ఖైరతాబాద్ : ‘ఊహ తెలిసినప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నాను. నాటి విలువలు నేడు లేవు. ప్రస్తుతం దానిని బ్రోకర్ల పార్టీగా మార్చివేశారు’ అంటూ కాంగ్రెస్ మునుగోడు ఇన్చార్జి పాల్వాయి స్రవంతి( Palvai Sravanti) ఆరోపించారు. ‘ ఒక గాడిదను గుర్రం అనుకొని తీసుకు వచ్చారు. కాని ఏదో ఒకరు ఆ గాడిదను గుర్తిస్తే తిరిగి వెనక్కి తన్నక తప్పదని కాంగ్రెస్ అధిష్టానం(Congress High command) పై తీవ్ర విమర్శలు చేశారు. సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ తిరును, అధిష్టానం వైఖరిని ఆమె తప్పుబట్టారు.
తన తండ్రి పాల్వాయి గోవర్దన్ రెడ్డి అరవై సంవత్సరాల పాటు కాంగ్రెస్‌లోనే కొనసాగారని, ప్రత్యేక రాష్ట్ర తొలి, మలి దశ ఉద్యమాల్లో పాల్గొని అనేక త్యాగాలు చేశారని గుర్తు చేశారు. కాంగ్రెస్‌ను కాపాడేందుకు ఎన్నో అవమానాలకు గురై తుది శ్వాస వరకు ఆ పార్టీలోనే సేవలందించారన్నారు. తన తండ్రిని చూసి రాజకీయ ఓనమాలు దిద్దుకున్నానని , కాలక్రమేణా పార్టీలో విలువలు తగ్గిపోయాయని విమర్శించారు.
జాతీయ నాయకుడు రాహుల్ గాంధీ(Rahul Gandhi) పారాచూట్ నాయకులకు తావు లేదని ప్రకటించి 50 మందికిపైగా పారాచూట్లకే టికెట్లు ఇచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలు, సీనియర్లకు స్థానం లేకుండా చేశారని వాపోయారు. కాంగ్రెస్ విలువలతో కూడిన పార్టీ అని అనుకున్నానని, కాని ఆ పార్టీని నిలువెత్తున బేరానికి పెట్టి ఎవరెక్కువ పైసలు ఇస్తే వారికే ప్రాధాన్యతనిచ్చే దుస్థితికి దిగజారిపోయిందని ఆరోపించారు.
కాంగ్రెస్ పార్టీలో చేరకముందే సర్వేలో వారి పేర్లు వస్తాయని, ఏండ్ల తరబడి జెండాలను మోసిన వారు కనిపించరని ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ చచ్చిపోయిందని చెప్పిన వ్యక్తులకు కండువాలు కప్పుతున్నారని, వారికి 24 గంటల్లోనే టికెట్లు కూడా ఇచ్చేస్తున్నారని వెల్లడించారు. ఇటీవల కాంగ్రెస్ కోమటి రెడ్డి బద్రర్స్ బ్రాండ్ అని చెప్పుకొని తిరుగుతుంటే తన కండ్లు బైర్లు కమ్మాయని, పార్టీని పాతాళానికి తొక్కేసే అలాంటి వారి చర్యలను అధిష్టానం గుర్తిస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుత పరిస్థితులు చూసిన తర్వాత ఆ పార్టీపై ఉన్న కనీస గౌరవం పోకూడదనే పార్టీ నుంచి తప్పుకుంటున్నానని వెల్లడించారు.
కొందరు బ్రోకర్లు వచ్చి పార్టీని పాతాళానికి తొక్కివేశారని, ఇది కలలో కూడా ఊహించలేదన్నారు. తన రాజీనామా లేఖను ఇప్పటికే సోనియా గాంధీకి పంపించానన్నారు. రాష్ట్రంలో తొమ్మిదిన్నరేండ్లుగా బీఆర్ఎస్(Brs Party) పార్టీ ఒక్కటే ప్రజలకు మంచి చేస్తుందని, అనేక పథకాలు ప్రవేశపెట్టి వారికి సంక్షేమానికి పాటుపడుతున్నదన్నారు. త్వరలోనే అనుచరవర్గం, తన వెన్నంటి వచ్చే కార్యకర్తల సలహా మేరకు నిర్ణయం తీసుకుంటానని స్పష్టం చేశారు.