హైదరాబాద్, డిసెంబర్ 10 (నమస్తేతెలంగాణ):ఫ్యూచర్ సిటీలో కాంగ్రెస్ పార్టీ కోసం స్థలం కేటాయిస్తామని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ వెల్లడించారు. సీఎల్పీ కార్యాలయంలో బుధవారం ఆయన మీడియా ప్రతినిధులతో చిట్‌చాట్ చేశారు. ఈ నెలాఖరులోగా కార్పొరేషన్ చైర్మన్లు, బోర్డు పదవులను భర్తీ చేస్తామని తెలిపారు. పీసీసీ వరింగ్ ప్రెసిడెంట్, ఇతర ప్రచార కమిటీల పదవులనూ భర్తీ చేస్తామని చెప్పారు. రాబోయే ఎన్నికల్లో నిజామాబాద్ స్థానం నుంచి పోటీ చేసే విషయం అధిష్ఠానం నిర్ణయంపై ఆధారపడి ఉంటుందని చెప్పారు. తెలంగాణ భవిష్యత్తుకు గ్లోబల్ సమ్మిట్ సరికొత్త దశను నిర్ణయిస్తుందని పేర్కొన్నారు. ఈవీఎంలు కాంగ్రెస్ హయాంలోనే ప్రవేశపెట్టినా, ట్యాంపరింగ్ మాత్రం బీజేపీ హయాంలోనే మొదలైందని తెలిపారు.