మిర్యాలగూడ, సెప్టెంబర్ 14: ఎమ్మెల్యే గన్‌మన్ అధికార దుర్వినియోగానికి పాల్పడ్డాడు. ఎమ్మెల్యే చెప్పాడంటూ అధికారులను బురిడీ కొట్టించి లారీ లోడ్ యూరియాను పక్కదారి పట్టించాడు. ఈ ఘటన నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాలు ఇలా.. మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి గన్‌మన్ నాగునాయక్ పక్షం రోజుల క్రితం మార్క్‌ఫెడ్ డీఎం జ్యోతికి ఫోన్ చేసి.. ‘నేను ఎమ్మెల్యే పీఏను మాట్లాడుతున్నా.. సార్ బిజీగా ఉన్నా రు. ఒక లారీ లోడ్ యూరియా మాడ్గులపల్లి మండలం కుక్కడం ఎన్డీసీఎస్కు పంపించాలి’ అని సూచించాడు. ఆ మేరకు సదరు అధికారి జ్యోతి ఈ విషయాన్ని మెసేజ్ ద్వారా జిల్లా వ్యవసాయాధికారి శ్రవణ్‌కుమార్‌కు సమాచారం అందించారు.
జిల్లా వ్యవసాయాధికారి వెంటనే స్పందించి ఇండెంట్ పెట్టి, లారీ లోడ్ యూరియాను సదరు సొసైటీకి పంపించారు. ఇటీవల జిల్లా వ్యవసాయాధికారికి అనుమానం వచ్చి మార్క్‌ఫెడ్ డీఎంను అడగ్గా.. ఆమె విచారణ జరుపగా ఎమ్మెల్యే చెప్పలేదనే విషయం వెలుగులోకి వచ్చింది. లారీ లోడ్ యూరియా పక్కదారి పట్టిన విషయం వెలుగులోకి రావడంతో ఎస్పీ శరత్చంద్రపవార్కు ఫిర్యాదు రావడంతో నాగునాయక్ను నల్లగొండ జిల్లా కేంద్రానికి అటాచ్ చేసి విచారణకు ఆదేశించా రు. విచారణ పూర్తయ్యా క శాఖాపరమైన చర్యలు తీసుకోనున్నట్టు తెలిసింది.
ఎమ్మెల్యే పీఏనంటూ గన్‌మన్ లారీ యూరియాను పక్కదారి పట్టించిన విషయమై జిల్లా వ్యవసాయాధికారి శ్రవణ్‌కుమార్‌ను వివరణ కోరగా, యూరియా పక్కదారి పట్టలేదని తెలిపారు. కుక్కడం ఎన్డీసీఎస్కు కేటాయించిన యూరియాను రైతులే తీసుకున్నట్టు చెప్పారు. ఓ వ్యక్తి ఎమ్మెల్యే పీఏనని అబద్ధం చెప్పి ఎమ్మెల్యేకు తెలియకుండానే యూరియాను అలాట్ చేయాలని కోరినట్టు ధ్రువీకరించారు.