హైదరాబాద్, ఆగస్టు 25(నమస్తే తెలంగాణ) : మంత్రి కొండా సురేఖ, రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్‌చైర్మన్ చిన్నారెడ్డిపై వేటు వేసేందుకు కాంగ్రెస్ పార్టీ సిద్ధమైనట్టు తెలుస్తున్నది. ఇటీవలి వ్యవహారాలను తీవ్రంగా పరిగణించిన నేపథ్యంలో వారిద్దరిపై కఠిన చర్యలు తీసుకోవాలని పార్టీ క్రమశిక్షణ కమిటీ సిఫారసు చేస్తూ నివేదిక ఇచ్చినట్టు లీకులు ఇస్తుండగా, సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నది. కాగా, వారిద్దరిపై పూర్తి అంశాలతో నివేదికను పొందుపరిచి టీపీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌కు ఇచ్చినట్టు క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి తెలిపారు. దీనిని పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ మీనాక్షీ నటరాజన్‌కు పంపారని తెలిపారు.
మంగళవారం హైదరాబాద్ గాంధీభవన్‌లో కమిటీ వైస్ చైర్మన్ శ్యామ్మోహన్తో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. కొండా సురేఖ, చిన్నారెడ్డి వ్యవహారంపై మీడియాలో వచ్చిన కథనాలతోపాటు గత విషయాలను కూడా పరిగణనలోకి తీసుకొని నివేదిక తయారుచేశామని చెప్పారు. ఈ రిపోర్ట్‌ను ఏఐసీసీ చీఫ్, పార్టీ జనరల్ సెక్రటరీకి కూడా పంపుతామని, కాంగ్రెస్ హైకమాండ్ ఆదేశాల మేరకు వారిపై చర్యలు ఉంటాయని వెల్లడించారు. ఈ నిర్ణయంతో నాయకులు, క్యాడర్‌కు ఒక మెసేజ్ ఇవ్వాలని అనుకుంటున్నామని మల్లు రవి తెలిపా రు. అయితే ఆ నివేదికలో ఏముందో చెప్తే తనకు నోటీసులు వస్తాయని చెప్పారు. పార్టీపై వ్యతిరేక అభిప్రాయాన్ని కలిగించకుండా ఉండాలంటే క్రమశిక్షణా చర్యలు తీసుకోవాల్సిందని అభిప్రాయపడ్డారు.