జగిత్యాల, జనవరి 27 (నమస్తే తెలంగాణ)/ కరీంనగర్ కలెక్టరేట్: రుణమాఫీ కోసం రైతులు కాళ్లరిగేలా తిరుగుతున్నారు. అటు వ్యవసాయ అధికారులు, ఇటు బ్యాంకుల చుట్టూ తిరిగి తిరిగి అలిసిపోతున్నారు. ఎన్నికల ముందు రైతులందరికీ రూ.2 లక్షలు మాఫీ చేస్తామని చెప్పిన కాంగ్రెస్, అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక కొర్రీలు పెట్టి తమ పొట్టకొట్టిందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వందశాతం చేశామని చెప్తున్నా, అందులో ఏ మాత్రం నిజం లేదని అంటున్నారు. తమకు అన్ని అర్హతలున్నా ఎగనామం పెట్టిందని కరీంనగర్, జగిత్యాల జిల్లాల్లో చాలా మంది రైతులు ఆరోపిస్తున్నారు. సోమవారం ఆయా జిల్లాల కలెక్టరేట్లలో జరిగిన ప్రజావాణికి తరలివచ్చి రుణమాఫీపై ఏకరవు పెట్టారు. ప్రభుత్వం ప్రకటించిన నాలుగు జాబితాల్లో తమ పేర్లు రాలేదని, అప్పటి నుంచి అధికారులు, బ్యాంకుల చుట్టూ తిరుగుతూనే ఉన్నామని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం వెంటనే తమకు రుణమాఫీ చేయాలని కోరుతూ కలెక్టర్లకు వినతి పత్రాలు సమర్పించారు.
నాసోంటి గోస ఎవరికీ రావొద్దు..
నాకు రెండెకరాల పొలం ఉంది. నేను పైడిమడుగు ఇండియన్ బ్యాంక్ బ్రాంచిలో రూ.1.10 లక్షలు పంట రుణం తీసుకున్న. ఏటా రెన్యువల్ చేసుకుంటున్న. వడ్డీ చెల్లించిన. కానీ నాకు రుణమాఫీ కాలేదు. మూడు జాబితాల్లోనూ నా పేరు రాలేదు. ఆఖరి లిస్టులోనూ పేరు లేకుండాపోయింది. వ్యవసాయ అధికారులు, బ్యాంకు అధికారుల వద్దకు, కలెక్టరేట్‌కు తిరిగి తిరిగి రేగాళ్లు పడ్డాయి. కానీ లోన్ మాత్రం మాఫీ కాలేదు. ఏ అధికారిని అడిగినా సప్పుడు చేత్తలేడు. మళ్లీ దరఖాస్తు చేసుకునేందుకు వచ్చిన. నాసోంటి గోస ఎవరికీ రావద్దు.
– పాలడుగు గంగారాం, మైతాపూర్, రాయికల్ మండలం
మాఫీ కోసం తిరిగి తిరిగి యాష్టకచ్చింది..
నాలుగేండ్ల కింద కొత్తపల్లి యూనియన్ బ్యాంకులో రూ.88 వేల రుణం తీసుకున్న. ఎలక్షన్లకు ముందు రుణమాఫీ చేస్తమని కాంగ్రెసోళ్లు అంటే సంబురపడి ఓట్లేసినం. రెండు నెలల కింద రుణమాఫీ మొదలైందంటే, మాకు కూడా అయితదని అనుకున్నం. నాలుగుసార్లు లిస్టు పెట్టిండ్లు. ఒక్క లిస్టులో కూడా నాపేరు లేదు. బ్యాంకోళ్ల దగ్గరికి పోయి అడిగితే, వ్యవసాయాధికారిని అడుగాలే అన్నరు. ఆయననడిగితే బ్యాంకొల్లనే అడుగాలే అంటండ్లు. వాళ్లిద్దరి దగ్గరికి తిరిగి తిరిగి యాష్టకచ్చి కలెక్టరమ్మనన్న కలిసి నా బాధ చెప్పుకుందామని వచ్చిన.
– భక్తి చంద్రయ్య, మల్లన్నపల్లి గ్రామం, చొప్పదండి మండలం