హైదరాబాద్, జనవరి 11 (నమస్తే తెలంగాణ) : విద్యుత్తు కాంట్రాక్టర్లపై కుట్ర జరుగుతున్నదని తెలంగాణ ఎలక్ట్రికల్ కాంట్రాక్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు కందకూరి శ్రీనివాస్ ఆరోపించారు. ప్రైవేట్ కాంట్రాక్ట్ వ్యవస్థను దెబ్బతీసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తంచేశారు.
‘టర్న్ కీ’ విధానం ఎత్తివేసేందుకు ప్రయత్నిస్తున్నారని, ఇదే జరిగితే వేలాది కుటుంబాలు రోడ్డునపడతాయని వాపోయారు. టర్న్ కీ విధానం ఎత్తివేస్తే ఉద్యమం తప్పదని హెచ్చరించారు. అసోసియేషన్ 2026 డైరీ, క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఆదివారం హైదరాబాద్‌లో నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దక్షిణ డిస్కం అధికారులు టర్న్ కీ విధానం ఎత్తివేసి, డిపార్ట్మెంట్ పేరు చెప్పి తిరిగి బడా బడా కాంట్రాక్టర్ల చేతిలో పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. దీంతో చిన్న కాంట్రాక్టర్లు ఉపాధి కోల్పోతారని వాపోయారు. ఈ సమావేశంలో మేడ్చల్ -మల్కాజిగిరి జిల్లా అధ్యక్షుడు దుర్గ శివశంకర్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ముద్దనూని వెంకటేశ్, ఉపాధ్యక్షులు జీవన్‌రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, గాడిగె సత్యం, శివ, మహేశ్‌రెడ్డి, శ్రీకాంత్, సురేశ్ తదితరులు పాల్గొన్నారు.