నాగర్‌కర్నూల్, ఆగస్టు 26 : సోషల్ మీడియా వారియర్‌పై ఓ ఎస్సై దాష్టీకానికి పాల్పడ్డాడు. దురుసుగా ప్రవర్తించడమే కాకుండా దారుణంగా చితకబాదాడు. దాహం వేస్తుందనడంతో ముఖంపై మూత్ర విసర్జన చేసిన అమానవీయ ఘటన నాగర్‌కర్నూల్ జిల్లాలో చోటుచేసుకున్నది. బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం.. తిమ్మాజిపేట మండలం ఆవంచకు చెందిన పాలమూరి మహేందర్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా మండల ఇన్చార్జిగా కొనసాగుతున్నాడు.
మంగళవారం ఉదయం తిమ్మాజిపేట పోలీస్‌స్టేషన్ నుంచి కానిస్టేబుల్ నర్సింహ సదరు యువకుడికి ఫోన్‌చేసి ఎస్సై సార్ రమ్మంటున్నారని చెప్పాడు. మహేందర్‌రెడ్డి వెంటనే స్టేషన్‌కు వెళ్లగా.. మధ్యాహ్నం తరువాత ఎస్సై శ్రీనివాసరావు వచ్చి.. ‘ఆవంచలో ఓ యువతి కనిపించడం లేదంటూ నువ్వు తప్పుడు ప్రచారం చేస్తున్నావంటా? యువతి కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు’ అంటూ దురుసుగా ప్రవర్తించినట్టు మహేందర్‌రెడ్డి వాపోయాడు. అప్పటికే ఎస్సై గదిలోనే ఉన్న యువతి కుటుంబ సభ్యులు తనను తిట్టడంతోపాటు ఎన్ని కేసులు ఉన్నాయో.. అన్నీ తీయండి.. రౌడీషీట్ ఓపెన్ చేయిద్దామంటూ బెదిరింపులకు పాల్పడినట్టు తెలిపాడు. అయితే గతంలోనే వారు పలుమార్లు తనపై దాడికి పాల్పడ్డారని మహేందర్ పేర్కొన్నాడు.
పాత కేసులను దృష్టిలో పెట్టుకొని కావాలనే ఇప్పుడు తప్పుడు ఫిర్యాదు చేయడంతో ఎస్సై తనను దారుణంగా చితకబాదాడని ఆరోపించాడు. తాను భోజనం చేయకుండా వచ్చానని చెప్పినా పట్టించుకోకుండా ‘నీకు సోషల్ మీడియా ఇన్చార్జి ఇచ్చింది ఎవడ్రా? కాపు కొడుకుల్లారా? నా రికార్డు తెలుసారా? నా గురించి తెలుసారా? ఇప్పటికీ రెండు ఎన్కౌంటర్లు చేశాను.. నీది మూడో ఎన్కౌంటర్ అయితది.. మీ ప్రాంతంలోనే నిన్ను వేసేస్తా’ అంటూ దుర్భాషలాడుతూ బెదిరింపులకు పాల్పడినట్టు మహేందర్‌రెడ్డి వాపోయాడు. తర్వాత దాహం వేస్తుంది సార్ అంటే కోపంతో తన ముఖంపై మూత్ర విసర్జన చేశాడని కన్నీటిపర్యంతమయ్యాడు. ఇదే విషయమై బాధితుడు సాయంత్రం తరువాత నాగర్‌కర్నూల్‌లో డీఎస్పీకి ఫిర్యాదు చేశాడు.
బాధితుడు మహేందర్‌రెడ్డి ఫిర్యాదు చేసిన మరుసటిరోజు నాగర్‌కర్నూల్ డీఎస్పీ బుర్రి శ్రీనివాసులు స్పందించారు. ఆవంచకు చెందిన మహేందర్‌రెడ్డిని విచారణ పేరుతో ఎస్సై స్టేషన్‌కు పిలిపించి కొట్టిన మాట వాస్తవమేనని తెలిపారు. గ్రామంలో ఓ యువతి పట్ల అసభ్యంగా మాట్లాడాడని, సదరు యువతి తండ్రికి చెప్పగా.. కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారని పేర్కొన్నారు. మహేందర్‌ను స్టేషన్‌కు పిలిచి విచారణలో భాగంగా ఎస్సై కొట్టినట్టు చెప్పారు. కానీ ముఖంపై మూత్ర విసర్జన చేశారనేది నమ్మశక్యంగా లేదని అన్నారు. సీఐ అశోక్‌రెడ్డితో విచారణ జరిపిస్తున్నామని, పూర్తి వివరాలు తెలుసుకొని నిజమైతే చర్యలు తీసుకుంటామని తెలిపారు. కాగా నాగర్‌కర్నూల్ సీఐ విచారణ చేపట్టారు. స్టేషన్‌లోని సీసీ కెమెరాలను పరిశీలించారు. కానిస్టేబుళ్లను విచారించామని, పూర్తి వివరాలు తెలుసుకొని ఉన్నతాధికారులకు నివేదిక సమర్పిస్తామని సీఐ తెలిపారు.