Congress | తెలంగాణలో అధికారంలోకి వచ్చేసినట్టేనని కాంగ్రెస్ నేతలు కలలు కంటున్నారు. ముఖ్యమంత్రి సీటు నాదంటే.. నాదంటూ పది మంది దాకా పోటీలు పడుతున్నారు. కొందరైతే ప్రమాణ స్వీకారానికి డేట్లు కూడా ప్రకటిస్తున్నారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ పార్టీకి కృత్రిమంగా బలం పెంచేందుకు చేస్తున్న ప్రయత్నాలు ఇవి. కానీ, క్షేత్రస్థాయిలో పరిస్థితులు నేతల ప్రకటనలకు పూర్తి భిన్నంగా ఉన్నాయి. గత కొన్ని ఎన్నికలలో ఆ పార్టీ పరిస్థితిని విశ్లేషిస్తే కాంగ్రెస్నేతల ప్రకటనల్లోని డొల్లతనం అర్థమవుతుంది. తెలంగాణలోని అనేక నియోజకవర్గాల్లో హస్తం.. గతం అయిపోయింది.
తెలంగాణలో ఈసారి అధికారంలోకి వస్తామని కాంగ్రెస్ నేతలు బీరాలు పలుకుతున్నారు. కానీ, గత 20 – 30 ఏండ్లలో తెలంగాణలో ఆ పార్టీ ప్రభావాన్ని గమనిస్తే.. ఆ పార్టీ మునిగిపోతున్న నావగా కనిపిస్తున్నది. చాలా నియోజకవర్గాల్లో ఆ పార్టీ క్రమంగా పట్టు కోల్పోతూ కేవలం నామమాత్రంగా మారింది. రాష్ట్రంలోని 40కి పైగా నియోజకవర్గాల్లో కాంగ్రెస్‌కు గత కొన్ని ఎన్నికల్లో చేదు ఫలితాలే మిగిలాయి. దీంతో ఆయా నియోజకవర్గాల్లో హస్తం క్యాడర్ చెల్లాచెదురైంది.
2004లో అప్పటి టీఆర్ఎస్, సీపీఐ, సీపీఎంతో పొత్తు పెట్టుకొని ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేస్తామని హామీ ఇవ్వడం, మూడు పార్టీల బలం తోడు కావడంతో కాంగ్రెస్ పార్టీ ఆ ఎన్నికల్లో తెలంగాణ ప్రాంతంలో 48 స్థానాల్లో గెలిచింది. వీటిల్లో సిర్పూర్, చెన్నూర్, ఆదిలాబాద్, నిర్మల్, జుక్కల్, బాన్స్వాడ, కామారెడ్డి, బాల్కొండ, కరీంనగర్, మలక్‌పేట, కొడంగల్, అచ్చంపేట, తుంగతుర్తి, సత్తుపల్లి నియోజకవర్గాల్లో 2004 తర్వాత ఎన్నడూ విజయం సాధించలేదు.
అధికారం మాదే అని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. అయితే, గత 30 ఏండ్లలో జరిగిన ఫలితాలు చూస్తే ఆ పార్టీకి తెలంగాణలో ఎన్నడూ పెద్దగా సీన్ లేదని అర్థమవుతుంది. ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పుడు కూడా తెలంగాణలోని 119 నియోజకవర్గాలలో కాంగ్రెస్‌కు ఏనాడూ 50 సీట్లు రాలేదు. దీనిని బట్టి తెలంగాణలో ఆ పార్టీ బలం ఏపాటిదో అర్థం చేసుకోవచ్చు.
కాంగ్రెస్ బోణీ చేయని సెగ్మెంట్లు..
1967లో చార్మినార్, 1978లో చాంద్రాయణగుట్ట నియోజకవర్గాలు ఏర్పడగా ఇంతవరకు ఈ రెండు స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ గెలువలేదు. 2008లో అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన జరిగింది. అప్పటి నుంచి 2009, 2014, 2018లో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఈ మూడు ఎన్నికల్లోనూ బెల్లంపల్లి, మంచిర్యాల, నిజామాబాద్ అర్బన్, నిజామాబాద్ రూరల్, కోరుట్ల, ధర్మపురి, కుత్బుల్లాపూర్, కూకట్పల్లి, రాజేంద్రనగర్, దేవరకద్ర, పాలకుర్తి, వరంగల్ వెస్ట్, వైరా, రామగుండం, వేములవాడ, మలక్‌పేట, నాంపల్లి, బహదూర్‌పురా, నారాయణపేట నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ ఒక్కసారి కూడా గెలువలేదు. వీటిల్లోని కొన్ని స్థానాలకు గత 15 ఏండ్లలో జరిగిన ఉప ఎన్నికల్లోనూ ఆ పార్టీ ఓడిపోయింది. దీంతో ఈ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ దాదాపుగా ఖాళీ అయ్యింది.
…? మజ్జిగపు శ్రీనివాస్‌రెడ్డి, మ్యాకం రవికుమార్