ఖానాపూర్, జనవరి 28 : నిర్మల్ జిల్లా ఖానాపూర్ జూనియర్ కళాశాల సమీపం లో జాతీయ రహదారిపై భారత తొలి విద్యాశాఖ మంత్రి మౌలానా అబుల్ కలాం ఆజాద్ విగ్రహం ఏర్పాటు విషయంలో రగడ రాజుకుంది. ఈ విగ్రహం ఏర్పాటుకు గతంలో ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు భూమి పూజ చేశారు. ఇక్కడే రోడ్డు మధ్య డివైడర్‌లో ఇతర సంఘాలకు చెందిన పలు విగ్రహాలు ఉన్నాయి. ఈ విగ్రహాన్ని సైతం వాటి మాదిరిగానే ఏర్పాటు చేయాలని కొందరు సూ చించగా.. సంబంధిత వర్గం నాయకులు మాత్రం ప్రతిపాదించిన స్థలంలోనే విగ్ర హం పెట్టాలంటూ డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ నెల 24న ఖానాపూర్ మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించిన సర్వసభ్య సమావేశంలో ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు, మరో నాయకుడికి మధ్య చర్చ జరిగింది.
సమావేశం అనంతరం ఓ వర్గానికి చెందిన నాయకులు విగ్రహం ఏర్పాటుపై ఎమ్మెల్యేకు వినతిపత్రం అందజేశారు. ఈ క్రమంలో ఎమ్మెల్యే ఒక్కసారిగా ఆగ్రహం తో ఊగిపోయారు. ‘ముందు ఆ వర్గం నా యకుడే మొదలు పెట్టిండు. ఏదైనా మాట్లాడితే వైరల్ చేసి భయపెట్టాలని చూస్తున్నా రా? మీకు అంత దమ్ముంటే అతడిని శిక్షించండి. అలాంటి వారితోనే మంచి పనులు కరాబ్ అవుతాయి. నేను చట్ట ప్రకారమే వెళ్తాను’ అంటూ వాహనంలో వెళ్లిపోయా రు. కించపరిచేలా ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలపై బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ సోషల్ మీడియాలో ఓ వర్గంవారు పెట్టిన వీడియో వైరల్ కావడం చర్చనీయాంశంగా మారింది.