హైదరాబాద్, నవంబర్ 16 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్‌లో వచ్చేనెల 8, 9న నిర్వహించనున్న ‘తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్-2025’ కోసం ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క నేతృత్వంలోని ఉన్నతస్థాయి కమిటీ ఆదివారం ముచ్చర్లలోని ఫ్యూచర్ సిటీతోపాటు హెచ్ఐసీసీ, హైటెక్స్, గచ్చిబౌలి స్టేడియం, దుండిగల్ తదితర ప్రాంతాలను పరిశీలించింది. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క విలేకరులతో మాట్లాడుతూ.. సమ్మిట్ కోసం హైదరాబాద్ నలుదిక్కులా వివిధ ప్రాంతాలను పరిశీలించామని, వాటిలో ఒక ప్రాంతాన్ని ఎంపిక చేస్తామని చెప్పారు. ఇటీవల దుబాయ్ ఫెస్టివల్‌ను కూడా నగరానికి వెలుపలే నిర్వహించారని, గ్లోబల్ సమ్మిట్‌కు వివిధ దేశాల పారిశ్రామికవేత్తలను ఆహ్వానిస్తున్నామని తెలిపారు.
అద్భుతమైన వాతావరణం, నైపుణ్యంతో కూడిన మానవ వనరులు అందుబాటులో ఉన్న హైదరాబాద్ పెట్టుబడులకు అత్యంత అనుకూల ప్రాంతమని పేర్కొన్నారు. రాష్ట్రంలో గత రెండేండ్లుగా కాంగ్రెస్ ప్రభుత్వం సాధించిన విజయాలతోపాటు 2047 నాటికి తెలంగాణ ఏ విధంగా ఉండబోతున్నది? ఏ విధంగా ఉండాలి? అనే అంశాలతో కూడిన విజన్ డాక్యుమెంట్ గురించి ప్రపంచానికి వివరించనున్నట్టు చెప్పారు. కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు సందీప్ కుమార్ సుల్తానియా, వికాస్‌రాజ్, శశాంక, నర్సింహారెడ్డి, కృష్ణ భాసర్, ముషారఫ్ అలీ తదితరులు పాల్గొన్నారు