హైదరాబాద్, మార్చి 7 (నమస్తే తెలంగాణ): పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయహోదా ఇవ్వకుండా మోసం చేసింది బీజేపీయేనని మహబూబ్‌నగర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి ఆరోపించారు. 2014 ఎన్నికల్లో కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే ఈ ప్రాజెక్టుకు జాతీయహోదా ఇస్తామని హామీ ఇచ్చిన మోదీ ఇప్పటికీ నెరవేర్చలేదని విమర్శించారు.
గురువారం ఆయన సచివాలయం మీడియా హాల్లో మీడియాతో మాట్లాడారు. బీజేపీతో తెలంగాణకు నయాపైసా ఫాయిదా లేదనే ఆ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్‌లో చేరానన్నారు. పాలమూరు జిల్లాకు చెందిన బీజేపీ నాయకులు డీకే అరుణ, జితేందర్‌రెడ్డికి జాతీయహోదా గురించి అడిగే ధైర్యం లేదని ఎద్దేవా చేశారు. బీజేపీ ప్రకటించిన ఎంపీ అభ్యర్థులను చూస్తే బీఆర్ఎస్తో కుదిరిన ఒప్పందానికి అద్దం పడుతున్నదని ఆరోపించారు. సమావేశంలో పీసీసీ ప్రధాన కార్యదర్శి వినోద్‌కుమార్, మహబూబ్‌నగర్ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు లక్ష్మణ్‌యాదవ్ పాల్గొన్నారు.