హైదరాబాద్, సెప్టెంబర్1 (నమస్తే తెలంగాణ): ఆదివాసీలు, గిరిజనుల మధ్య కాంగ్రెస్ పార్టీ చిచ్చు పెడుతున్నదని తెలంగాణ గిరిజన సంఘం డిమాండ్ చేసింది. లంబాడీలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలనడం రాజ్యాంగ వ్యతిరేకమని నిప్పులు చెరిగింది. సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ధర్మనాయక్, శ్రీరాంనాయక్ సోమవా రం ప్రకటన విడుదల చేశారు. లంబాడీలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలని కాంగ్రెస్ పార్టీ నేతలు సోయం బాబురావు, ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు కోర్టును ఆశ్రయించడం దారుణమని మండిపడ్డారు.
వారి చర్యలపై కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన వైఖరి ప్రకటించాలని డిమాండ్ చేశారు. 50 ఏండ్లుగా ఎస్టీ జాబితాలోని లంబాడీలను ఇప్పుడు తొలగించాలని డిమాండ్ చేయడం రాజ్యాంగ వ్యతిరేకమని పేర్కొన్నారు. గిరిజన తెగల్లో ఘర్షణ సృష్టించి, లబ్ధి పొందాలని కాంగ్రెస్ చూస్తున్నదని ధ్వజమెత్తారు. సోయం బాపురావు, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావును తక్షణం కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని కోరారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా, వాటి నుంచి గిరిజనుల దృష్టిని మళ్లించేందుకే కాంగ్రెస్ పార్టీనే లంబాడీలు, ఆదివాసీల మధ్య చిచ్చరేపుతున్నదని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఓటు బ్యాంకు రాజకీయాల కోసం బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఆడుతున్న మాయలో గిరిజనులు పడొద్దని విజ్ఞప్తి చేశారు.