హైదరాబాద్, అక్టోబర్ 9 (నమస్తే తెలంగాణ): బీసీ రిజర్వేషన్ల (BC Reservations) అంశంపై దేశ సర్వోన్నత న్యాయస్థానం తీర్పులున్నాయి. మార్గదర్శకాలు విధివిధానాలను స్పష్టంచేస్తున్నాయి. పరిమితి దాటితే రాజ్యాంగ నిబంధనలు అసాధ్యమని తేల్చి చెప్తున్నాయి. దేశాన్ని సుదీర్ఘకాలం పాలించిన కాంగ్రెస్ పార్టీ (Congress) ఏలుబడిలోనే ఇవన్నీ రూపుదిద్దుకున్నాయి. వాటన్నింటికీ భిన్నంగా బీసీ రిజర్వేషన్ల అంశాన్ని తెలంగాణలోని అదే కాంగ్రెస్ సర్కార్ తెరమీదకు తీసుకొచ్చింది.
అందులో అసలు ఆంతర్యం ఆ పార్టీ రాజకీయ లబ్ధిపొందడమే. బీసీలపై ఎలాంటి చిత్తశుద్ధి హస్తం పార్టీలో వీసమెత్తు కూడా లేదని వరుస పరిణామాలే చెప్తున్నాయి. రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్లపై ఆ పార్టీ చేపడుతున్న ప్రక్రియే ఇందుకు నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తుంది. ఎన్నికకో ఎత్తుగడ వేస్తూ బీసీ అంశాన్ని తెరమీదకు తెస్తూ పబ్బం గడుతున్నది. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తరువాత ఆరు నెలల్లో అమలు చేస్తామని హామీ ఇచ్చి నేడు 22 నెలలైనా పూటకో మాట, రోజుకో డ్రామాకు తెరతీస్తున్నది.
బీసీలను ఓటు బ్యాంకు రాజకీయాలకు పావుగా వాడుకుంటున్నది. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కామారెడ్డి డిక్లరేషన్‌ను కాంగ్రెస్ పార్టీ అట్టహాసంగా ప్రకటించింది. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన వెంటనే కులగణన నిర్వహించి, బీసీల రిజర్వేషన్లను 42శాతానికి పెంచుతామని ఢంకా బజాయించి చెప్పింది. కానీ లోక్‌సభ ఎన్నికలు సమీపించే వరకూ ఎలాంటి ప్రక్రియ చేపట్టనేలేదు. లోక్‌సభ ఎన్నికలకు నోటిఫికేషన్ వెలువడే తరుణంలో 2024 జనవరి 28న కులగణన కోసమంటూ రూ.150 కోట్లను విడుదల చేస్తూ జీవోను జారీచేసింది.
ఆ తర్వాత 2024 ఫిబ్రవరి 17న రాష్ట్రవ్యాప్తంగా ‘సామాజిక, ఆర్థిక, కుల ఇంటింటి సర్వే’ను నిర్వహించాలని అసెంబ్లీలో తీర్మానం చేసింది. సరిగ్గా లోక్‌సభ ఎన్నికల ముందు అంటే 2024 మార్చి 15న బీసీ సంక్షేమ శాఖ ఇంటింటి సర్వేను నిర్వహిస్తుందని జీవో 26 జారీచేసింది. సర్వేను ఏ పద్ధతిలో, ఏవిధంగా నిర్వహించాలనే అంశాలకు సంబంధించిన మార్గదర్శకాలను తదుపరి ప్రత్యేకంగా విడుదల చేస్తామని చెప్పి కాంగ్రెస్ చేతులు దులుపుకున్నది. ఆ తర్వాత మళ్లీ 6 నెలల వరకు ఆ ఊసే ఎత్తలేదు.
తెలంగాణలో కులగణన నిర్వహిస్తామని తీర్మానించిన 6 నెలల అనంతరం అంటే సరిగ్గా నిరుడు అక్టోబర్‌లో మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైంది. అదే సమయంలో తెలంగాణ కాంగ్రెస్ సర్కార్ మళ్లీ బీసీ రిజర్వేషన్ల అంశాన్ని తెరమీదకు తెచ్చింది. ఇంటింటి సర్వేను బీసీ సంక్షేమశాఖ కాకుండా ప్రణాళిక శాఖ నిర్వహిస్తుందని 2024 అక్టోబర్ 10న మరోసారి జీవో 18 జారీచేసింది. మహారాష్ట్రలో నవంబర్ 20న పోలింగ్ నిర్వహించగా, తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా 2024 నవంబర్ 6న ఇండ్ల గుర్తింపుతో ప్రారంభమైన సర్వే ప్రక్రియ అదే నెల 26 వరకు కొనసాగింది.
మహారాష్ట్రలో ఎన్నికల ప్రచారం చేస్తూనే మధ్యలోనే కాంగ్రెస్ లోక్‌సభా పక్షనేత రాహుల్‌గాంధీ హడావుడిగా తెలంగాణకు విచ్చేశారు. కులగణన అంశంపై ప్రజాసంఘాలు, కులసంఘాలు, సామాజికవేత్తల అభిప్రాయాలను తెలుసుకునేందుకు ప్రత్యేకంగా భేటీ అయి సుదీర్ఘంగా చర్చించడం.. హస్తం పార్టీ ఓటు బ్యాంకు రాజకీయాలకు సజీవ సాక్ష్యం. ఆ తర్వాత తూతూ మంత్రంగానే సర్వే గణాంకాలను వెల్లడించడం, పూర్తిస్థాయి నివేదికలను బయ పెట్టకుండానే అసెంబ్లీలో గత మార్చిలో బిల్లులను ప్రవేశపెట్టి ఆమోదించి, గవర్నర్‌కు పంపింది.
ఆ వెంటనే బిల్లులను ఆమోదించాలని డిమాండ్ చేస్తూ కొన్ని అనుకూల బీసీల సంఘాలతో కలిసి ఢిల్లీలో ధర్నా పేరిట డ్రామాలకు తెరతీసింది. కానీ కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ధర్నాకు ఢిల్లీలోనే అందుబాటులో ఉన్న ఆ పార్టీ అగ్రనేతలు ముఖం చాటేయడం గమనార్హం. ఇదీ బీసీలపై కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధి. ఇటీవల కాలం వరకు మళ్లీ ఆ ఊసే ఎత్తలేదు.
బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు నోటిఫికేషన్ రానున్న తరుణంలో కాంగ్రెస్ మళ్లీ బీసీ రిజర్వేషన్ల అంశాన్ని తెరమీదకు తీసుకొచ్చింది. తొలుత గత ఆగస్టులో పంచాయతీరాజ్, మున్సిపల్ చట్ట సవరణల పేరిట హంగామా చేసింది. గవర్నర్ వద్ద బీసీ బిల్లులు పెండింగ్‌లో ఉండగానే స్థానిక సంస్థల్లో బీసీల రిజర్వేషన్లను 42 శాతానికి పెంచుతూ సెప్టెంబర్ 26న కాంగ్రెస్ సర్కార్ జీవో9ని జారీచేసింది. ఆ వెంటనే రాష్ట్రంలో ఏకంగా రిజర్వేషన్లను ఖరారు చేస్తూ అదే నెల 29న షెడ్యూల్‌ను ప్రకటించింది. తాజాగా నోటిఫికేషన్ జారీచేయగా, హైకోర్టు ప్రస్తుతం స్టే విధించింది. మొత్తంగా అన్ని పరిణామాలను పరిశీలిస్తే ఎన్నికకొక డ్రామాకు కాంగ్రెస్ పార్టీ తెరతీస్తూ వచ్చింది. తెలంగాణలోనే కాదు బీహార్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే తాజాగా కర్నాటకలోనూ కులగణనకు అక్కడి సర్కార్ సిద్ధమవడం గమనార్హం.
కాంగ్రస్ ప్రభుత్వం పూటకో మాట చెప్తూ రిజర్వేషన్ల ప్రక్రియ మొత్తాన్ని పీటముడిగా మార్చింది. గందరగోళ పరిస్థితిని సృష్టించింది. కేవలం బీసీలను ఓటుబ్యాంకు రాజకీయాల కోసం వాడుకుంటున్నదే తప్ప మరో అంశం కాదని ఆ పార్టీ అనుసరిస్తున్న విధానాలే స్పష్టం చేస్తున్నాయి. కులగణన నుంచి జీవోల జారీ వరకు అన్ని అంశాల్లోనూ కాంగ్రెస్ సర్కారు పారదర్శకతకు పాతరేసింది. ఇంటింటి సర్వేను అడ్డదిడ్డగానే నిర్వహించింది. పూర్తిస్థాయి గణాంకాలనూ ఇప్పటికీ బహిర్గతం చేయలేదు.
కమిషన్ నివేదికను వెల్లడించకుండానే బిల్లుల ప్రవేశపెట్టి ఆమోదం తెలిపింది. ఆ బిల్లులు గవర్నర్ ఆమోదానికి చేపట్టాల్సిన న్యాయప్రక్రియను చేపట్టనేలేదు. కానీ వెంటనే ఆ బిల్లులను కేంద్రం ఆమోదించి 9వ షెడ్యూల్లో చేర్చాలన్న డిమాండ్‌ను ఎత్తుకున్నది. తుదకు ఆర్డినెన్స్ ద్వారా బిల్లులను అమలు చేయాలని, బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలని రాష్ట్ర క్యాబినెట్లో నిర్ణయించింది. వాస్తవంగా రాష్ట్రపతి, గవర్నర్ వద్ద పెండింగ్‌లో ఉన్న బిల్లులపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోకూడదు. తీసుకున్నా అవి చెల్లబోవనేది న్యాయనిపుణులు చెప్తున్నారు.