మహబూబాబాద్‌రూరల్, సెప్టెంబర్ 28 : ఎస్టీ రిజర్వేషన్ నుంచి లంబాడీలను తొలగించేందుకు చేస్తున్న కుట్రలను తిప్పికొట్టాలని మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ పిలుపునిచ్చారు. ఆదివారం మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని తహసీల్దార్ ఆఫీసు ఎదుట లంబాడీల పరిరక్షణ కమిటీ జేఏసీ అధ్యక్షుడు జగదీశ్వర్ ఆధ్వర్యంలో నిర్వహించిన సభలో ముఖ్య అతిథులుగా మాజీ మంత్రి సత్యవతి రాథోడ్, మాజీ ఎంపీ మాలోత్ కవిత, మాజీ ఎమ్మెల్యే శంకర్‌నాయక్ పాల్గొన్నారు. సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ లంబాడీలు మొద ట నుంచి ఎస్టీ జాబితాలో లేరని, మధ్యలో వచ్చారని ఆరోపించడం సరికాదన్నారు. 1956లోనే లంబాడీలకు ఎస్టీ రిజర్వేషన్ ఫ లాలు అందాల్సి ఉండేదని చెప్పారు. సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన లంబాడీలు పోరాటం చేయడంతోనే 1976లో ఎస్టీ రిజర్వేషన్ అమల్లోకి వచ్చిందని వివరించారు.
ఇటీవల రిజ్వరేషన్ను ఎత్తివేసేందుకు కొందరు కుట్రలకు పాల్పడుతున్నందున స్థానిక సంస్థ ల ఎన్నికల్లో గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. లంబాడీ జాతి ఏకమై సుప్రీంకోర్టులో మన వాణి వినిపించాలని కోరారు. మాజీ ఎంపీ కవిత మాట్లాడుతూ రాజకీయ దురుద్దేశంతోనే ఆదివాసీలు, లంబాడీల మధ్య కొందరు గొడవలు పెడుతున్నారని విమర్శించారు. అన్నదమ్ముల్లా కలిసి ఉన్న గిరిజనుల మధ్య చిచ్చు పెట్టడం సరికాదని అన్నారు. జాతి హక్కుల కోసం ఢిల్లీలో సైతం పోరాటం చేసేందుకు ప్రతి ఒక్కరూ సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. మాజీ ఎమ్మెల్యే శంకర్‌నాయక్ మాట్లాడుతూ లంబాడీలను ఎస్టీ రిజర్వేషన్ నుంచి తొగించే కుట్రలను తిప్పి కొట్టాలని పిలుపునిచ్చారు. మాజీ ఎంపీ సోయం బాబురావు, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్‌ను వెంటనే వెనక్కి తీసుకునేలా కాంగ్రెస్ పార్టీ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.