Mandula Samel | హైదరాబాద్, ఏప్రిల్ 10 (నమస్తేతెలంగాణ): ముఖ్యమంత్రిగా రేవంత్‌రెడ్డి అధికార పగ్గాలు చేపట్టి దాదాపు 16 నెలలు అవుతున్నది. కానీ ఇప్పటికీ చాలామందికి ఆయన పేరు గుర్తుండటం లేదు. గత 16 నెలల్లో అనేకమార్లు అధికారులు, ప్రజాప్రతినిధులు, చివరికి కాంగ్రెస్ పార్టీ నేతలు సైతం వేదికలపై రేవంత్‌రెడ్డి పేరు మరిచిపోయారు. ఆయనకు బదులుగా వేరొకరిని ముఖ్యమంత్రిగా పేర్కొన్న ఘటనలు అనేకం. తాజాగా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఒకరు ముఖ్యమంత్రిగా రేవంత్‌రెడ్డి పేరుకు బదులుగా ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పేరు చెప్పారు. ఈ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది.
తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేలు ఎస్సీ వర్గీకరణపై గాంధీభవన్‌లో గురువారం మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అని చాలా కాన్ఫిడెంట్‌గా పలికారు. మాదిగలకు న్యాయం చేసేది కాంగ్రెస్ ఒక్కటే అని..రాహుల్‌గాంధీ ఆదేశాలతో సీఎం ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కలు ఎస్సీ రిజర్వేషన్లు చేశారని, వారికి ధన్యవాదాలు అని పేర్కొన్నారు. ఇటీవల సినీ నటుడు అల్లు అర్జున్, అంతర్జాతీయ తెలుగు మహాసభల్లో, పలువురు సెలబ్రిటీలు, సొంత పార్టీ నేతలు సైతం సీఎంగా రేవంత్‌రెడ్డి పేరును మరిచిపోయారు. ఇక తాజాగా సీఎం పేరును తప్పుగా పలికిన ఎమ్మెల్యే మందుల సామేలు తన తప్పును సరిచేసుకోకపోవడం కొసమెరుపు.