హైదరాబాద్, ఆగస్టు30 (నమస్తే తెలంగాణ): ‘బీసీ రిజర్వేషన్లపై బీఆర్ఎస్ ప్రభుత్వం సీలింగ్ విధించింది. దానిని ఎత్తేస్తాం. 42% రిజర్వేషన్లు కల్పిస్తాం’ ఇదీ కాంగ్రెస్ సర్కారు పెద్దలు చేస్తున్న ప్రచారం. కానీ ఇది పూర్తిగా పచ్చి అబద్ధం. బీసీలకు గతంలో కల్పించిన 34% రిజర్వేషన్లను అడ్డుకున్నదే కాంగ్రెస్. స్థానిక సంస్థల్లో బీసీలకు ఆ మేరకు బీఆర్ఎస్ ప్రభుత్వం రిజర్వేషన్లను కల్పించింది. కానీ కాంగ్రెస్ హైకోర్టును ఆశ్రయించి అడ్డుకున్నది. సుప్రీంకోర్టు తీర్పును ఎత్తిచూపింది. ఫలితంగానే 50 శాతం సీలింగ్‌ను ఏర్పాటు చేయాల్సి వచ్చింది. ఇప్పుడు అదే సీలింగ్‌ను ఎత్తేస్తామంటూ అదే కాంగ్రెస్ ఢాంబికాలు పలుకుతున్నది.
బీసీలను మభ్యపెడుతున్నది. ఇప్పటికే బిల్లులు చేసింది.. ఆర్డినెన్స్‌ను గవర్నర్‌కు పంపింది.. అవి ముందుకు సాగడం లేదు. కానీ ఇప్పుడు మళ్లీ బిల్లులంటూ డ్రామాలకు తెరలేపింది. ఇది కేవలం బీసీలను మభ్యపెట్టడానికే తప్ప మరేమీ కాదని స్పష్టంగా తెలిసిపోతున్నది. ఆర్టికల్ 243 డీ(6), టీ (6) ప్రకారం బీసీ రిజర్వేషన్లను రాష్ర్టాలే ఇచ్చుకోవచ్చని ఆదేశాలు వచ్చాయి. దానిని అనుసరించే కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం 2018లో నూతన పంచాయతీరాజ్ చట్టాన్ని తీసుకొచ్చింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34% రిజర్వేషన్ కల్పించింది. అందుకు అనుగుణంగా జీవో 396ను జారీ చేసింది. ఆనాడు ఆ జీవోను సవాల్ చేస్తూ మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన కాంగ్రెస్ నాయకులు హైకోర్టును ఆశ్రయించారు.
ఇది సుప్రీంకోర్టు విధించిన 50% సీలింగ్‌కు వ్యతిరేకమని వాదించారు. దీంతో హైకోర్టు బీఆర్ఎస్ ప్రభుత్వం జారీచేసిన 396 జీవోను రద్దు చేసింది. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ బీఆర్ఎస్ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అత్యున్నత ధర్మాసనం ఆ పిటిషన్‌ను కూడా తిరస్కరించింది. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు 2010లో విధించిన 50% సీలింగ్‌ను అనుసరించి స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లను ఖరారు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. 50 శాతం సీలింగ్‌కు లోబడి స్థానిక ఎన్నికల్లో ఎస్సీలకు 20.53%, ఎస్టీలకు 6.68%, బీసీలకు 22.79% కలిపి 49.50% రిజర్వేషన్లను నిర్ణయించి ఎన్నికలను నిర్వహించింది. మొత్తంగా బీసీలకు రిజర్వేషన్లు దక్కకుండా అడ్డుకున్నదే కాంగ్రెస్ పార్టీ. నేడు అదే పార్టీ సీలింగ్‌ను ఎత్తేస్తామంటూ అసత్య ప్రచారాలకు పూనుకున్నది.
బీఆర్ఎస్ ప్రభుత్వం 2018లో తీసుకొచ్చిన నూతన పంచాయతీరాజ్ చట్టంలో సెక్షన్ 285 (ఏ) అనేది లేనేలేదు. తొలుత బీసీలకు 34% రిజర్వేషన్లను ఖరారు చేస్తూ జీవో 396ను జారీచేసింది. హైకోర్టు దానిని రద్దు చేయడంతోపాటు, 50% సీలింగ్ మించవద్దని మరోసారి తేల్చిచెప్పింది. దీంతో రాజ్యాంగబద్ధంగా ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లను ఖరారుచేసిన అనంతరం.. 50శాతంలో మిగిలిన రిజర్వేషన్ల శాతం బీసీలకు కేటాయించింది. మొత్తంగా సీలింగ్ దాటకుండా చూస్తూ స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించేందుకు నాడు ఆర్డినెన్స్ 2/2018ని తీసుకొచ్చింది. కానీ ఆ ఆర్డినెన్స్‌కు 6 నెలల కాల పరిమితి మాత్రమే.
ఈ నేపథ్యంలో ఆర్డినెన్స్‌ను శాశ్వతంగా చట్టంగా మార్చే ఉద్దేశంతో యాక్ట్ 4/2019 ద్వారా పంచాయతీరాజ్ చట్టంలో సెక్షన్ 285 (ఏ) చేర్చింది. ఇటీవల కాంగ్రెస్ ప్రభుత్వం ఆ చట్టానికే సవరణ చేస్తూ ఆర్డినెన్స్ జారీకి పూనుకున్నది. ఆ ప్రతిపాదనలు గవర్నర్ వద్ద పెండింగ్ ఉన్నాయి. మళ్లీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఆ సీలింగ్‌ను ఎత్తేస్తామనడం చర్చనీయాంశంగా మారింది. సుప్రీంకోర్టు తీర్పుకు విరుద్ధంగా బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ జీవోను జారీ చేస్తామని చెప్తున్నది. ఆ జీవో అనేది న్యాయసమీక్ష ఎదుట రద్దు కాక తప్పదని బీసీ సంఘాలు వాదిస్తున్నాయి.