హైదరాబాద్, జనవరి 3 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్‌లో కుమ్ములాటలు కొనసాగుతూనే ఉన్నాయి. నేతల మధ్య వైరం అంతకంతకూ పెరుగుతూనే ఉన్నది. ఈ నెల 26 నుంచి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి పాదయాత్రకు సిద్ధమవుతుండగా, ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ చైర్మన్ ఏలేటి మహేశ్వర్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. రేవంత్‌రెడ్డి పాదయాత్రకు ఏఐసీసీ అనుమతి లేదని ఆయన ప్రకటించడం తాజా పరిస్థితికి నిదర్శనం. మహేశ్వర్‌రెడ్డి వ్యాఖ్యలతో రేవంత్ పాదయాత్రపై దుమారం రేగుతున్నది. ఏఐసీసీ నుంచి వచ్చిన సర్యులర్ ఒకలా ఉంటే.. రేవంత్‌రెడ్డి మరోలా చెబుతున్నాడని మహేశ్వర్‌రెడ్డి మాట్లాడటాన్ని చూస్తే కాంగ్రెస్ పార్టీలో నాయకుల మధ్య సయోధ్య కుదరలేదనే అభిప్రాయం వినిపిపిస్తున్నది.
ఉత్తమ్‌కు ఖర్గే ఫోన్..!
టీ కాంగ్రెస్‌లో మరోసారి సీనియర్లు, జూనియర్ల అంశం తెరపైకి వచ్చింది. ‘హాథ్ సే హాథ్ జోడో అభియాన్’ కార్యక్రమంపై బుధవారం బోయిన్‌పల్లిలో శిక్షణ తరగతులు నిర్వహించాలని పార్టీ నిర్ణయించింది. అయితే ఈ శిక్షణకు వెళ్లాలా ? వద్దా ? అని సీనియర్లు ఆలోచనలో పడ్డారు. ఈ నేపథ్యంలో ఉత్తమ్‌కుమార్‌కు ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే ఫోన్ చేయడం చర్చనీయాంశమైంది. శిక్షణ తరగతులకు సీనియర్లు వెళ్లాలని, పార్టీ అంతర్గత సమస్యలను వారం రోజుల్లో పరిషరిస్తామని ఖర్గే ఫోన్లో వివరించినట్టు సమాచారం. అయితే అసమ్మతి నేతలతో ఏఐసీసీ ఇన్చార్జి కార్యదర్శి బోసురాజు దాదాపు రెండుగంటలకు పైగా మాట్లాడినట్టు తెలిసింది.