Jeevan Reddy | ఎమ్మెల్సీ, కాంగ్రెస్ సీనియర్ నాయకులు జీవన్ రెడ్డి మరోసారి తన ఆవేదన వెల్లగక్కారు. కాంగ్రెస్ పార్టీపై తనకు ఎలాంటి కోపం లేదని.. ఇది తనకు సొంతిళ్లు లాంటిదని చెప్పారు. కాంగ్రెస్ పార్టీలో తనకు నాలుగు దశాబ్దాల అనుబంధం ఉందని.. కానీ ఇప్పుడు తన అనుభవమే ప్రశ్నార్థకంగా మారిందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పుడు ఒక అశక్తుడిలా మారిపోయానని.. నాలుగు నెలలుగా అవమానాలకు గురువుతున్నానని బయటపెట్టారు. నేనూ కాంగ్రెస్ నాయకుడినే అని చెప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చిందని వాపోయారు.
కాంగ్రెస్ పార్టీలో కొంతకాలంగా జరుగుతున్న పరిణామాలు తీవ్ర అసంతృప్తి కలిగిస్తున్నాయని జీవన్ రెడ్డి తెలిపారు. కాంగ్రెస్ విధానాలకు ఫిరాయింపులు వ్యతిరేకమని తెలిపారు. బీఆర్ఎస్ నుంచి చేరిన వారిపై అనర్హత వేటు వేయాల్సిందేనని డిమాండ్ చేశారు. ఫిరాయింపులు మంచిది కాదని హైకమాండ్‌కు చెప్పానని పేర్కొన్నారు. ఇక దానిపై నిర్ణయం పార్టీ ఇష్టమేనని తెలిపారు. ఫిరాయింపులపై తన నిర్ణయం మాత్రం మారదని స్పష్టం చేశారు.
ఫిరాయింపుల కారణంగా బీఆర్ఎస్ ఎవరో.. కాంగ్రెస్ ఎవరో అర్థం కావడం లేదని జీవన్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. అసలైన కాంగ్రెస్ నేతలు కూడా తాము కాంగ్రెస్సే అని చెప్పుకోవాల్సిన దుస్థితి వచ్చిందని చెప్పారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌కు సంపూర్ణ మెజారిటీ ఉందని తెలిపారు. ఎంఐఎంను మినహాయించినా కాంగ్రెస్ సుస్థిరంగానే ఉంటుందని పేర్కొన్నారు. కాబట్టి కాంగ్రెస్‌లో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై వేటు వేయాలని కోరారు. పార్టీ ఫిరాయిస్తే సస్పెండ్ చేయాలని చట్టంలోనూ ఉందని గుర్తుచేశారు.