Congress | సూర్యాపేట జిల్లాలో కాంగ్రెస్ పార్టీలో వర్గవిభేదాలు బయటపడ్డాయి. అర్వపల్లి మండల కేంద్రంలో ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే మందుల సామేల్ వర్గాల కొట్టుకున్నాయి. దీంతో అర్వపల్లిలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.
ఇటీవల తుంగతుర్తి నియోజకవర్గ కాంగ్రెస్ మండల అధ్యక్ష ఎన్నికల్లో ఎమ్మెల్యే మందుల సామేలు ఏకపక్షంగా చేపట్టారని ఎంపీ చామల వర్గానికి చెందిన నాయకులు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో ఆ ఎన్నికలను రద్దు చేయాలని కోరుతూ గాంధీ భవన్కు బయల్దేరారు. ఈ క్రమంలో అర్వపల్లి మండల కేంద్రంలో వారిని ఎమ్మెల్యే సామేల్ అనుచరులు అడ్డుకున్నారు. దీంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం నెలకొంది. అదికాస్త ముదరడంతో ఒకరిపై మరొకరు రాళ్లు రువ్వుకున్నారు. చివరకు పోలీసులు రంగప్రవేశం చేసి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు.
కాగా, ఎంపీ చామల వర్గీయులు గాంధీ భవన్కు వెళ్తుండగా సామేల్ అనుచరులు రాళ్లు, కర్రలతో దాడికి దిగారు. దీంతో పలువురు గాయపడ్డారు. ఈ ఘటనలో పోలీసులకు సైతం గాయాలయ్యాయి. దీంతో పోలీసులు లాఠీచార్జ్ నిర్వహించిన పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు.