Indiramma Indlu | మరిపెడ, మే 30: ఇందిరమ్మ ఇంటి నిర్మాణం రూ.5 లక్షలతో సాధ్యం కాదని, అందుకే ప్రభుత్వం లబ్ధిదారులకు ఉచితంగా ఇసుకను పంపిణీ చేస్తున్నదని ప్రభుత్వ విప్, డోర్నకల్ ఎమ్మెల్యే రాంచంద్రునాయక్ అన్నారు. శుక్రవారం ఆయన మహబూబాబాద్ జిల్లా మరిపెడలో నిర్వహించిన కార్యక్రమంలో పలువురికి కల్యాణలక్ష్మి, కాటమయ్య కిట్లు, పాఠశాలలకు పాఠ్యపుస్తకాలు, ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు మంజూరు పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు డ్వాక్రా గ్రూపుల వద్ద రూ.లక్ష వరకు అప్పు తీసుకోవడానికి అనుమతి ఇస్తున్నామని, లేదా ఇంటిపత్రాలు సరిగ్గా ఉంటే బ్యాంకుల వద్ద కూడా ఇంటి నిర్మాణానికి అప్పు తీసుకోవచ్చని సూచించారు. అయితే లబ్ధిదారులకు సిబిల్ సోర్ ఉంటేనే బ్యాంకులు అప్పు ఇచ్చేందుకు ముందుకు వస్తాయని తెలిపారు.
కాగా ఎమ్మెల్యే సమయపాలన పాటించక పోవడంతో లబ్ధిదారులు అసహనం వ్యక్తం చేశారు. మధ్యాహ్నం 12 గంటలకు వస్తారని సమాచారమివ్వడంతో లబ్ధిదారులు సమయానికి చేరుకున్నారు. కానీ, ఎమ్మెల్యే మాత్రం మధ్యాహ్నం 2.30 గంటలకు రావడంతో పెదవి విరిచారు.