(స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, సెప్టెంబర్ 17 (నమస్తే తెలంగాణ): ‘వాల్మీకి కార్పొరేషన్’ స్కామ్‌లో ఒకవైపు కాంగ్రెస్ సర్కారు పీకల్లోతు మునిగిపోయి ఉంటే, బీజేపీ ఎమ్మెల్యే మునిరత్న దళితులపై దుర్భాషలాడిన ఆడియో టేపులు తాజాగా బయటపడటం కన్నడ రాజకీయాలను కుదిపేస్తున్నది. మునిరత్న తనను, తన కుటుంబంలోని మహిళలను కులం పేరిట దూషించినట్టు బృహత్ బెంగళూరు మహానగర పాలికకు చెందిన చెలువరాజు అనే కాంట్రాక్టర్ ఇటీవల ఆరోపించారు. కాంట్రాక్ట్ పనులకు లంచం ఇవ్వనందుకే మునిరత్న ఇలా చేసినట్టు ఆరోపించిన చెలువరాజు.. దుర్భాషలకు సంబంధించిన ఆడియో క్లిప్స్‌ను విడుదల చేశారు. మునిరత్న తనపై దాడి చేసినట్టు కూడా ఆరోపించాడు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేశారని తెలుసుకొన్న మునిరత్న గత శనివారం ఏపీకి వెళ్లేందుకు యత్నించారు. పోలీసులు ఆయన్ని అదుపులోకి తీసుకొని కోర్టులో హాజరుపర్చారు. న్యాయస్థానం మునిరత్నను 14 రోజుల పోలీసు కస్టడీకి అప్పగిస్తూ ఆదేశాలు జారీ చేసింది.
బీజేపీలో అంతర్మథనం
దళితులపై మునిరత్న చేసిన వ్యాఖ్యలపై రాష్ట్ర బీజేపీ నేతలు ఆచితూచి మాట్లాడుతున్నారు. ఈ విషయంపై కేంద్ర నాయకత్వానిదే తుది నిర్ణయమని తేల్చిచెప్తున్నారు. ‘మునిరత్నపై ఏ నిర్ణయాన్నైనా కేంద్ర నాయకత్వమే తీసుకోవాలి’ అని కర్ణాటక బీజేపీ క్రమశిక్షణ కమిటీ ప్రెసిడెంట్ లింగరాజ్ పాటిల్ అన్నారు. వాల్మీకి స్కామ్ పేరిట కాంగ్రెస్ సర్కారును చిక్కుల్లో పెట్టాలనుకొన్న బీజేపీ పరివారానికి మునిరత్న వ్యవహారం కొత్త చిక్కులను తీసుకొచ్చినట్టు రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు.
ఇంకా చదవల్సిన వార్తలు
బీజేపీ మెడకూ ‘ముడా’ స్కామ్!
(స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, సెప్టెంబర్ 17 (నమస్తే తెలంగాణ): కర్ణాటక రాజకీయాలను కుదిపేస్తున్న ముడా స్కామ్ బీజేపీ మెడకూ చుట్టుకొన్నట్టు కనిపిస్తున్నది. ముడా భూములను బినామీల పేరిట బీజేపీ రాష్ర్టాధ్యక్షుడు బీవై విజయేంద్ర చేజిక్కించుకొన్నట్టు కర్ణాటక బీసీ అవేర్నెస్ ఫోరమ్ ప్రెసిడెంట్ కేఎస్ శివరాము సంచలన ఆరోపణలు చేశారు. ఈ తతంగంలో బీజేపీ మైసూరు అధ్యక్షు డు ఎల్ఆర్ మహదేవస్వామి, ము డా మాజీ కమిషనర్ డీబీ నటేశ్ హస్తం కూడా ఉన్నట్టు తెలిపారు. రూ.7 కోట్ల విలువైన భూములను రూ. 5.36 లక్షలకే బినామీల పేరిట విజయేంద్ర కొనుగోలు చేసినట్టు ఆరోపించారు.