హైదరాబాద్, జులై 5 (నమస్తే తెలంగాణ): పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి వ్యవహార శైలిపై ఇప్పటికే విసిగిపోయిన ఆ పార్టీ సీనియర్ నేతలు తిరుగుబాటుకు సిద్ధమవుతున్నారు. రేవంత్‌రెడ్డి ఆగడాలను ఇక ఉపేక్షించొద్దని, తాడో పేడో తేల్చుకోవాలన్న నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తున్నది. సీనియర్ల వ్యూహరచనకు దివంగత పీ జనార్ధన్‌రెడ్డి కుమారుడు, మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్‌రెడ్డి ఇల్లు వేదికైంది. ఇప్పటికే అసంతృప్తిగా ఉన్న విష్ణు.. మంగళవారం తన ఇంట్లో సీనియర్లకు లంచ్ మీటింగ్‌ను ఏర్పాటుచేశారు.
ఈ భేటీకి వీ హనుమంతరావు, దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, మధుయాష్కీగౌడ్ తదితరులు హాజరయ్యారు. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అధిష్టానం పిలుపుతో ఢిల్లీకి వెళ్లినందున సమావేశానికి రాలేకపోయారు. సమావేశం గురించి తెలుసుకొన్న రేవంత్‌రెడ్డి.. అధిష్ఠానం నుంచి సీనియర్లకు హెచ్చరికలు జారీ చేసినట్టు తెలిసింది. దీంతోపాటు లంచ్ భేటీకి తన అనుచరులను కూడా పంపించారు. భట్టి విక్రమార్క లేకపోవడం, రేవంత్ అనుచరులు రావడంతో కీలక అంశాలను చర్చించలేదని తెలుస్తున్నది. మళ్లీ త్వరలోనే సీనియర్లంతా సమావేశమవ్వాలని నిర్ణయించినట్టు సమాచారం.
అన్నా.. చెల్లి.. మధ్యలో రేవంత్
ఇటీవల పలువురు నేతలను చేర్చుకొన్న తీరు కాంగ్రెస్‌లో చిచ్చు రేపుతున్నది. ఆయా జిల్లాల కీలక నేతలకు కనీస సమాచారం ఇవ్వకుండానే రేవంత్‌రెడ్డి డైరెక్షన్లో కొనసాగిన చేరికల వ్యవహారం వివాదస్పదమైంది. ఖమ్మం జిల్లాలో భట్టి విక్రమార్కకు తెలియకుండా తాటి వెంకటేశ్వర్లు, ఖైరతాబాద్‌లో దాసోజు శ్రవణ్, ఇతర నేతలకు తెలియకుండా విజయారెడ్డిని పార్టీలో చేర్చుకొన్నారు. విజయారెడ్డి చేరికపై ఆమె అన్న విష్ణువర్ధన్‌రెడ్డి అసంతృప్తిగా ఉన్నట్టు తెలిసింది. తనకు కనీసం సమాచారం ఇవ్వకుండా చేర్చుకోవడంతో రేవంత్‌రెడ్డిపై గుర్రుగా ఉన్నట్టు తెలిసింది. ఈ నేపథ్యంలో ఆయన అసంతృప్త నేతలతో జతకట్టినట్టు సమాచారం. చేరికల గురించి చేరికల కమిటీ చైర్మన్ జానారెడ్డికి కూడా తెలియకపోవడం కొసమెరుపు. ఇలాంటి చర్యల ఫలితంగా సీనియర్లు తీవ్ర ఆసహనం, ఆగ్రహంతో రగిలిపోతున్నారు.
అసంతృప్తులపై అధిష్ఠానం ఆరా
సీనియర్ నేత వీహెచ్‌ను ఉద్దేశించి బండకేసి కొడతానని రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించడం, దీనిపై జగ్గారెడ్డి ఘాటుగా స్పందించడం, విష్ణువర్ధన్‌రెడ్డి ఇంట్లో సీనియర్ల లంచ్ భేటీ, చేరికల సమయంలో అసంతృప్తులు తదితర అంశాలపై అధిష్ఠానం ఆరా తీసినట్టు తెలిసింది. భట్టి విక్రమార్క కూడా రేవంత్‌రెడ్డి వ్యవహారశైలి, సీనియర్లను పట్టించుకోకపోవడం, ఏకపక్ష నిర్ణయాలపై అధిష్ఠానానికి ఫిర్యాదు చేసినట్టు సమాచారం.