Khajaguda | హైదరాబాద్ సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, మార్చి 26 ( నమస్తే తెలంగాణ ) : ‘ఖాజాగూడలో ఓ రియల్ ఎస్టేట్ సంస్థ చేపట్టిన ప్రాజెక్టు అతిపెద్ద స్కాం. చెరువు బఫర్ జోన్లో ఈ ప్రాజెక్టు ఉంది. దీనిపై హైడ్రాకు ఫిర్యాదు చేస్తే కనీసం రసీదు కూడా ఇవ్వడం లేదు. ఈ వ్యవహారంపై అసెంబ్లీ జీరో అవర్‌లో ప్రశ్నిస్తా. ఈ వేల కోట్ల రూపాయల స్కాంపై అసెంబ్లీలోనే తేల్చుకుంటా!’ – అధికార కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి ఈ నెల 13వ తేదీన అసెంబ్లీలో మీడియాతో జరిపిన చిట్‌చాట్‌లో చేసిన సవాల్ ఇది..
మరి… నేటితో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ముగియనున్నాయి. సరిగ్గా మూడు రోజుల కిందట హైడ్రా ఆ ప్రాజెక్టుకు నోటీసులిచ్చింది. చెరువులో పోసిన మట్టిని తొలగించాలని ఆదేశించింది. అంటే… ఆ స్కాం ‘మట్టి’కొట్టుకుపోయినట్టేనా? తెలుగు సినిమాల లెక్క కథ సుఖాంతమైందా? ఇంతటి దానికోసమేనా… అనిరుధ్‌రెడ్డి సవాల్ చేసింది? పేదోడు పది గజాలు ఆక్రమిస్తే బుల్డోజర్లతో విరుచుకుపడిన హైడ్రా, రెవెన్యూ, ఇంజినీరింగ్ విభాగాలు.. ఒకటీ అరా కాదు, రూ.2 వేల కోట్లకు పైగా విలువైన 27.18 ఎకరాల ప్రభుత్వ భూమిలో ప్రైవేటు ఆకాశ హర్మ్యాలు లేస్తుంటే ఎందుకు కదలడం లేదు? గతంలో సామాన్యులకు నోటీసులిచ్చి పేరాలకు పేరాలు ఆరాలు తీసి…
కోర్టు స్టే ఉత్తర్వులను సైతం ‘వియ్ డోంట్ కేర్’ అన్న హైడ్రా.. ప్రభుత్వ భూమి హారతికర్పూరం అవుతుంటే లెక్కలను బయటికి ఎందుకు తీయడం లేదు? ప్రభుత్వ భూములు చెరబడితే భరతం పడతామన్న ప్రభుత్వ పెద్దల గర్జింపులు ఇక్కడ ఎందుకు వినిపించడం లేదు? ఇటీవల హైకోర్టు వ్యాఖ్యానించినట్టు… ప్రభుత్వ యంత్రాంగం ప్రతాపమంతా పేదోళ్ల మీదనేనా? రాష్ట్రంలో పెద్దోళ్లకు ప్రత్యేక చట్టాలు ఏమైనా అమలవుతున్నాయా? అంటే అక్షరాలా నిజమేనని విమర్శలు వినిపిస్తున్నాయి. కచ్చితంగా కడుపు మండుతున్న సామాన్యుడు నిగ్గదీసి అడిగే ప్రశ్నలివే. ప్రధాన ప్రతిపక్షం మీద బట్టకాల్చి మీద వేస్తాం… ఆనక అంతా సర్దుబాటు చేసుకుంటామంటే ప్రజలు అమాయకులు కాదు కదా. ఇస్తినమ్మ వాయనం… పుచ్చుకుంటినమ్మా వాయనం.. అన్నట్టు హైడ్రా నోటీసులు ఇవ్వడం, ఆ సంస్థ మట్టిని తొలగిస్తామనడం! బారాఖూన్ మాఫీనేనా? ఏదో ఒక చెరువులో మట్టి పోస్తే అది స్కాం కాదనేది చిన్న పిల్లగాడిని అడిగినా చెబుతాడు. మరి… ఎమ్మెల్యే అనిరుధ్ ఆరోపణల వెనుక ఉన్న గుట్టు ఏమిటనేది తెలంగాణ ప్రజలకు తెలియాల్సిన అవసరముంది. లేకపోతే పది మంది పేదల ఇండ్లు కూల్చివేసి ఇదిగో… సమాజానికి ‘తరాజు న్యాయం’ అందించామనే ప్రవచనాలు వినిపిస్తూనే ఉంటాయి. గత ప్రభుత్వం మీద నెపం నెట్టి ‘కార్యాలు’ చక్కదిద్దుకునే సంప్రదాయం కొనసాగుతూనే ఉంటుంది.
రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం ఖాజాగూడ గ్రామ పరిధిలోని సర్వే నంబరు 27లో సుమారు 64.05 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. ఇందులో 27.18 ఎకరాల భూమిపై 80వ దశకం నుంచి న్యాయస్థానంలో వివాదం కొనసాగుతున్నది. ఈ నేపథ్యంలో 2022లో అప్పటి జిల్లా ఉన్నతాధికారి దానికి ఎన్వోసీ ఇవ్వడం.. దాని ఆధారంగా ఓ రియల్ ఎస్టేట్ సంస్థ అక్కడ సుమారు 59 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏడు టవర్లను నిర్మించేందుకు అనుమతి తీసుకున్నది. ఈ క్రమంలో అప్పటి ప్రభుత్వ పెద్దలు విషయం తెలుసుకొని వెంటనే ప్రభుత్వ భూమిని కాపాడేందుకు చర్యలు తీసుకున్నారు. వాళ్ల ఆదేశానుసారం జిల్లా ఉన్నతాధికారి ఇచ్చిన ఉత్తర్వులను సీసీఎల్ఏ ఉన్నతాధికారి రద్దు చేయడంతో పాటు ఇందులో ఎలాంటి అనుమతులు చెల్లవని కూడా ఉత్తర్వులు ఇచ్చారు. అందులో సదరు రియల్ ఎస్టేట్ సంస్థ వేసిన రేకుల షెడ్లను తొలగించి స్వాధీనం చేసుకున్నారు. దీంతో 2023 డిసెంబరు వరకు ఆ ప్రభుత్వ భూమి సర్కారు ఆధీనంలోనే ఉంది. సదరు సంస్థ అటువైపు కన్నెత్తి చూసిన దాఖలాలు లేవు.
గత ప్రభుత్వ హయాంలో తమ పప్పులు ఉడకకపోవడంతో సదరు ప్రైవేటు సంస్థ కొత్త ప్రభుత్వం వచ్చాక కొందరిని పట్టుకొని చక్రం తిప్పింది. ప్రభుత్వ పెద్దలు రంగంలోకి దిగి వ్యవహారాన్ని చక్కదిద్దారు. ఎన్వోసీలు.. అనుమతులు… రెక్కలు కట్టుకొని వచ్చివాలాయి. సదరు సంస్థ ఆ భూమిలోకి దిగి సుమారు ఏడెనిమిది నెలల కిందట ప్రాజెక్టు నిర్మాణ పనులను పరుగులు పెట్టించింది. అందులో భాగంగా పక్కన ఉన్న చెరువు మీదా కన్నేసింది. చెరువులో మట్టి పోసింది. ఇక్కడ చెరువును చెరబట్టడమనేది జరిగిన వ్యవహారంలో చాలా చిన్నది. కానీ, అక్కడ ఏకంగా 27.10 ఎకరాల ప్రభుత్వ భూమితో వ్యవహారం ముడిపడి ఉంది. సాక్షాత్తూ సీసీఎల్ఏ ఉన్నతాధికారి ‘అది ప్రభుత్వ భూమి… లావాదేవీలు, నిర్మాణ అనుమతులు చెల్లవు’ అని ఉత్తర్వులు ఇవ్వగా… దానికి విరుద్ధంగా అక్కడ వేలాది కోట్ల రూపాయల ప్రాజెక్టు రూపుదిద్దుకోవడమంటే ప్రభుత్వ, అధికార యంత్రాంగం నిద్ర నటిస్తుందనేందుకు ఇంత కంటే నిదర్శనం ఏముంటుంది?
జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి ఈ నెల 13న అసెంబ్లీ సమావేశాల సందర్భంగా మీడియా ప్రతినిధులతో చిట్‌చాట్ చేశారు. ‘ఖాజాగూడలో ఓ రియల్ ఎస్టేట్ సంస్థ నిర్మిస్తున్న ప్రాజెక్టు అతిపెద్ద స్కాం. హైడ్రాకు ఫిర్యాదు చేసినా కనీసం రశీదు ఇవ్వడం లేదు. దీనిని అసెంబ్లీ వేదికగా ప్రశ్నిస్తా… అసెంబ్లీలోనే తేల్చుకుంటా’ అని బహిరంగంగా సవాల్ చేశారు. అక్కడితో సరిపెట్టకుండా… మహబూబ్‌నగర్‌లో ఏకంగా విలేకరుల సమావేశం నిర్వహించి మరీ మరోసారి ఇదే సంచలన వ్యాఖ్యలు చేశారు. పనిలో పనిగా హైడ్రా నోటీసుల దందా కొనసాగిస్తున్నదని కూడా మరో బాంబు పేల్చారు. దీంతో రాష్ట్ర నిర్మాణ రంగంలో అతిపెద్ద స్కాంను అనిరుధ్ ధైర్యంగా బయటికి తీసుకువస్తున్నారని అందరూ ఆసక్తిగా ఎదురుచూశారు. ప్రభుత్వమే అసెంబ్లీ వేదికగా వివరాలు బయటపెట్టి, లోతుగా విచారణ చేసి అసలు వాస్తవాల్ని ప్రజల ముందు పెడుతుందని సామాన్యులు ఉత్కంఠగా ఎదురుచూశారు.
ఖాజాగూడ అనేది ఐటీ కారిడార్‌లోని కీలకమైన ప్రాంతం. ఇక్కడ ఎకరం ధర కనీసం రూ.90-100 కోట్ల విలువ ఉంటుంది. అంటే 27.18 ఎకరాల భూమి విలువ రూ.2,000 కోట్లకు పైమాటే! మరి… రాష్ట్రంలో, ప్రధానంగా హైదరాబాద్, చుట్టుపక్కల సుమారు ఏడాదికాలంగా ఏం జరుగుతున్నదో ప్రతి ఒక్కరూ చూస్తూనే ఉన్నారు. ప్రభుత్వ భూమిలోకి ఇంచు మేర జరిగినా, గజం చెరువు బఫర్‌లో కలిసినా… నిర్దాక్షిణ్యంగా హైడ్రా బుల్డోజర్ల కింద సామాన్యుడి కలల సౌధాలు నలిగిన దృశ్యాలు జనం మదిలోనే ఉన్నాయి. చివరకు గతంలోని హైకోర్టు, సుప్రీంకోర్టు ఉత్తర్వులను సైతం ఖాతరు చేయకుండా నిర్మాణాలను కూల్చివేసిన దాఖలాలు అనేకం. పది మంది కలిసి ‘అది ప్రభుత్వ భూమి, చెరువు శిఖం’ అని ఫిర్యాదు చేస్తే చాలు..! నేలమట్టమైన నిర్మాణాలు, న్యాయం కోసం కోర్టు మెట్లు ఎక్కిన కేసులు వందల్లో ఉన్నాయి. కానీ, ఇవన్నీ పైకి కనిపించేవే.
అధికారం మాటున ఇలా రూ.2 వేల కోట్లకు పైగా విలువైన భూములు పెద్దల చెరలో ఉన్నాయనే ఫిర్యాదులు వచ్చినా పట్టించుకునే దిక్కులేదు. పైగా అధికార పార్టీ ఎమ్మెల్యే… అందునా పవిత్రమైన అసెంబ్లీలో ఉండి మీడియా చిట్‌చాట్‌లో చేసిన ఆరోపణలు. నిగ్గు తేల్చాల్సిన ప్రభుత్వం, అధికార యంత్రాంగం కేవలం నోటీసులిచ్చి ‘మట్టి’తో ముడిపెట్టి చేతులెత్తేయడాన్ని ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు. పేదలకు ఒక న్యాయం… పెద్దోళ్లకు మరో న్యాయమా? అని ఆవేదన చెందుతున్నారు. ముఖ్యంగా ఇప్పటివరకు రెవెన్యూ అధికారులు ఒక్కరూ అటువైపు కన్నెత్తి చూడకపోగా… ఆ భూమిపై చిన్నపాటి వివరణ ప్రజలకు వెల్లడించడం లేదంటే పేదోళ్ల జీవిత గమనంలో దొర్లే తప్పులను ప్రశ్నించే, ఎత్తిచూపే నైతిక హక్కు ప్రభుత్వ, అధికార యంత్రాంగానికి ఎక్కడిదనే విమర్శలు వినిపిస్తున్నాయి. మరి… ఇంతకీ సదరు సంస్థ కేవలం చెరువులో మట్టి పోసినందుకే ఇది గత ప్రభుత్వ హయాంలో స్కాంగా మారిందా? ఆ 27.18 ఎకరాల భూమి వెనుక అసలు మర్మమేంది?