దేవరుప్పుల, ఆగస్టు 14 : స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడొచ్చినా ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా బీఆర్ఎస్ సత్తా చాటుతుందని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. కాంగ్రెస్ పార్టీ చేయించిన సర్వేలో ఈ విషయం స్పష్టంగా తేలిందని తెలిపారు. గురువారం జనగామ జిల్లా దేవరుప్పులలో పలు కార్యక్రమాలకు హాజరైన ఎర్రబెల్లి మీడియాతో మాట్లాడారు. సొంత సర్వే బీఆర్ఎస్కు అనుకూలంగా ఉండటంతో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకు ఆ పార్టీ వణుకుతున్నదని, అందుకే ప్రభుత్వం వాయిదాలు వేస్తూ వస్తున్నదని దుయ్యబట్టారు. తక్కువ కాలంలో దారుణమైన ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకున్న రేవంత్రెడ్డి ప్రభుత్వాన్ని గద్దెదింపడానికి ప్రజలు ఎదురుచూస్తున్నారని తెలిపారు. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా జడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్ల ఎన్నికల్లో గులాబీ జెండా ఎగరడం ఖాయమని ధీమా వ్యక్తంచేశారు.