హైదరాబాద్ : రాష్ట్ర ప్రయోజనాలను ఎన్నడూ పట్టించుకోని కాంగ్రెస్ నాయకులు ఓర్వలేనితనంతో మేడిగడ్డ ప్రాజెక్టుపై దుష్ప్రచారాలు చేస్తున్నారని రాష్ట్ర జలవనరుల సంస్థ మాజీ చైర్మన్ వి ప్రకాశ్ ( Prakash ) తీవ్రంగా విమర్శించారు. తెలంగాణ జాగృతి (Telangana Jagruthi) ఆధ్వర్యంలో శుక్రవారం హైదరాబాద్లో నిర్వహించిన ‘నీళ్లు- నిజాలు ’ అనే అశంపై నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన మాట్లాడారు.
కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో నిర్మించ దలిచిన ఇచ్చంపల్లి ( Ichchampally ) ప్రాజెక్టు వల్ల తెలంగాణ కంటే చత్తీస్ గఢ్, ఆంధ్రాకే లాభం ఎక్కువని అన్నారు. ఈ విషయాన్ని గమనించిన కేసీఆర్(KCR) అధికారంలోకి రాగానే మేడిగడ్డ వద్ద ప్రాజెక్టు కట్టి కోటి ఎకరాల మాగాణాన్ని సాధించి చూపించారని తెలిపారు. అతి తక్కువ సమయంలో కాళేశ్వరం నిర్మించి రికార్డు సృష్టించారని అన్నారు. పదేళ్ల కాలంలో తెలంగాణ సాగునీటి రంగాన్ని ప్రపంచంలోనే మేటిగా నిలిపారని స్పష్టం చేశారు.
ఆంధ్రా పాలకులు శ్రీరాం సాగర్ నుంచి ధవళేశ్వరం వరకు ఒక్క ప్రాజెక్టు కూడా కట్టుకుండా తెలంగాణకు అన్యాయం చేశారని ఆరోపించారు. ప్రాణహిత,పెన్ గంగా (Penuganga) ప్రాజెక్టులను కేసీఆర్ మొదలుపెట్టే వరకు వాటికి అతీగతీ లేదని వెల్లడించారు. ఉమ్మడి రాష్ట్రంలో ఏలేశ్వరం ప్రాజెక్టు నిర్మించి ఉంటే వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాలో 10 లక్షల ఎకరాలకు నీళ్లు అందేవని అన్నారు.
కేసీఆర్ హయాంలో నిర్మించిన ప్రాజెక్టుల వల్ల మహబూబ్ నగర్ జిల్లాతో పాటు ఇతర ప్రాంతాల నుంచి వలస వెళ్లిన వారు తిరిగి వెనక్కి వచ్చారని వివరించారు. కాళేశ్వరం మూడో టీఎంసీ చేపట్టకపోతే గోదావరి జలాల్లో శాశ్వత వాటా కోల్పోతామని గ్రహించిన కేసీఆర్ మూడో టీఎంసీకి రూపకల్పన చేశారని గుర్తు చేశారు. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, సాగునీటి రంగ నిపుణులు, జాగృతి, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.