ఆత్మకూరు(ఎం)/యాదగిరిగుట్ట/మోటకొండూరు/నాగారం మోత్కూ రు, ఫిబ్రవరి 21: ఎన్నికల్లో అమలు కాని హామీలను ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీలను అమలు చేస్తే రాజకీయాల నుంచి తప్పుకొంటామని.. ఈ మాట తాను మాజీ ఆర్థిక మంత్రిగా చెప్తున్నానని మాజీ మంత్రి, బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యు డు ఈటల రాజేందర్ అన్నారు. బీజేపీ ఆధ్వర్యంలో చేపట్టిన విజయ సంకల్ప యాత్ర బుధవారం యాదాద్రి జిల్లా ఆత్మకూరు (ఎం), యాదగిరిగుట్ట, మోటకొండూరు, సూర్యాపేట జిల్లా నాగారం, మోత్కూరు మండలాల్లో కొనసాగింది. ఈ సందర్భంగా ఈటల మాట్లాడుతూ.. దేశ రక్షణ కోసం ప్రధాని మోదీ నాయకత్వం అవసరమని చెప్పారు. కాంగ్రెస్ ఎన్ని కుట్రలు, కుతంత్రాలు చేసినా మరో 20 ఏండ్ల వరకు కేంద్రంలో అధికారంలోకి రాదని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల హామీలను నెరవేర్చకుండా కల్లబొల్లి మాటలు చెప్తూ పబ్బం గడుపుతున్నదని విమర్శించారు. ‘రైతు రుణమాఫీ ఏమాయె?.. రైతుబంధు ఎటుపాయె?.. మహిళలకు రూ. 2500, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇప్పటి వరకు ఇవ్వడం చేతగాని ప్రభుత్వం ఇది’.. అంటూ ఎద్దేవా చేశారు. రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ సాధ్యంకాని హామీ అన్నారు. ప్రజలు కాంగ్రెస్కు ఓట్లు వేసింది ప్రేమతో కాదని పేర్కొన్నారు. ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చకుంటే మంత్రులను, కాంగ్రెస్ నాయకులను గ్రామాల్లోకి రానివ్వకుండా తరిమికొట్టాలని పిలుపునిచ్చారు.