పాలకుర్తి/పెద్దవంగర, ఆగస్టు 25 : జనగామ జిల్లా పాలకుర్తి, మహబూబాబాద్ జిల్లా పెద్దవంగర మండలాల్లో ఆదివారం కాంగ్రెస్ పార్టీ నాయకులు భారీగా బీఆర్ఎస్లో చేరారు. వీరికి మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పాలకుర్తి మండలం దర్దేపల్లి, దుబ్బతండా ఎస్పీ, మంచుప్పుల, చీమలబావి తండా గ్రామాలకు చెందిన దర్దేపల్లి మాజీ ఎంపీటీసీ సిద్ధం యుగేంధర్, తొర్రూరు(జే) పీఏసీఎస్ వైస్ చైర్మన్ బానోత్ రాంధన్, మంచుప్పులకు చెందిన కాకర్ల కుమార్, రాజు, చీమలబావి తండాకు చెందిన యువకులు సుమారు 200మంది కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. అదేవిధంగా పెద్దవంగర మండలం అవతాపురం గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాజీ సర్పంచ్ సలిదండి మంజుల సుధాకర్‌తో పాటు 150 మంది కాంగ్రెస్ నాయకులు, యూత్ నాయకులు, ఆయా కుల సంఘాల నాయకులు పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీలో చేరారు.