Meenakshi Natarajan |హైదరాబాద్, జూన్ 9 (నమస్తే తెలంగాణ): మధ్యప్రదేశ్ నుంచి రాజ్యసభ అభ్యర్థిగా కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు, ఏఐసీసీ తెలంగాణ దూత మీనాక్షీ నటరాజన్ వేసిన నామినేషన్ తిరస్కరణ వెనుక ఏమైనా కుట్ర జరిగిందా? నామినేషన్ దశలోనే వెనక్కి తిరుగడం ఆమె స్వయంకృతాపరాధమా? లేక తెరవెనుక ఎవరైనా కుట్రలు చేశారా? ఆమె రాజ్యసభకు వెళ్లకుండా కాళ్లలో కట్టెలుపెట్టే అవసరం, అవకాశం ఎవరికి ఉన్నది? స్క్రూట్నీ దశలోనే మీనాక్షిని వెనక్కి పంపి బీజేపీ మూడో అభ్యర్థికి మార్గం సుగమం చేసింది ఎవరు? అంటే అన్ని వేళ్లు తెలంగాణ దిక్కే చూపిస్తున్నాయి. అందునా మధ్యప్రదేశ్‌లో బీజేపీ వ్యూహాత్మక దూకుడు గమనిస్తుంటే.. తెలంగాణ ముఖ్యనేత వైపే అందరూ అనుమానంగా చూస్తున్నారు. ఎప్పుడూ లేనిది మీనాక్షి విషయంలో ఆయన వేగంగా స్పందించడం, బీజేపీ కుట్రగా ప్రకటించడం మరింత అనుమానాలను పెంచింది. ఈ నెల18న మధ్యప్రదేశ్ రాష్ట్రంలో మొత్తం మూడు రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరుగనున్నాయి. ఈ ఎన్నికల కోసం బీజేపీ దూకుడుతనంతో ముగ్గురు అభ్యర్థులను బరిలో నిలిపింది.
అంతే వేగంగా రాజకీయ వ్యూహాలు పన్నింది. బీజేపీ వ్యూహాలకు తెలంగాణ నేతలే సంపూర్ణంగా సహరించారనే చర్చ తెరమీదికొచ్చింది. మీనాక్షీనటరాజన్ ఏఐసీసీ దూతగా తెలంగాణకు వచ్చిన నాటి నుంచే ఆమెకు, రాష్ట్ర ముఖ్యనేతకు మధ్య అంతరం ఏర్పడిందని, అది పెరుగుతూ ఇంతదూరం వచ్చిందని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఒకరు చెప్తున్నారు. ఆమెను రాజ్యసభకు పంపడం ద్వారా తెలంగాణలో ఆమెను వదిలించుకోవచ్చని ముఖ్యనేత వర్గం తొలుత భావించినట్టు తెలిసింది. కానీ, అట్లా తీసేందుకు అధిష్ఠానం సుముఖంగా లేదని, రాజ్యసభ ఎంపీతోపాటు, ఏఐసీసీ దూతగా కొనసాగించాలే ఆలోచనతోనే ఉన్నట్టు ముఖ్యనేతకూ ఉప్పందినట్టు తెలిసింది. రాజ్యసభ ఎంపీగా నెగ్గితే ఆమె అటు అధిష్ఠానం వద్ద, ఇటు రాష్ట్రంలోనూ కీలకంగా మారుతారని, అధికారపరంగా మరింత బలపడుతారని భావించిన ముఖ్యనేత.. అధిష్ఠానానికి ఒక ఝలక్ ఇవ్వడంతోపాటు, బీజేపీకి మరింత చేరువయ్యే అవకాశాలను అందిపుచ్చుకొన్నట్టు పేరు చెప్పడానికి ఇష్టపడని సీనియర్ కాంగ్రెస్ నాయకుడొకరు చెప్పారు.
ఏఐసీసీ ఢిల్లీ దూత మీనాక్షీ నటరాజన్‌ను తెలంగాణ ప్రజలు నికార్సైన గాంధేయవాదిగానే చూశారు. ఆమెపై క్రిమినల్ కేసులు ఉన్నాయనే ఆలోచన కూడా జనాలకు లేదు. 2025లో ఆమెపై క్రిమినల్ కేసుకు సంబంధించిన వ్యవహారం నడుస్తున్నట్టు తెలుస్తున్నదని, అంటే పక్కాగా కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే ఆమెపై కేసు నడుస్తున్నది. తన ప్రభుత్వంలో తనపైనే నమోదైన కేసుకు సంబంధించిన వివరాలు ఆమె వద్దే లేవు. కానీ ఎక్కడో మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న బీజేపీ నేతలకు మాత్రం మీనాక్షీ కేసు వివరాలు ఎట్లా చేరాయి? ఇదేమీ తెలియకుండానే మీనాక్షి నటరాజన్ తన నామినేషన్ పత్రాలను ఎన్నికల అధికారులకు సమర్పించారు. నామినేషన్ గడువు ముగిసేంత వరకు వేచిచూసిన అక్కడి బీజేపీ నేతలు.. నామినేషన్ పత్రాల పరిశీలనకు ముందు ఆమెపై తెలంగాణలో నమోదైన కొన్ని క్రిమినల్ కేసుల వివరాలను ఎన్నికల అఫిడవిట్లో సరిగ్గా పేరొనలేదని ఫిర్యాదు చేసినట్టు తెలిసింది. బీజేపీ ఇచ్చిన ఫిర్యాదును పరిశీలించిన అధికారులు, నామినేషన్ పత్రాల్లో ఓ కేసులో రెస్పాండెంట్‌గా ఉన్న సమాచారం దాచారనే కారణంతో మీనాక్షీ నటరాజన్ నామినేషన్‌ను తిరస్కరించినట్టు సమాచారం. నామినేషన్‌కు ముందే ఇంత పకడ్బందీగా ఆమెకు సంబంధించిన కేసు వివరాలు మధ్యప్రదేశ్ వరకు ఎవరు చేరవేశారు?
మధ్యప్రదేశ్ రాష్ట్రంలో మొత్తం 230 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. 2023లో జరిగిన ఎన్నికల్లో బీజేపీ 163 స్థానాలు గెలిచింది. అనంతర పరిణామాల నేపథ్యంలో ఆ పార్టీ బలం 165కు పెరిగినట్టు తెలుస్తున్నది. ప్రధాన ప్రతిపక్షమైన జాతీయ కాంగ్రెస్ పార్టీకి 64 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఒకో రాజ్యసభ అభ్యర్థి గెలుపునకు ఈలెక్కన 58 ఓట్ల చొప్పున అవసరం అవుతాయని అంచనా. సంఖ్యాబలాన్ని ఆధారంగా చేసుకుంటే అధికార బీజేపీకి రెండు సీట్లు పక్కా. 116 ఓట్లతో రెండు సీట్లను సులువుగా గెలుస్తుంది. ఇంకా ఆ పార్టీకి 49 ఓట్లు మిగులుతాయి. మూడో సీటు దకించుకోవాలంటే మరో 9 ఓట్లు అవసరం ఉంటుంది. కాంగ్రెస్ పార్టీకి 64 మంది ఎమ్మెల్యేల బలం ఉన్నది. ఈ బలంలో వాళ్లు మూడో సీటును అతి సునాయాసంగా గెలుచుకుంటారు. ఎమ్మెల్యేల బలాబలాల్లో లెక్కలు ఇంత స్పష్టంగా ఉన్నప్పటికీ బీజేపీ మూడో అభ్యర్థిని బరిలోకి దింపింది. ఓట్ల బలం లేకున్నా మూడో అభ్యర్థిని గెలిపించుకుంటామనే ధైర్యం బీజేపీకి ఎక్కడి నుంచి వచ్చింది? డీలిమిటేషన్ బిల్లు కోసం కలిసొచ్చే ప్రతి సీటునూ దక్కించుకోవాలనుకుంటున్న బీజేపీ పన్నాగానికి చేయూతనిచ్చింది ఎవరు?
మూడో కంటికి తెయకుండా మీనాక్షీ నటరాజన్‌ను బలి పశువును చేసిన తర్వాతే అసలు విషయం బోధపడినట్టు కాంగ్రెస్ వర్గాలే చెప్తున్నాయి. ఆమెపై బీఎన్ఎస్ సెక్షన్ 223 నమోదు చేయాలని 2025 సెప్టెంబర్ 17న ఒక వ్యక్తి నాంపల్లి కోర్టును ఆశ్రయించినట్టు తెలుస్తున్నది. కోర్టు రెస్పాండెంట్‌గా నమోదు చేసి నోటీసులు పంపినట్టు ఒక కోర్టు నోటీస్ కాపీ సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతున్నది. ఇటువంటి కేసు వివరాలు ముఖ్యమంత్రికి తెలియాలని, పైగా రాష్ట్ర హోంశాఖ కూడా ముఖ్యమంత్రి వద్దే ఉన్న నేపథ్యంలో అన్ని విషయాలు ముందస్తుగా ఆయనకే తెలుస్తాయని సీనియర్ కాంగ్రెస్ నేత ఒకరు చెప్పారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలో ఉన్నది. అసెంబ్లీ ఎన్నికల ముందు కొంతకాలం మీనాక్షి తెలంగాణలోనే ఉన్నారు. పార్టీ అధికారంలోకి వచ్చాక దూతగా దాదాపు ఏడాదిన్నర నుంచి తెలంగాణలోనే ఉంటున్నారు. పార్టీ అభ్యర్థిగా బరిలోకి దింపుతున్న నేపథ్యంలో అధికార పార్టీ ముఖ్యనేతగా జాగ్రత్త వహించి ఆమెపై ఏమైనా కేసులు ఉన్నాయా? వివరాలు పంపండి అని, లేకుండా ఎన్వోసీ ఇవ్వమని డీజీపీకి ఒక లేఖ రాసి ఉంటే విషయం ఎప్పుడో బయటికి వచ్చేదని కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు. కానీ ఉద్దేశపూర్వంగానే తమ నేతలు కొందరు ఆమె కేసు విషయాన్ని బీజేపీకి చేరవేశారని ఒక సీనియర్ కాంగ్రెస్ నేత అనుమానం వ్యక్తంచేస్తున్నారు. సదరు నేతలు ముందు నుంచే బీజేపీతో అంటకాగుతున్నారని, అధిష్ఠానానికి ఎన్నిసార్లు ఫిర్యాదుచేసినా పట్టించుకోలేదని, ఇప్పుడు ఫలితం అనుభవిస్తున్నామని మరో సీనియర్ కాంగ్రెస్ నేత ఆవేదన వ్యక్తంచేశారు.
మీనాక్షి రాష్ర్టానికి వచ్చిన తొలి రోజుల్లోనే కంచ గచ్చిబౌలి భూముల వివాదం చెలరేగింది. 400 ఎకరాల హెచ్‌సీయూ భూముల వ్యవహారం రాష్ట్రంలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఓ వైపు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో విద్యార్థుల ఆందోళనలు, మరోవైపు విపక్ష నేతలు ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకోవడం రాజకీయ వేడిని రాజేశాయి. పనులు ఆపాలని సుప్రీంకోర్టు స్టే విధించింది. ఈ పరిణామాల నడుమ పూర్తి వివరాలు సేకరించాలన్న రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షీ నటరాజన్ ముఖ్యనేత నిర్ణయాలను వ్యతిరేకించినట్టు కాంగ్రెస్ వర్గాలు చెప్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆమె సచివాలయంలో మంత్రులు, బ్యూరోక్రాట్లతో సమావేశాలు నిర్వహించారు. అభిప్రాయాలు తీసుకున్నారు. ఎలా వ్యవహరించాలో మంత్రులకు దిశానిర్దేశం చేశారు. మీనాక్షి తీరును ఈ సమయంలో ముఖ్యనేత వర్గం తప్పుపట్టింది. సచివాలయంలో ఆమె సూడో సీఎంగా మారుతున్నారని ముఖ్యనేత అనుకూల సోషల్ మీడియా పోస్టులు పెట్టింది. దీంతో మొదట్లోనే ఇద్దరి మధ్య అంతరం ఏర్పడిందని కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు.