Congress | హైదరాబాద్, అక్టోబర్ 29 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ పార్టీ ప్రజల దృష్టిని మరల్చేందుకు మైండ్‌గేమ్‌కు తెరతీసినట్టు తెలుస్తున్నది. ఇటీవల మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ‘దీపావళికి బాంబు పేలుతుంది’ అంటూ వ్యాఖ్యానించారు. సోమవారం సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూ టీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి మూడు గంటలకు పైగా చర్చలు జరిపారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బావమరిదికి చెందిన జన్వాడ ఇంట్లో జరిగిన వేడుకలపై తాము వేసిన పాచిక పారకపోవడంపై తర్జనభర్జన పడినట్టు తెలిసింది.
జన్వాడ ఇంటిపై కి ఎక్సైజ్ సిబ్బంది కాకుండా లా అండ్ ఆర్డర్ పోలీసులను పంపి ఉంటే బాగుండేదని భావించినట్టు సమాచారం. తాజాగా మరో మైండ్‌గేమ్‌లో భాగంగానే ‘టైమర్ ఆన్.. 36 గంటల్లోగా పేలనున్న ఆటం బాంబులు’ అంటూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అనుచరులు, వారి సోషల్‌మీడియా మొత్తం మంగళవారం హల్చల్ చేయడం మొదలుపెట్టింది. వారు ఆ క్యాంపెయిన్ ప్రారంభించిన కొద్ది గంటల్లోనే ఫార్ములా ఈ-రేస్ కేసుకు సంబంధించి ఏసీబీకి మున్సిపల్‌శాఖ అధికారులు ఫిర్యాదు చేశారని మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఇవన్నీ బీఆర్ఎస్ నేతలను టార్గెట్ చేస్తూ అధికారపక్షం పన్నుతున్న కుయుక్తులని విశ్లేషకులు భావిస్తున్నారు.
హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 29(నమస్తే తెలంగాణ) : రాజకీయంగా ఎదుర్కోలేక కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకొని కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న హైడ్రామాలో సెకండ్ షో కూడా అట్టర్‌ఫ్లాప్ అయింది. విజయ్ మద్దూరి ద్వారా రాజ్ పాకాలను ఫిక్స్ చేస్తూ ఆ తర్వాత కేటీఆర్ కుటుంబాన్ని అభాసుపాలు చేసేందుకు రేవంత్ సర్కార్ ముమ్మర ప్రయత్నం చేస్తున్నది. జన్వాడలోని రాజ్‌పాకాల ఇంట్లో జరిగిన కుటుంబ దావత్‌పై సైబరాబాద్ ఎస్వోటీ, ఎక్సైజ్ పోలీసులు సంయుక్తంగా, వేరువేరుగా దాడులు చేస్తూ అక్రమ కేసులు బనాయించేందుకు యత్నించి విఫలమయ్యారు. ఈ క్రమంలోనే మంగళవారం విజయ్ మద్దూరి ఇంట్లో సుదీర్ఘంగా పోలీసులు సోదాలు చేశారు. ఏమీ దొరక్కపోవడంతో నిరాశగా వెనుదిరిగారు.
తాను విదేశాల్లో ఉండగా డ్రగ్స్ తీసుకున్నానని, ఆ ఆనవాళ్లే వచ్చి ఉంటాయని, ఇక్కడ ఎలాంటి డ్రగ్స్ తీసుకోలేదని విజయ్ చెప్పినా పట్టించుకోకుండా కేసు నమోదు చేశారు. ఇతని ద్వా రా రాజ్ పాకాలను ఇరుకున పెట్టేందుకు పో లీసులు, ఎక్సైజ్ అధికారులు నానాయాగీ చేసి విఫలమైన విషయం తెలిసిందే. మంగళవా రం జుబ్లీహిల్స్‌లోని విజయ్ మద్దూరి ఇంట్లో నార్సింగి ఏసీపీ రమణగౌడ్ నేతృత్వంలో మోకిల పోలీస్ బృందం సోదాలు నిర్వహించింది. సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు సోదాలు కొనసాగాయి. విజయ్ తమకు తన ఫోన్ ఇవ్వలేదని, ఇతరుల ఫోన్ ఇచ్చాడని అతని ఫోన్‌తో పాటు ఇంట్లో డ్రగ్స్ అనవాళ్లు ఏమైనా ఉన్నాయా అనే అనుమానంతో సోదాలు నిర్వహించామని పోలీసులు వెల్లడించారు. ఫోన్‌తో పాటు ఎలాంటి డ్రగ్స్ దొరకలేదని తెలిపారు.