తిరుగుతున్నానని, పెండ్లి చేసుకోలేనని చెప్పింది. కానీ సుధాకర్ రెడ్డి తనకు కులం పట్టింపులు ఏవీ లేవని పెండ్లి చేసుంటానని మాయ మాటలు చెప్పుతూ బలవంతంగా లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఆ తర్వాత మరో 15 రోజులకు తిరిగి తన ఇంటికి పిలిపించుకొని మరోసారి అఘాయిత్యం చేశాడు.
అనంతరం సుధాకర్ రెడ్డి తన వద్ద ఫొటోలు, వీడియోలు ఉన్నాయని యువతిని బెదిరిస్తూ పలుమార్లు లైంగిక దాడిచేశాడు. దీంతో ఆమె గర్భందాల్చడంతో బలవంతంగా మందులు మింగించి, గర్భస్రావం అయ్యేలా చేశాడు. గతేడాది ఆగస్టు 15వ తేదీన సుధాకర్ రెడ్డికి బాధిత యువతి ఫోన్ చేయగా అతడి భార్య బదులివ్వడంతో పెళ్లి అయిందన్న విషయం తెలిసింది. ఆ తర్వాత కూడా తనకు అది ఇష్టం లేని పెళ్లి అని నమ్మబలికే ప్రయత్నం చేశాడు. ఒక రోజు బాధితురాలి ఇంటికి వెళ్లి గొడవ పడి, బలవంతంగా ఫినాయిల్ తాగించడంతో అస్వస్థకు గురైంది. కాగా అదే ఏడాది నవంబర్ 23న సుధాకర్ రెడ్డి ఆ యువతిని తన ఇంటికి తీసుకెళ్లాడు. ఆమెపై సుధాకర్ రెడ్డి భార్య సింధూజ దాడికి పాల్పడింది. మరోసారి తన భర్త వెంట పడితే తన తండ్రితో కలిసి చంపిస్తానని బెదిరించింది. ఆ తర్వాత సుధాకర్ రెడ్డి స్నేహితుడైన మరో కానిస్టేబుల్ కళ్యాణ్ గౌడ్‌తో కలిసి బాధిత యుతిని తుమ్మ చెరువు వద్దకు తీసుకెళ్లి, పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు.
అంతటితో ఆగకుండా డిసెంబర్ 10న మరోసారి బాధితురాలి ఇంటికి మద్యం తాగి వెళ్లి, కులం పేరుతో దూషించాడు. మరో ఆరు రోజులకు గిర్మాపూర్‌కు వెళ్లే దారిలో బుల్లెట్‌పై తీసుకెళ్లి, కిందికి తోసేశాడు. కాగా కానిస్టేబుల్ వ్యవహారం తెల్సిన పోలీసు అధికారులు అతడిని సీపీ కార్యాలయానికి అటాచ్ చేశారు. కానిస్టేబుల్ ప్రవర్తనతో విసిగిపోయిన బాధిత యువతి ఈ నెల 4న మేడ్చల్ పోలీస్ స్టేషన్ ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి, రిమాండుకు తరలించారు.