హైదరాబాద్, డిసెంబర్ 7 (నమస్తే తెలంగాణ): పోలవరం ప్రాజెక్టుపై తెలంగాణ, ఛత్తీస్గఢ్, ఒడిశా రాష్ర్టాలతో ఏకాభిప్రాయం సాధించాలని, ఆ దిశగా సీఎంల స్థాయిలో సమావేశం నిర్వహించాలని కేంద్ర జలసంఘం(సీడబ్ల్యూసీ)ను సుప్రీంకోర్టు ఆదేశించింది. ముంపుపై పూర్తి నివేదిక అందజేయాలని సూచించింది.
పోలవరం ప్రాజెక్టు వల్ల ముంపుపై సమగ్ర అధ్యయనం చేయించాలని, రక్షణ చర్యలు చేపట్టాలని, ప్రభావిత రాష్ర్టాలైన తెలంగాణ, ఒడిశా, ఛత్తీస్గఢ్ డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. అందుకు ఏపీ, పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ) వ్యతిరేకించడంతో బాధిత రాష్ర్టాలు సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. ఆ పిటిషన్పై బుధవారం విచారణ కొనసాగింది.
పోలవరంతో తమ ప్రాంతాలు ముంపునకు గురవుతున్నాయని, ముంపు నివారణపై ముఖ్యమంత్రుల స్థాయిలో సమావేశం నిర్వహించలేదని కోర్టుకు పిటిషనర్లు తెలిపారు. ఈ ఏడాది అక్టోబర్ తర్వాత ముంపు ప్రాంతాల విషయంలో ఎలాంటి పురోగతి లేదని ఒడిశా ప్రభుత్వం ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చింది. రెండు నెలల్లో పోలవరం ముంపుపై జలశక్తి మంత్రిత్వశాఖ తరపున నివేదిక అందించనున్నట్టు అదనపు సోలిసిటర్ కోర్టుకు తెలిపారు. అంతిమంగా సీడబ్ల్యూసీ ఒక మార్గాన్ని ప్రతిపాదిస్తుందని, ఆ విషయంలో జలసంఘం రాష్ట్రాలను బలవంత పెట్టలేదని ధర్మాసనం వ్యాఖ్యానించింది. తదుపరి విచారణ ఫిబ్రవరి 15కి వాయిదా వేసింది.