సీఎం రేవంత్ ఏకపక్ష తీరుపై, ఆయన సోదరుల అరాచకాలపై రగలిపోతున్న అసలు కాంగ్రెస్ నేతలు.. ఒక్కటవుతున్నట్టే కనిపిస్తున్నది. పచ్చకాంగ్రెస్ ఆధిపత్యంతోపాటు సీఎం కుటుబపాలన కొత్త అసంతృప్తికి ఆజ్యం పోసిందని ప్రచారం జరుగుతున్నది.
సీఎం విదేశీ పర్యటనలో ఉన్న వేళ.. మొయినాబాద్‌లో 15-18 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, నేతలు సమావేశమయ్యారన్న వార్త సంచలనంగా మారింది. వారిలో ఇద్దరు క్యాబినెట్ మంత్రులూ ఉన్నారట! ఆ భేటీకి మరికొందరి ఆశీస్సులూ ఉన్నాయట! రాష్ట్రంలో ఇప్పుడిదే హాట్‌టాపిక్! అన్నిటికిమించి ఇది రాజకీ యాల్లో సంక్షోభాలకు అనువైన ఆగస్టు నెల!
హైదరాబాద్, ఆగస్టు 20 (నమస్తే తెలంగాణ): గ్రూపులుగా చీలి, నేతలు రోడ్డునపడి కొట్టుకుంటున్న రాష్ట్ర కాంగ్రెస్‌లో కీలక పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయా? ప్రెషర్కుక్కర్లా ఇన్నాళ్లూ ఒత్తిడికి గురైన నేతలు.. రేవంత్ పాలనపై తిరుగుబాటు జెండా ఎగరేస్తున్నారా? ముఖ్యమంత్రి రాష్ట్రంలో లేని సమయంలో బాధిత నేతలంతా ఒక్కటయ్యారా? అసంతృప్త నేతలు, ఎమ్మెల్యేల రహస్య భేటీకి మొయినాబాద్‌లోని ఓ ఫాంహౌస్ వేదికైందా? పలువురు మంత్రులు కూడా వారికి మద్దతు పలుకుతున్నారా? అంటే అవుననే సమాధానమే వస్తున్నది.
ఆ మేరకు అధికార పార్టీ వర్గాల నుంచి సంకేతాలు వెలువడుతున్నాయి. 15-18 మంది ఎమ్మెల్యేలు హాజరైన ఈ సమావేశంలో ఇద్దరు రేవంత్‌రెడ్డి క్యాబినెట్ సహచరులు కూడా పాల్గొన్నారన్న వార్తలు కలకలం రేపుతున్నది. దీన్ని అధికారికంగా ఎవరూ ధ్రువీకరించనప్పటికీ.. కాంగ్రెస్ వర్గాల్లో తీవ్ర చర్చ సాగుతున్నది. అనేక పర్యాయా లు ఆగస్టు సంక్షోభాలను చవిచూసిన తెలు గు రాష్ర్టాల్లో ఈ ఆగస్టులోనే చోటుచేసుకుంటున్న పరిణామాలు కాంగ్రెస్‌లో కొత్త మార్పులకు దారితీస్తాయా? అన్నది హాట్‌టాపిక్‌గా మారింది. తాజా సమాచారం ప్రకారం.. అసంతృప్త నేతల రహస్య భేటీ సమాచారంతో ముఖ్యమంత్రి తన విదేశీ పర్యటనను కుదించుకున్నారని, రాష్ర్టానికి తిరిగివస్తున్నారని వదంతుల వెలువడుతున్నాయి.
కొద్దిరోజులుగా ముఖ్యమంత్రి వర్గానికి, అసంతృప్త నేతలకు మధ్య కొనసాగుతున్న యుద్ధం కొత్త మలుపు తిరిగిం ది. రేవంత్ విదేశీ పర్యటనలో ఉన్న వేళ.. పలువురు కాంగ్రెస్ నేతలు రహస్యంగా సమావేశమైనట్టు వస్తున్న వార్తలు సంచలనంగా మారాయి. ఇద్దరు మంత్రులు సహా 15-18 మంది ఎమ్మెల్యేలు, కీలక నేతలు మొయినాబాద్‌లోని ఓ ఫాంహౌస్‌లో భేటీ అయ్యారని ఆ వార్తల సారాంశం. రాష్ట్రంలోని పరిస్థితులు, ప్రభుత్వ వ్యవహారాలు, కాంగ్రెస్‌లో తాజా పరిణామాలన్నీ వారి మధ్య సుదీర్ఘంగా చర్చకు వచ్చినట్టు తెలిసింది. సీఎం సోదరుల అరాచకాలు, కుటుంబ వివాదాలు, పాలనతో రియల్ ఎస్టేట్ వ్యవహారాలను మిళితం చేసిన తీరుపై వారు లోతుగా చర్చించారని సమాచారం. ఇటీవల ప్రభుత్వంపై తీవ్రస్థాయి లో విరుచుకుపడుతున్న ఓ మాజీ ఎంపీకి చెందిన మొయినాబాద్ ఫామ్‌హౌస్‌లో ఈ సమావేశం జరిగిందని, గురువారం ఆయ న వివాహ వార్షికోత్సవం సందర్భంగా కార్యక్రమం పేరిట నేతలు కలుసుకున్నారని విశ్వసనీయంగా తెలిసింది.
కొద్దిరోజులుగా సీఎం పర్యటనలకు దూరంగా ఉంటున్న ఓ బీసీ మంత్రితోపాటు ముఖ్యమంత్రి సొంత జిల్లాకు చెందిన ఓ మంత్రి, మంత్రి పదవి ఆశిస్తున్న రంగారెడ్డి జిల్లాకు చెందిన మరో సీనియర్ ఎమ్మెల్యే, కొద్దిరోజులుగా క్యాబినెట్ బెర్త్ కావాలని బహిరంగంగానే డిమాండ్ చేస్తున్న ఉమ్మడి నల్లగొండ ఎమ్మెల్యే, ఉమ్మడి పాలమూరు జిల్లాకు చెందిన నలుగురు ఎమ్మెల్యేలు, ఉత్తర తెలంగాణకు చెందిన ఓ దళిత ఎమ్మెల్యే తదితరులు సమావేశానికి హాజరైనట్టు సమాచారం. ఈ కలయికకు కొందరు సీనియర్ మంత్రుల ఆశీస్సులు కూడా ఉన్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. కాంగ్రెస్ వర్గాలు దీన్ని అధికారికంగా ధ్రువీకరించనప్పటికీ.. సమావేశం జరిగింది వాస్తవమేనని, హాజరైన నేతల్లో అత్యధికులు కొంతకాలంగా అసంతృప్త స్వరాలు వినిపిస్తున్నవారేనని చెప్తున్నారు.
ముఖ్యమంత్రి రేవంత్ వ్యవహారశైలి, ఆయన సోదరులపై వస్తున్న ఆరోపణలు, పాలనా వివాదాలు.. ఫామ్‌హౌస్ భేటీలో ప్రధానంగా చర్చకు వచ్చినట్టు సమాచా రం. సుదీర్ఘ విరామం తర్వాత రాష్ట్రంలో పార్టీ అధికారంలోకి వచ్చినప్పటికీ.. ముఖ్యమంత్రి, ఆయన కుటుంబ సభ్యులే లాభపడుతున్నారని చర్చల సారాంశంగా చెప్తున్నారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నా, పార్టీకి సుదీర్ఘంగా సేవలందించిన తమలాంటి వారికి ఒరిగిందేమీ లేదని పలువురు అభిప్రాయపడ్డారట. సీఎం సోదరుల రియల్ ఎస్టేట్ వ్యవహారాలకు, భూదందాలకు ప్రభుత్వాన్ని అడ్డుగా పెట్టుకుంటున్నారని.. ఇప్పటికైనా మేల్కొనకపోతే, ఆ అరాచకాలకు అంతే ఉండదని భేటీలో చర్చకు వచ్చినట్టు విశ్వసనీయ సమాచారం.
ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి కొంతకాలంగా బాహాటంగానే ప్రభుత్వ తీరును విమర్శిస్తున్నారు. తాను ఎదురుతిరిగితే మరో జీవన్‌రెడ్డిలా మారేవాడినని ఇటీవల చిన్నారెడ్డి చేసిన వ్యాఖ్యలు పార్టీలో పెద్ద దుమారాన్నే రేపాయి. ఇక బీసీలను టార్గెట్ చేస్తున్నారని కొందరు, వలస కాంగ్రెస్ నేతలు అసలు కాంగ్రెస్ నేతలపై ఆధిపత్యం చెలాయిస్తున్నారని మరికొందరు విమర్శలు చేస్తూ వచ్చారు. క్యాబినెట్లోకి తీసుకుంటామని తనకు ఇచ్చిన హామీని అధిష్ఠానం నిలబెట్టుకోవాలని, మంత్రివర్గంలోకి తీసుకోవాలని కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి డిమాండ్ చేస్తున్నారు. ముఖ్యమంత్రి తీరుపై నేరుగానే నిప్పులు చెరుగుతున్నారు.
తాజాగా మంత్రి కొండా సురేఖ కూతురు సుస్మిత చేసిన వ్యాఖ్యలు, సొంత ముఖ్యమంత్రికే ఘాటు హెచ్చరికలు పంపడం సంచలనంగా మారింది. తన జోలికి వచ్చినా, కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేసినా.. ముఖ్యమంత్రి బండారమంతా బయటపెడుతానంటూ ఆమె బహిరంగంగానే హెచ్చరించారు కూడా. టీపీసీసీలో అంతర్గతంగా రగులుతున్న అసంతృప్తికితోడు ఢిల్లీ నాయకత్వం కూడా తెలంగాణలో ప్రభుత్వం, పార్టీ నడుస్తున్న తీరుపై అసహనం వ్యక్తంచేసినట్టు కొద్దిరోజులుగా ప్రచారం జరుగుతున్నది. ముఖ్యమంత్రిపై అధిష్ఠానం గుర్రుగా ఉన్నదన్న సంకేతాలు కూడా పలుమార్లు ఢిల్లీ నుంచి వెలువడ్డాయి. ఈ నేపథ్యంలో మొయినాబాద్ ఫాంహౌస్‌లో ఇద్దరు మంత్రులు, అసమ్మతి నేతలు, ఎమ్మెల్యేలు సమావేశమైనట్టు వచ్చిన వార్తలు ప్రాధాన్యాన్ని సంతరించుకున్నాయి. రాష్ట్ర కాంగ్రెస్‌లో మున్ముందు కీలక రాజకీయ పరిణామాలు చోటుచేసుకునే అవకాశమున్నదని విశ్లేషకులు భావిస్తున్నారు.