Telangana | హైదరాబాద్, ఏప్రిల్ 16 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర మంత్రివర్గంలో హెలికాప్టర్ చిచ్చు రేగినట్టు తెలుస్తున్నది. కొంతమందికి మాత్రమే హెలికాప్టర్ వాడుకొనే అవకాశం లభించడంపై మిగిలిన వారు.. తాము మంత్రులం కాదా? హెలికాప్టర్ వాడే హక్కు తమకు లేదా అంటూ మనోవేదన చెందుతున్నారని కాంగ్రెస్ వర్గాలు చర్చించుకుంటున్నాయి. ఈ విషయం గతంలో సీఎం రేవంత్‌రెడ్డి దృష్టికి వెళ్లినా పరిస్థితిలో మార్పు లేకపోవడంతో కొందరు మంత్రులు తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు.
ఇటీవల జరిగిన సీఎల్పీ సమావేశంలో కూడా హెలికాప్టర్ వ్యవహారంపై ఎమ్మెల్యేలు, మంత్రుల మధ్య గుసగుసలు వినిపించినట్టు సమాచారం. హైదరాబాద్‌కు దూరంగా ఉన్న జిల్లాలకు వెళ్లేందుకు మంత్రులు హెలికాప్టర్‌ను ఉపయోగించడం సాధారణం. అయితే కొంతమందికి మాత్రమే ఆ అవకాశం లభించడం, మిగిలినవారికి హెలికాప్టర్ అందుబాటులో ఉండకపోవడంతో వారంతా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్టు సచివాలయ వర్గాలు పేర్కొంటున్నాయి. ప్రొటోకాల్ ప్రకారం ముఖ్యమంత్రి ప్రభుత్వ హెలికాప్టర్‌ను ఉపయోగిస్తూ జిల్లాల పర్యటనలు చేస్తారు. సీఎం పర్యటన ఎకడా లేనప్పుడు, హెలికాప్టర్ ఖాళీగా ఉంటే మాత్రమే మంత్రులు దానిని ఉపయోగించుకునే అవకాశం ఉంటుంది. ఇందుకు ప్రత్యేకంగా నిబంధనలేమీ లేవని అధికారులు పేర్కొంటున్నారు.
కొన్ని కీలక శాఖలు నిర్వర్తిస్తున్న నలుగురైదుగురు మంత్రులు మాత్రమే రెగ్యులర్‌గా హెలికాప్టర్‌ను ఉపయోగిస్తున్నారు. ఓ మంత్రి రంగారెడ్డి జిల్లా పర్యటనకు కూడా హెలికాప్టర్‌ను వాడుతుండటంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నల్లగొండ జిల్లాకు చెందిన మంత్రులు ఎక్కువగా హెలికాప్టర్ వాడుతున్నారని, వారిలో ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ముందున్నారని అటువంటి అవకాశం తమకు దక్కడం లేదని ఓ సీనియర్ మంత్రి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్టు సమాచారం.
నల్లగొండ మంత్రులకు మాత్రమే హెలికాప్టర్ భాగ్యం ఉందని తాజాగా మంత్రి దామోదర రాజనర్సింహ సైతం వ్యాఖ్యానించారు. కొంతమంది మంత్రులు ప్రైవేట్ కార్యక్రమాలకు, విందులకు సైతం హెలికాప్టర్‌ను వాడుతున్నారనే విమర్శ రాజకీయవర్గాల్లో వినిపిస్తున్నది. దీనిపై ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్తాయని సీఎల్పీ సమావేశంలో ఎమ్మెల్యేలు అభిప్రాయపడినట్టు తెలిసింది. మంత్రులు హెలికాప్టర్‌ను పల్లె వెలుగు బస్సులా మార్చారంటూ పలువురు ఎద్దేవా చేస్తున్నారు. ఈ గాలిమోటర్ రచ్చకు సీఎం రేవంత్‌రెడ్డి ఫుల్స్టాప్ పెడతారా లేక అధిష్ఠానం ఈ విషయంలో జోక్యం చేసుకుంటుందా అని పార్టీ శ్రేణులు ఎదురుచూస్తున్నారు.