Telangana | హైదరాబాద్, డిసెంబర్ 4 (నమస్తే తెలంగాణ): ఒకాయన ఉమ్మడి రాష్ట్రంలో ‘పెద్ద’ మంత్రిగా పనిచేశారు. ఇప్పుడు కూడా ప్రభుత్వంలో రాజసంగా కీలక మంత్రి హోదాలో ఉన్నారు. మరొకాయన ప్రస్తుత ప్రభుత్వంలో ‘కీలక’ మంత్రిగా పనిచేస్తున్నారు. ‘నంబర్’ గేమ్‌లో పోటీపడుతున్నారు. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండలం సుల్తాన్పూర్ గ్రామంలో ఉన్న దాదాపు 400 ఎకరాల ప్రభుత్వ భూమిపై ‘పెద్ద’ మంత్రి కన్ను పడింది. ఆ భూమిని పట్టా భూములుగా మార్చేందుకు కొత్త మంత్రిని భాగస్వామిగా చేర్చుకున్నారు. ఓ ఎమ్మెల్యే, ఉమ్మడి మెదక్ జిల్లాకు చెందిన కాంగ్రెస్ నేతల సాయం తీసుకున్నారు. 30 ఏండ్ల కిందటే రద్దయిన ఓనర్షిప్ రైట్స్ సర్టిఫికెట్లను (ఓఆర్సీ) తెరమీదికి తెచ్చారు.
తమ అనుచరుల పేర్లతో పట్టాలు చేయిస్తున్నారు. సుల్తాన్‌పూర్‌లోని మెడికల్ డివైజెస్ పార్కు సమీపంలో ఉండటంతో ఒక్కో ఎకరం రూ.10 కోట్లు విలువ చేస్తున్నది. అంటే.. మంత్రులు కన్నేసిన దాదాపు 400 ఎకరాల భూమి విలువ రూ.4వేల కోట్లకుపైనే. వీటిని వెంచర్లుగా మార్చి అమ్మి రూ.10వేల కోట్ల వరకు సొమ్ము చేసుకోవాలని ప్లాన్ చేసినట్టు తెలుస్తున్నది. ఇప్పటికే 100 ఎకరాల్లో వెంచర్ పనులు మొదలయ్యాయి. రెండు నెలలుగా గుట్టలను చదును చేస్తున్నా.. రెవెన్యూ యంత్రాంగం చేష్టలుడిగి చూస్తున్నది. వెంచర్ చుట్టూ ప్రహరీ, మధ్యలో చిన్న షెడ్ల నిర్మాణాలు జరిగిపోతున్నాయి. గతంలో ఒకసారి ‘నమస్తే తెలంగాణ’ వివరణ కోరగా హడావుడిగా ప్రహరీలో నాలుగు అడుగులు కూల్చి మమ అనిపించారు.
1994లోనే రద్దయిన ఓఆర్సీలు
సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం సుల్తాన్పూర్ 1348 ఫస్లీ సంవత్సరానికి సంబంధించిన తొలి పహాణీలో పన్మక్తా ఫరీదుద్దీన్ పేరు మీద పహాణీలు ఉన్నాయి. సర్వే నంబర్ 30లో మొత్తం722.20 ఎకరాల భూమి ఉన్నది. ఇందులో 90 ఎకరాలు బొమ్మన్‌కుంట చెరువు శిఖం. మిగిలినదంతా కొండలు, గుట్టలతో కూడిన భూమి. ఫరీదుద్దీన్ మరణానంతరం ఇనాం రద్దయ్యింది. అప్పటి నుంచి రెవెన్యూ రికార్డుల్లో అవి ప్రభుత్వ భూములుగా ఉన్నాయి. 1986 జూన్‌లో అప్పటి సంగారెడ్డి ఆర్డీవో ఇనాందారుల వారసులను సృష్టించి, వారికి 432.25 ఎకరాల మీద ఓనర్షిప్ రైట్స్ సర్టిఫికెట్ (ఓఆర్సీ) జారీ చేశారు. ఇనాందార్లు అదే ఏడాది ఆ స్థలాన్ని భూ మాఫియా స్మగ్లర్ వాలా నారాయణ రావుకు విక్రయించారు. దీంతో లేని వారసులను సృష్టించి ప్రభుత్వ భూమిని కబ్జా పెట్టే ప్రయత్నం చేస్తున్నారంటూ 1993లో అప్పటి ఇందుర్తి ఎమ్మెల్యే దేశిని చినమల్లయ్య అసెంబ్లీలో లేవనెత్తారు. వెంటనే ప్రభుత్వం స్పందించి, అప్పటి సీసీఎల్ఏ కమిషనర్ ఎస్ఎన్ మొహంతిని విచారణ అధికారిగా నియమించింది.
ఆయన 1994 ఏప్రిల్‌లో ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు. ఓఆర్సీల జారీలో సంగారెడ్డి ఆర్డీవో అక్రమాలకు పాల్పడ్డాని ధ్రువీకరించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు 1994 జూన్ 14న అప్పటి ఉమ్మడి మెదక్ జిల్లా జాయింట్ కలెక్టర్.. ఇనాందారుల వారసుల పేరుతో జారీ చేసిన ఓఆర్సీలను రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అక్రమంగా సర్టిఫికెట్లు జారీ చేసిన ఆర్డీవోను విధుల నుంచి తప్పించారు. అప్పటి నుంచి 432 ఎకరాల భూమి ప్రభుత్వ ఆధీనంలోనే ఉన్నది. మరో 242 ఎకరాల భూమి రైతుల పేరుతో ఉన్నప్పటికీ, సాగుకు అనువైన భూమి కాకపోవడంతో క్షేత్రస్థాయిలో ఎవరూ సాగు చేయడం లేదు.
పాత ఓఆర్సీలతో పట్టాలు.. అందరికీ వాటాలు
ఖాళీగా ఉన్న 432 ఎకరాలపై మంత్రులు కన్నేశారు. 1986లో అక్రమంగా ఓఆర్సీలు పొందిన కొందరు ఇనాందారుల వారసులను తెరమీదికి తెచ్చారు. ఆ ఓఆర్సీలకు పట్టాలు ఇవ్వాలని స్థానిక రెవెన్యూ అధికారులకు దరఖాస్తులు చేయించారు. వాస్తవానికి అవన్నీ 30 ఏండ్ల కిందటే రద్దయ్యాయి. అయినా పెద్ద మంత్రుల కనుసన్నల్లో రెవెన్యూ ఉన్నతాధికారులు పట్టాలు మంజూరు చేసే పనులు మొదలు పెట్టేశారు. ఇప్పటికే బై సర్వే నంబర్లు సృష్టించి కొందరికి పట్టాలు మంజూరైనట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ మొత్తం వ్యవహారంలో ఇద్దరు మంత్రులు, ఒక ఎమ్మెల్యే, ఉమ్మడి జిల్లాకు చెందిన కాంగ్రెస్ నేత భాగస్వామలుగా ఉన్నట్టు తెలిసింది. ఇటీవలే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిన ఆ ఎమ్మెల్యే ఎప్పటి నుంచో ఈ భూములపై కన్నేసినట్టు ప్రచారంలో ఉన్నది.
బీఆర్ఎస్ ప్రభుత్వంలో విఫల ప్రయత్నం చేసినా, ప్రభుత్వ భూములను కబ్జా పెట్టడానికి నాటి సీఎం కేసీఆర్, జిల్లా మంత్రి హరీశ్‌రావు అంగీకరించలేదని చెప్పుకుంటున్నారు. ఇప్పుడు పార్టీ మారగానే సదరు పెద్ద మంత్రికి భూముల వివరాలు చెప్పారని, మరో కాంగ్రెస్ నేతతో కలిసి కొత్త మంత్రితో డీల్ కుదిర్చారని సమాచారం. ప్లాట్లు అభివృద్ధి చేసిన తర్వాత భూమి యాజమాన్య హక్కు పత్రాలున్న ఇనాందార్ వారసులకు ఎకరాకు 750 గజాల చొప్పున ప్లాటు ఇచ్చేలా ఒప్పందం చేసుకున్నట్టు తెలుస్తున్నది. మిగతా భూమిలో పాత మంత్రికి 55 శాతం, కొత్త మంత్రికి 25 శాతం, ఎమ్మెల్యేకు 10 శాతం, కాంగ్రెస్ నేతకు 10 శాతం దక్కేట్టు ఒప్పందం చేసుకున్నట్టు విశ్వసనీయంగా తెలిసింది.
100 ఎకరాల్లో వెంచర్
అటు రెవెన్యూ అధికారులు పని మొదలు పెట్టగానే.. ఇటు మొదటి విడతగా 100 ఎకరాల్లో వెంచర్ వేసేందుకు పనులు మొదలుపెట్టేశారు. ఆర్సీపురం మండల కేంద్రానికి చెం దిన ఓ కాంగ్రెస్ నేత ఆధ్వర్యంలో రెండు నెలలుగా పనులు జరుగుతున్నాయి. భూమిని స్వాధీనంలోకి తీసుకొని దాని చుట్టూ ప్రహరీ నిర్మిస్తున్నారు. బుల్డోజర్లు, జేసీబీలు, లారీలతో కొండలు, గుట్టలు చదును చేసి, వెంచర్ వేస్తున్నారు. రాత్రింబవళ్లు పనులు జరుగుతున్నా రెవెన్యూ అధికారులు కండ్లు మూసుకున్నారు. డిటోనేటర్లు పెట్టి రాత్రికి గుట్టలను పేల్చుతు న్నా పోలీసులు, మైనింగ్ అధికారులు చెవులు మూసుకున్నారు. విద్యుత్తు శాఖ అధికారులు అగమేఘాల మీద కరెంటు స్తంభాలు వేసి ఎల్టీ లైన్ వేశారు. ఇప్పటికే మట్టి రోడ్ల పను లు పూర్తయ్యాయి. అక్కడక్కడ గదులు నిర్మిం చి, నల్లా కనెక్షన్లు సైతం తీసుకుంటున్నారు. ఏ ఒక్క అనుమతి లేకపోయినా ప్రభుత్వ యం త్రాంగం మొత్తం మిన్నకుండిపోయింది. ఎవరైనా అడిగే సాహసం చేస్తే మంత్రుల పేర్లు చె ప్పి బెదిరిస్తున్నారని వాపోతున్నారు. ఒక డి ప్యూటీ తహసీల్దార్‌ను ప్రశ్నించి నోటీసులు ఇస్తే వెంటనే ఆయనను బదిలీ చేశారని రెవెన్యూ వ ర్గాల్లో చర్చ జరుగుతున్నది. ఓ రెవెన్యూ అధికారిని ప్రత్యేకంగా నియమించి పనులు దగ్గరుండి చేయిస్తున్నట్టు ప్రచారం జరుగుతున్నది.
10వేల కోట్లకు టెండర్
పటాన్చెరు పారిశ్రామిక ప్రాంతం కావ డం, పక్కనే మెడికల్ డివైజెస్ పార్క్ ఉండటంతో ప్రస్తుతం ఆ ప్రాంతంలో ఎకరాకు రూ.10 కోట్ల చొప్పున పలుకుతున్నట్టు స్థానికులు చెప్తున్నారు. వెంచర్‌గా అభివృద్ధి చేసి విక్రయిస్తే రూ.30 కోట్ల వరకు వస్తుందని వ్యాపారులు అంటున్నారు. ఈ లెక్కన దాదాపు 400 ఎకరాలకు లెక్కిస్తే.. మంత్రుల భూమాయ విలువ రూ.10వేల కోట్లకుపైనే అని చెప్తున్నారు. ప్రస్తుతం వేసిన 100 ఎకరాల వెంచర్ విలువే రూ.3వేల కోట్ల వరకు ఉంటుందని అంటున్నారు. పనులు తుది దశకు వచ్చాయని, త్వరలో ప్లాట్లను అమ్మకానికి పెడతారని చెప్తున్నారు. ఈ కబ్జాల మీద ‘నమస్తే తెలంగాణ’ ప్రతినిధులు గత నెలలో అమీన్పూర్ తహసీల్దార్ రాధ వివరణ కోరగా.. గుర్తు తెలియని వ్యక్తులు సర్వే నంబర్ 30లోని ప్రభుత్వ భూమిని కబ్జా చేసినట్టు తమ దృష్టికి కూడా వచ్చిందని, అక్రమంగా వేసిన ఫెన్సింగ్‌ను కూల్చివేస్తామని చెప్పారు. ఆ తర్వాత అధికారులు తూ తూమంత్రంగా నాలుగడుగుల మేర ఫెన్సింగ్ కూల్చి మమ అనిపించారు. ఆ తర్వాత పను లు మళ్లీ యథావిధిగా సాగుతున్నాయని స్థా నికులు చెప్తున్నారు.