మానకొండూర్ రూరల్, మే 17 : కొనుగోలులో జాప్యం రైతులకు శాపంలా మారుతున్నది. మండుటెండల్లో అన్నదాతలు కొనుగోలు కేంద్రాల చుట్టూ తిరుగుతూ నెరివడాల్సి వస్తున్నది. ఇలానే వారం నుంచి మార్కెట్‌యార్డు చుట్టూ తిరుగుతున్న ఓ కౌలు రైతు తీవ్ర అస్వస్థతకు గురై దవాఖానలో పరిస్థితి విషమించి ప్రాణాలు కోల్పోయాడు. ఎండదెబ్బ వల్లే చనిపోయాడని కుటుంబసభ్యులు కన్నీరు పెడుతున్నారు. వివరాల ప్రకారం.. కరీంనగర్ జిల్లా మానకొండూర్‌కు చెందిన గుర్రాల రాజయ్య (65) యాసంగిలో రెండెకరాలు కౌలుకు తీసుకుని వరి సాగుచేశాడు. వారం క్రితమే పంట కోయించాడు.
60 బస్తాలకుపైగా వడ్లు రాగా, మానకొండూర్ వ్యవసాయ మార్కెట్ యార్డ్‌కు తీసుకొచ్చాడు. అప్పటినుంచి ఎప్పుడు వడ్లు కొంటరా? అని ఎదురుచూస్తున్నాడు. వారం నుంచి రోజూ ఎండలోనే మార్కెట్ వెళ్లి వస్తున్నాడు. శనివారం మార్కెట్‌కు వెళ్లి, రాత్రి ఇంటికి వచ్చాడు. భోజనం చేసి నిద్రపోయాడు. ఆదివారం తెల్లవారు జామున 2 గంటల ప్రాంతంలో తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో కుటుంబ సభ్యులు కరీంనగర్ ప్రభుత్వ దవాఖానకు తీసుకెళ్లారు. చికిత్స అందిస్తుండగానే పరిస్థితి విషమించి మృతి చెందినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. ఎండ దెబ్బతో ప్రాణాలు కోల్పోయాడని కన్నీరుమున్నీరయ్యారు.