హైదరాబాద్, ఫిబ్రవరి 15 (నమస్తే తెలంగాణ): జల విద్యుత్తు ఉత్పత్తిలో తెలంగాణను అడ్డుకొనేందుకు ఏపీ రైతుల పేరిట చేసిన న్యాయపోరాటం వీగిపోయింది. అంతర్ రాష్ట్ర జల వివాదాలపై విచారణ జరిపే అధికారం తమకు లేదని హైకోర్టు తేల్చి చెప్పింది. తెలంగాణలోని జల విద్యుత్తు కేంద్రాల్లో 100 శాతం ఉత్పత్తి చేయాలన్న జీవోకు వ్యతిరేకంగా కృష్ణా జిల్లా రైతులు దాఖలు చేసిన పిటిషన్లపై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీశ్‌చంద్ర శర్మ, జస్టిస్ అభినంద్‌కుమార్ షావిలి ధర్మాసనం ఇటీవల విచారణ జరిపింది. అంతర్ రాష్ట్ర జల వివాదాల్లో హైకోర్టులు జోక్యం చేసుకొనేందుకు వీల్లేదని రాజోలిబండ కేసులో సుప్రీంకోర్టు తీర్పు చెప్పిందన్న తెలంగాణ ప్రభుత్వ వాదనను ధర్మాసనం ఆమోదించింది. రాజ్యాంగంలోని 262వ అధికరణ ప్రకారం అంతర్ రాష్ట్ర జల వివాదాలపై సుప్రీంకోర్టు లేదా సంబంధిత అధికారాలున్న న్యాయస్థానాలు మాత్రమే విచారణ జరుపుతాయని ధర్మాసనం పేర్కొంటూ.. ఏపీ రైతుల వ్యాజ్యాలపై విచారణను ముగిస్తున్నట్టు ప్రకటించింది. పిటిషనర్లు చట్టపరమైన ప్రత్యామ్నాయ కోర్టులను ఆశ్రయించవచ్చని హైకోర్టు స్పష్టం చేసింది.