ఆసిఫాబాద్ టౌన్, ఆగస్టు 22 : కాంగ్రెస్ ప్రభుత్వం భూభారతి పేరుతో రైతుల భూములను లాకునేందుకు యత్నిస్తున్నదని ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి, సిర్పూర్ మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప ఆరోపించారు. శనివారం కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే నివాసంలో మీడియాతో వారు మాట్లాడారు.
కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన భూభారతి చట్టం 22ఏ కింద అమాయక రైతుల భూములను నిషేధిత జాబితాలో చేర్చడంతో వారు తీవ్ర ఇబ్బందులు ఎదురొంటున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. అక్రమ వసూళ్ల కోసమే 22ఏ నిబంధన తీసుకొచ్చారని విమర్శించారు. భూభారతి చట్టం ‘భూ స్వాహా చట్టం’గా మిగిలిపోతుందని ఎద్దేవాచేశారు. అర్హులైన రైతుల భూములను 10 రోజుల్లోగా నిషేధిత జాబితా నుంచి తొలగించకపోతే ఆందోళన కార్యక్రమాలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అనంతరం అదనపు కలెక్టర్ డేవిడ్‌కు వినతిపత్రం అందజేశారు.