Congress | హైదరాబాద్, అక్టోబర్ 28 (నమస్తే తెలంగాణ): అసెంబ్లీ ఎన్నికలకు అభ్యర్థుల ప్రకటన కాంగ్రెస్‌లో కల్లోలం రేపింది. పార్టీ రాష్ట్ర కార్యాలయం గాంధీభవన్‌తోపాటు అభ్యర్థులను ప్రకటించిన అన్నిచోట్లా పార్టీ కార్యాలయాల్లో శుక్రవారం తిరుగుబాటుదారులు రచ్చరచ్చ చేశారు. టికెట్లు ఆశించి భంగపడ్డ నేతల అనుచరులు విధ్వంసాలకు దిగారు. జూబ్లీహిల్స్ టికెట్ ఆశించి భంగపడ్డ విష్ణువర్ధన్‌రెడ్డి అనుచరులు ఏకంగా గాంధీభవన్‌పై దాడిచేసి పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఫ్లెక్సీలను చించేశారు.
కాంగ్రెస్ జెండాలను తగులబెట్టారు. అసెంబ్లీ ఎన్నికల కోసం శుక్రవారం 45 మంది అభ్యర్థులతో కాంగ్రెస్ రెండో జాబితా విడుదల చేసిన అనంతరం అన్ని నియోజకవర్గాల్లోనూ అసంతృప్తి వ్యక్తమవుతున్నది. టికెట్ దక్కకపోవడంతో పార్టీపై తిరుగుబాటు జెండా ఎగరేస్తున్నారు. తొలి జాబితా విడుదల సందర్భంలో కూడా ఇదే పరిస్థితి కనిపించింది. గాంధీభవన్ ‘ధర్నాచౌక్’గా మారిపోయింది. రేవంత్‌రెడ్డి టికెట్లు అమ్ముకొన్నారని ఆరోపిస్తూ గద్వాల నేత కురవ విజయ్‌కుమార్ ఏకంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)కు ఫిర్యాదు చేశారు. ఇప్పుడు రెండో జాబితా విడుదల సందర్భంలోనూ అవే దృశ్యాలు కనిపిస్తున్నాయి.
తిరుగుబాటు భేటీలు.. నిరసనలు
ఎల్లారెడ్డి నియోజకవర్గం నుంచి టికెట్ ఆశించి భంగపడిన సుభాష్‌రెడ్డి తీవ్ర మనస్థాపం చెందారు. ఎన్నో ఏండ్లుగా పార్టీకి సేవచేస్తే తనకు పార్టీ ద్రోహం చేసిందని ఆవేదన వ్యక్తంచేశారు. ఇక వరంగల్ వెస్ట్ నుంచి టికెట్ ఆశించి భంగపడ్డ జంగా రాఘవరెడ్డి, మునుగోడులో పాల్వాయి స్రవంతి, చెలమల్ల కృష్ణారెడ్డి పార్టీపై తిరుగుబాటు ప్రకటించి, తమతమ అనుచరులతో సమావేశాలు నిర్వహించుకున్నారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గం టికెట్ ఆశించిన విష్ణువర్ధన్‌రెడ్డి పార్టీ నాయకత్వంపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. హుస్నాబాద్‌లో ప్రవీణ్‌రెడ్డి, పరకాలలో ఎంగల వెంకట్రామిరెడ్డి, కూకట్‌పల్లిలో గొట్టెముక్కల వెంగళ్రావు, ఎల్బీనగర్లో మల్రెడ్డి రాంరెడ్డి, ఆదిలాబాద్‌లో గండ్ర సుజాత, ఆసిఫాబాద్‌లో సరస్వతి, పాలేరులో మాధవిరెడ్డి, మక్తల్‌లో ఎర్ర శేఖర్, మహబూబాబాద్‌లో బలరాం నాయక్ వంటి నేతలు టికెట్ దక్కకపోవడంతో తిరుగుబాటు స్వరం వినిపిస్తున్నారు.
రాజీనామాల పర్వం.. రెబల్‌గా రెఢీ
ఎల్లారెడ్డి నియోజకవర్గం నేత సుభాష్‌రెడ్డి, కూకట్పల్లి నేత గొట్టెముక్కల వెంగళ్రావు, జూబ్లీహిల్ నేత విష్ణువర్ధన్‌రెడ్డి కాంగ్రెస్‌కు రాజీనామా చేసినట్టు తెలిసింది. కాంగ్రెస్ ముస్లిం మైనార్టీ చైర్మన్ షేక్ అబ్దుల్లా సొహైల్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. పరకాల నుంచి వెంకట్రామిరెడ్డి రెబల్‌గా బరిలోకి దిగేందుకు సిద్ధమవుతున్నారు. వరంగల్ వెస్ట్ నుంచి జంగా రాఘవరెడ్డి కూడా రెబల్‌గా పోటీకి సిద్ధమయ్యారు. వనపర్తి అభ్యర్థి చిన్నారెడ్డిని మార్చాలని మేఘారెడ్డి అనుచరులు డిమాండ్ చేశారు.
నర్సాపూర్ అభ్యర్థి ఆవుల రాజిరెడ్డిని ఓడించేందుకు రెబల్‌గా పోటీ చేస్తామని నియోజకవర్గ ఇన్చార్జి గాలి అనిల్‌కుమార్, పీసీసీ అధికార ప్రతినిధి ఆంజనేయులు గౌడ్, రాష్ట్ర నాయకుడు రవీందర్‌రెడ్డి ప్రకటించారు. దేవరకద్ర అభ్యర్థి మధుసూదన్‌రెడ్డిని సత్వరమే మార్చాలని పీసీసీ కార్యదర్శులు ప్రదీప్‌కుమార్‌గౌడ్, కొండ ప్రశాంత్‌రెడ్డి డిమాండ్ చేశారు. నగేశ్‌రెడ్డి (నిజామాబాద్ రూరల్), ప్రవీణ్‌రెడ్డి (హుస్నాబాద్), సాజిద్‌ఖాన్ (ఆదిలాబాద్), సరస్వతి (ఆసిఫాబాద్), ప్రశాంత్‌కుమార్‌రెడ్డి (మక్తల్), ఎర్ర శేఖర్ (జడ్చర్ల), నాగం జనార్దన్‌రెడ్డి (నాగర్‌కర్నూల్), చలిమెల కృష్ణారెడ్డి (మునుగోడు), నాగి శేఖర్ (చొప్పదండి) తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. పార్టీ అభ్యర్థులకు పోటీగా బరిలో నిలవాలని భావిస్తున్నారు.
రేవంత్ ఫ్లెక్సీలు, కాంగ్రెస్ జెండాలు కాల్చివేత
సుల్తాన్‌బజార్: జూబ్లీహిల్స్ టికెట్ ఆశించి భంగపడ్డ దివంగత నేత పీ జనార్దన్‌రెడ్డి కుమారుడు విష్ణువర్ధన్‌రెడ్డి అనుచరులు శనివారం గాంధీభవన్‌ను ముట్టడించారు. ప్రధాన ద్వారం వద్ద బైఠాయించి పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డికి వ్యతిరేకంగా పెద్ద పెట్టున నినాదాలు చేశారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారటంతో గాంధీభవన్ సిబ్బంది ప్రధాన ద్వారాన్ని మూసివేశారు. మరింత ఆగ్రహానికి గురైన నిరసనకారులు, గాంధీభవన్ లోపలికి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించారు. రాళ్లు, ఇటుకలతో గాంధీభవన్‌పై దాడి చేశారు. అక్కడ ఉన్న రేవంత్‌రెడ్డి ఫ్లెక్సీలను చించేశారు. కాంగ్రెస్ జెండాలను తగులబెట్టారు.
కాంగ్రెస్ అసంతృప్తుల నిరసనహోరు
నమస్తే తెలంగాణ నెట్వర్క్, అక్టోబర్ 28: కాంగ్రెస్ టికెట్లు దక్కని ఆశావహులు, వారి అనుచరులు రోడ్డెక్కి ధర్నాలు, రాస్తారోకోలు నిర్వహిస్తున్నారు. ఆసిఫాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ టికెట్ శ్యాంనాయక్‌కు కేటాయించడంతో ఆ పార్టీ ఆశావహులు మర్సుకోల సరస్వతి, గణేశ్ రాథోడ్ శనివారం ఆసిఫాబాద్‌లో ధర్నా నిర్వహించారు. నిర్మల్ జిల్లా ముథోల్ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థిగా నారాయణరావు పటేల్‌కు టికెట్ ఇవ్వటంతో భైంసాలోని పార్టీ కార్యాలయంలో టికెట్ ఆశించి భంగపడ్డ కిరణ్ కొమ్రేవార్ అనుచరులు నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపారు. పార్టీ కార్యాలయ బోర్డు, పోస్టర్లు, ఫ్లెక్సీలను చించివేశారు. వడ్డేపల్లి సుభాష్‌రెడ్డికి ఎల్లారెడ్డి టికెట్ కేటాయించక పోవడంతో నాగిరెడ్డిపేట కాంగ్రెస్ పార్టీ యూత్ అధ్యక్షుడు రాకేశ్ ఆత్మహత్యకు యత్నించాడు. కాకతీయ యూనివర్సిటీ మొదటి గేటు వద్ద బీసీ సంఘం, నిరుద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో రేవంత్ దిష్టిబొమ్మ దహనం చేశారు.