సంగీత సంచలనం దేవిశ్రీప్రసాద్ ‘ఎల్లమ్మ’ చిత్రంతో హీరోగా తెరంగేట్రం చేస్తున్న విషయం తెలిసిందే. నిజానికి దేవిశ్రీని హీరోగా పరిచయం చేసేందుకు చాలా ఏళ్లుగా ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. కానీ వచ్చిన అవకాశాలన్నింటినీ ఆయన సున్నితంగా తిరస్కరిస్తూ వచ్చారు. అయితే.. ‘ఎల్లమ్మ’ కంటే ముందు ఓ దర్శకుడి డైరెక్షన్లో మాత్రం ఆయన హీరోగా నటించేందుకు సిద్ధపడ్డారు. ఆ దర్శకుడే సుకుమార్. అనుకోని కారణాల వల్ల ఆ ప్రాజెక్ట్ ట్రాక్ ఎక్కలేదు. ఈ విషయం గురించి ఇటీవల ఓ ఇంటర్వ్యూలో దేవిశ్రీ ప్రసాద్ మాట్లాడుతూ ‘నిజానికి సుకుమార్ దర్శకత్వంలోనే నేను హీరోగా పరిచయం కావాలి.
ఇది ‘నాన్నకు ప్రేమతో’ సినిమాకు ముందు మాట. సుకుమార్కీ, నాకూ మధ్య ఉన్న స్నేహాన్ని దృష్టిలో పెట్టుకొని నన్ను నటుడిగా పరిచయం చేయాలని సుకుమార్ భావించారు. కానీ, అదే టైమ్లో మా నాన్న కాలం చేశారు. దాంతో ఆ ఆలోచనపై దృష్టిపెట్టలేకపోయా. సుకుమార్ కూడా ఆ ఆలోచనని విరమించారు’ అంటూ గుర్తు చేసుకున్నారు. ఇక ‘ఎల్లమ్మ’ సినిమా గురించి చెబుతూ ‘నెలకు పదిరోజులు డేట్స్ ఇస్తే చాలు.. దానికి తగ్గట్టు షెడ్యూల్ ప్లాన్ చేసుకుంటాం. మిగతా టైమ్లో నువ్వు మ్యూజిక్ చేసుకోవచ్చన్నారు దిల్రాజు.
అంతపెద్ద నిర్మాత అడగటంతో కాదనలేకపోయాను. మ్యూజిక్ డైరెక్టర్గా నా తొలి సినిమా ‘దేవి’. అది అమ్మవారి కథ. హీరోగా నా తొలి సినిమా ‘ఎల్లమ్మ’. ఇదీ అమ్మవారి కథే. అందుకే చాలా ఆనందంగా ఉంది.’ అంటూ సంతోషం వెలిబుచ్చారు దేవిశ్రీ. ‘బలగం’ఫేం వేణు యల్దెండి దర్శకత్వంలో రూపొందనున్న ఈ గ్రామీణ తెలంగాణ కథలో దేవిశ్రీప్రసాద్ రంగస్థల కళాకారుడిగా నటించనున్నారు. పాత్ర రీత్యా పలు గెటప్పుల్లో ఆయన కనిపిస్తారు.