హైదరాబాద్, జనవరి 3 (నమస్తేతెలంగాణ): రైతు కూలీలు, కౌలు రైతులకు ఎన్నికల ముందు కాంగ్రెస్ ఇచ్చిన హామీలను నెరవేర్చాలని సంయుక్త కిసాన్ మోర్చా నాయకులు డిమాండ్ చేశారు. విధివిధానాలు రూపొందించకుండా కౌలురైతులకు రూ.12వేల సాయం అందిస్తామని చెప్పడం హాస్యాస్పదమని విమర్శించారు. సర్కారుకు చిత్తశుద్ధి ఉంటే 2011 చట్ట ప్రకారం కౌలు రైతులను గుర్తించాలని డిమాండ్ చేశారు. శుక్రవారం హైదరాబాద్‌లోని ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో సంయుక్త కిసాన్‌మోర్చా నాయకుడు కిరణ్‌కుమార్ మాట్లాడుతూ.. గతేడాది సెప్టెంబర్ 13న పీసీసీ చీఫ్ హోదాలో రేవంత్‌రెడ్డి రాసిన కౌలురైతులకు బహిరంగలేఖ, కాంగ్రెస్ ఆరు గ్యారెంటీల కార్డును ప్రదర్శించారు. రైతుభరోసాపై వేసిన క్యాబినెట్ సబ్‌కమిటీ నివేదికను చూస్తే రైతు కూలీలకు ఒరిగేదేమీ లేదనే విషయం అర్థమవుతున్నదని మండిపడ్డారు. రైతుకూలీ సంఘాల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోకపోవడం బాధాకరమన్నారు. కౌలురైతులకు సాయం కోసం భూ యజమానుల నుంచి అఫిడవిట్లు తేవాలనడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. సాగు భూములకే రైతుభరోసా ఇస్తామంటున్న సర్కారు సాగుదారులను విస్మరించేందుకు కుట్రలు చేస్తున్నదని మండిపడ్డారు. సమావేశంలో పశ్య పద్మ, టీ సాగర్, కిరణ్‌కుమార్, బీ కొండల్, కన్నెగంటి రవి, పశ్య పద్మ, ప్రొఫెసర్ అరిబండి ప్రసాదరావు, జక్కుల వెంకట య్య, కే ప్రసాద్, శంకర్, కల్పన పాల్గొన్నారు.