‘ఇందిరమ్మ రాజ్యం రావడంలో మీ పాత్ర ప్రత్యేకమైంది. అందుకే మీ సమస్యల పరిష్కారానికి కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉన్నది. ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చి తీరుతాం. రెండు, మూడు రోజుల్లో మీతో సమావేశమై అక్రెడిటేషన్లపై చర్చిస్తాం. సాధ్యమైనంత తొందరలో అర్హులైన జర్నలిస్టులందరికీ మంజూరు చేస్తాం. వీటితోపాటే వెనువెంటనే హెల్త్ కార్డులు అందజేస్తాం. ఇండ్లస్థలాలు సైతం ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటాం’
– గత జూలై 25న ఖమ్మం టీయూడబ్ల్యూజే సమావేశంలో మంత్రి పొంగులేటి
హైదరాబాద్, ఆగస్టు 17 (నమస్తేతెలంగాణ): గత అసెంబ్లీ ఎన్నికల ముందు రాష్ట్రంలోని జర్నలిస్టులకు అనేక హామీలిచ్చిన కాంగ్రెస్.. గద్దెనెక్కిన తర్వాత మొండి‘చెయ్యి’ చూపుతున్నది. అధికారంలోకి వచ్చాక సీఎం రేవంత్‌రెడ్డి, సమాచార ప్రసార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి హామీలు గుప్పించారు. ఏండ్లు గడుస్తున్నా.. హామీలు మాత్రం అమలుకు నోచడం లేదు. పలు సందర్భాల్లో మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఇచ్చిన హామీలు కోటలు దాటుతున్నా, ఆచరణలో మాత్రం అడుగు ముందుకు పడటమే లేదు. ప్రభుత్వం ఏర్పడి 20 నెలలు దాటినా పాత్రికేయుల సమస్యల పరిష్కారంపై సర్కారు దృష్టి పెట్టడమే లేదు.. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన అక్రెడిటేషన్లను మూడు నెలలకోసారి పొడిగించడం తప్ప, కొత్తగా ఇచ్చిందిలేదు. ఇండ్లస్థలాల మంజూరు ఊసే ఎత్తడం లేదు. ఇటీవల ఖమ్మంలో మంత్రి పొంగులేటి ఇచ్చిన హామీకి సైతం మోక్షం లభించలేదు. మీటింగ్ జరిగిందిలేదు. జర్నలిస్టులకు ఒరిగిందేమీలేదు.
తాము అధికారంలోకి రాగానే జర్నలిస్టులకు రూ.100 కోట్లతో సంక్షేమ నిధిని ఏర్పాటు చేస్తామని, సుదీర్ఘకాలం పెండింగ్‌లో ఉన్న హైదరాబాద్ ఇండ్లస్థలాల సమస్యను పరిష్కరిస్తామని, అర్హులైన ప్రింట్, ఎలాక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులకు జిల్లాల వారీగా ఇండ్లస్థలాలు కేటాయిస్తామని, మరణించిన వారి కుటుంబాలకు రూ.5 లక్షలు అందజేస్తామని, కుటుంబసభ్యులకు మెరుగైన వైద్యం అందేలా హెల్త్‌కార్డులు మంజూరు చేస్తామని, రిటైర్డ్ జర్నలిస్టులకు పెన్షన్ సదుపాయం కల్పిస్తాం.. అని కాంగ్రెస్ పార్టీ అనేక హామీలను ఇచ్చింది. కానీ అధికారంలోకి వచ్చాక ఆచరణలో మాత్రం ఘోరంగా విఫలమైంది. 20 నెలలు దాటినా ఏ ఒక్క వాగ్దానానికి మోక్షం లభించడం లేదని జర్నలిస్టులు, సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. ఎన్నిసార్లు మంత్రులు, అధికారుల దృష్టికి తీసుకెళ్లినా అప్పుడు, ఇప్పుడు అంటూ తప్పించుకుంటున్నారని పెదవి విరుస్తున్నారు.
కొత్త అక్రెడిటేషన్లకై ఎదురుచూపులు
గత బీఆర్ఎస్ ప్రభుత్వం దేశంలో ఎక్కడాలేని విధంగా తెలంగాణలో 16,337 మంది జర్నలిస్టులకు 2022 జూలైలో రెండేండ్ల కాలపరిమితితో అక్రెడిటేషన్లను మంజూరు చేసింది. జర్నలిస్టుల గుర్తింపుకార్డుల గడువు 2024 జూన్ 30తో ముగిసింది. కానీ అప్పటి నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం మూడునెలలకోసారి చొప్పున పొడిగించుకుంటూ వస్తున్నది. ఇప్పటికే ఐదుసార్లు గడువు పొడిగించింది తప్ప కొత్తవి మంజూరు చేయడంలేదు. చివరిగా గత జూన్ 30న వచ్చే సెప్టెంబర్ 30 వరకు పొడిగించింది. హెల్త్‌కార్డులు సైతం అక్రెడిటేషన్ కమిటీ వేసి కార్డులు ఇస్తామని చెప్పిందే తప్ప, ఆ దిశగా ఎలాంటి చర్యలు చేపట్టలేదు. సెప్టెంబర్ 30న గడువు ముగుయనున్నా సర్కారులో చలనమే లేదు. కొత్తగా విధుల్లో చేరిన వేలాది మంది జర్నలిస్టులు అక్రెడిటిషన్ల కోసం ఎదురుచూస్తున్నారు.
ఇండ్లస్థలాల కేటాయింపులోనూ నిర్లక్ష్యం
ఇండ్లస్థలాల కేటాయింపులోనూ అడుగు ముందుకు పడలేదు. మంత్రి మాటలు కోటలు దాటలు దాటుతున్నా చేతలు మాత్రం గడప దాటడం లేదని జర్నలిస్టు సంఘాల నేతలే ఆరోపిస్తున్నారు. కోర్టు కేసులను సాకుగా చూపి తప్పించుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్‌లోని జవహర్లాల్ నెహ్రూ సొసైటీకి స్థలాల కేటాయింపును సైతం పట్టించుకోవడంలేదని వాపోతున్నారు. సుప్రీంలో రివ్యూ పిటిషన్ వేయకుండా, ప్రత్యామ్నాయం చూపకుండా నిర్లక్ష్యం చేస్తున్నదని ఆగ్రహిస్తున్నారు.
బీఆర్ఎస్ పాలనలోనే మేలు
బీఆర్ఎస్ పాలనలోనే జర్నలిస్టులకు మేలు జరిగిందని జర్నలిస్టు యూనియన్ల నాయకులు అభిప్రాయపడుతున్నారు. ఆ ప్రభుత్వం బడ్జెట్లో ఏటా రూ.100 కోట్లు కేటాయించిందని, 16,337 మందికి అక్రిడిటేషన్లు మంజూరు చేసిందని చెప్తున్నారు. సుమారు 65 వేల మందికి హెల్త్‌కార్డులు మంజూరు చేసిందని గుర్తుచేస్తున్నారు. మరణించిన 335 మంది కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున పరిహారం అందజేసిందని పేర్కొంటున్నారు. కరోనా కష్టకాలంలో వ్యాధిబారిన పడిన బాధితులకు రూ.20 వేల చొప్పున అందజేసి అండగా నిలిచిందని చెప్తున్నారు. అనేక జిల్లాల్లో ఇండ్లస్థలాలు సైతం కేటాయించిందని గుర్తుచేస్తున్నారు.
జర్నలిస్టులకు కాంగ్రెస్ ఇచ్చిన హామీలు