హైదరాబాద్ సిటీబ్యూరో, ఫిబ్రవరి 3 (నమస్తే తెలంగాణ): ఆటోడ్రైవర్ల ఆత్మహత్యలకు సీఎం రేవంత్‌రెడ్డే కారణమని బీఆర్టీయూ ఆటో యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు వేముల మారయ్య మండిపడ్డారు. కాంగ్రెస్ సర్కార్ ఆటోడ్రైవర్ల ఉపాధిపై దెబ్బకొట్టి, కుటుంబాన్ని పోషించుకోలేని దుస్థితి కల్పించిందని ఆవేదన వ్యక్తంచేశారు. రాష్ట్రంలో 80 మందికిపైగా ఆటోడ్రైవర్లు ఆత్మహత్య చేసుకుంటే ప్రభుత్వం నుంచి కనీస స్పందన కరువైందని నిప్పులుచెరిగారు. సోమవారం మల్కాజిగిరి లో సమావేశమైన బీఆర్టీయూ నాయకులు హామీలపై ప్రభుత్వాన్ని నిలదీయాలని నిర్ణయించారు. ఆటోడ్రైవర్లకు సంక్షేమ బోర్డు, ఏడాదికి రూ.12 వేలు పంపిణీ వాగ్దానాలను నెరవేర్చేవరకు ఉద్యమిస్తామని మారయ్య తెలిపారు. డీజిల్ ఆటోలను ఔటర్ రోడ్డు బయటకు పంపిస్తామని చెప్తున్న సీఎం రేవంత్‌రెడ్డి వాటి స్థానంలోఎలక్ట్రిక్ ఆటోలు పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. సమావేశంలో బీఆర్టీయూ రాష్ట్ర నాయకులు మహేశ్ దేశ్పాక్, ఉపాధ్యక్షుడు రమేశ్, రాష్ట్ర కార్యదర్శి బాలనరసింహ, మేడ్చల్ జిల్లా అధ్యక్షుడు హైమద్, నాయకులు ప్రదీప్, శ్రీనివాస్, గోపాల్, మహేశ్ తదితరులు పాల్గొన్నారు.