హైదరాబాద్, జనవరి 31 (నమస్తే తెలంగాణ): బొగ్గు కుంభకోణాన్ని బయటపెట్టడంతో పాటు జలదోపిడీపై బీఆర్ఎస్ పోరాటం చేస్తున్న నేపథ్యంలో మాజీ సీఎం కేసీఆర్‌పై రాష్ట్ర సర్కార్ కక్షసాధింపు చర్యలకు దిగిందని శాసనమండలిలో ప్రతిపక్షనేత మధుసూదనాచారి పేర్కొన్నారు. తెలంగాణభవన్‌లో శనివారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ర్టాన్ని పదేండ్ల పాటు అద్భుతంగా అభివృద్ధి చేసిన సీఎం కేసీఆర్‌కు సిట్ నోటీసులు ఇవ్వడం దుర్మార్గమని మండిపడ్డారు. యావత్ తెలంగాణ సమాజానికి మార్గదర్శకుడిగా కేసీఆర్ ఉన్నారని పేర్కొన్నారు. మున్సిపల్ ఎన్నికల వేళ కాంగ్రెస్‌కు ఓటమి భయం పట్టుకున్నదని, నేపథ్యంలోనే బీఆర్ఎస్ శ్రేణుల ఆత్మైస్థెర్యం దెబ్బతీసేందుకు సీఎం రేవంత్‌రెడ్డి కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు.
సిట్‌లో ఉన్నది పోలీసులా? లేక, సీఎం రేవంత్‌రెడ్డి ప్రైవేట్ సైన్యమా? అన్న అనుమానాలు కలుగుతున్నాయని మధుసూదనాచారి పేర్కొన్నారు. రేవంత్‌రెడ్డి చేసిన చిల్లరమల్లర ప్రయత్నమే ఈ సిట్ నోటీసులు అని దుయ్యబట్టారు. రాష్ట్ర అభివృద్ధి విషయంలో కేసీఆర్‌తో పోటీ పడాలి కానీ, ఈ విధంగా విధ్వంసం చేయడమేంటని ప్రశ్నించారు. మాజీ సీఎం కేసీఆర్ ఎర్రవెల్లిలోని నివాసంలో ఉంటే, నందినగర్‌లో నోటీసులు ఇవ్వడం ఏంటని నిలదీశారు. కేసీఆర్‌కు సిట్నోటీసులపై మేధావులు, కళాకారులు తీవ్రంగా పరిగణించాలని కోరారు.
తన గురువు కండ్లలో ఆనందం కోసం సీఎం రేవంత్‌రెడ్డి తెలంగాణ ప్రజలకు కన్నీళ్లు తెప్పిస్తున్నారని మధుసూదనాచారి విమర్శించారు. మాజీ మంత్రి హరీశ్‌రావు బొగ్గు కుంభకోణాన్ని బయటపెట్టడంతో రేవంత్సర్కార్లో భూకంపం వచ్చిందని, దాని నుంచి దృష్టి మళ్లించేందుకే బీఆర్ఎస్ కీలక నేతలకు నోటీసులు, విచారణలంటూ వేధిస్తున్నారని మండిపడ్డారు. సీఎం ఎన్ని కుట్రలు చేసినప్పటికీ, బీఆర్ఎస్ను బలహీనపర్చలేరని హెచ్చరించారు. బీఆర్ఎస్ నాయకులు దేవర మల్లప్ప, సుమిత్రాఆనంద్, మన్నె గోవర్ధన్‌రెడ్డి, అల్లిపురం వెంకటేశ్వరరెడ్డి, ప్రేమ్‌కుమార్‌దూత్, కొమ్ము నరేందర్ పాల్గొన్నారు.
ఉద్యమ నేత కేసీఆర్‌కు సిట్ నోటీసులు ఇవ్వడం అంటే యావత్ తెలంగాణకి ఇది చీకటి రోజు. ఇది పూర్తిగా రాజకీయ కక్ష సాధింపు చర్యలకు అద్దం పడుతున్నది. మున్సిపల్ ఎన్నికల పనుల్లో బిజీగా ఉన్నానని, మరోసారి సమయం కావాలని కేసీఆర్ కోరితే కేవలం రెండు రోజుల వ్యవధే ఇస్తారా అని శనివారం ఒక ప్రకటనలో ప్రశ్నించారు.
-ఎర్రోళ్ల శ్రీనివాస్, కార్పొరేషన్ మాజీ చైర్మన్
‘కేసీఆర్ గారి ప్రాథమిక హకులను కాలరాస్తూ, ఆయనను అవమానపరచాలనే కుట్ర స్పష్టంగా కనిపిస్తున్నది. ఇది చట్టవిరుద్ధమైన పాలనకు పరాకాష్ట. పోలీసులు కేవలం రాజకీయ కక్షసాధింపులో కీలుబొమ్మలుగా మారారు. కేసీఆర్ నివాసం వద్ద సాక్షి నోటీసులను అంటించడం అక్రమం. నోటీసులు గోడలకు అంటించడం ద్వారా రాజ్యాంగంలోని ఆర్టికల్ 14, 21ని ఉల్లంఘించారు.
-దాసోజు శ్రవణ్, ఎమ్మెల్సీ
టెలిఫోన్ ట్యా పింగ్ పేరిట కట్టుకథలు సృష్టించి, సిట్ విచారణ నోటీసుల పేరిట కాంగ్రెస్ సర్కార్ నీచమైన రాజకీయాలు చేస్తున్నది. శిఖరంలాంటి కేసీఆర్‌పై అత్యంత దిగజారుడు రాజకీయాలు చేస్తున్న హస్తం పార్టీకి ప్రజలు కర్రుకాల్చి వాత పెట్టడం ఖాయం. రేవంత్ సర్కార్ దాష్టీకాన్ని తెలంగాణ సమాజం అంతా గమనిస్తున్నది.
-యాదయ్యగౌడ్, సర్పంచుల జేఏసీ అధ్యక్షుడు
రాష్ట్ర ప్రజల గుండె చప్పుడైన కేసీఆర్‌ను నోటీసులతో వేధించాలని చూస్తే తెలంగాణ సమాజం క్షమించదు. ప్రజా సమస్యలు పట్టని ఈ ప్రభుత్వానికి, ఏ మాత్రం పసలేని కేసులో అంత తొందరెందుకో అర్థం కావడం లేదు. ‘రాష్టాన్ని సాధించి, తెలంగాణ వైభవాన్ని గొప్పగా చాటిన మహానేతకు గౌరవం ఇదేనా? చావు నోట్లో తలపెట్టి రాష్ర్టాన్ని సాధించిన తెలంగాణ జాతిపితకు నోటీసులా? తెలంగాణ ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటిన పెద్దాయనపై కక్ష సాధింపా? తెలంగాణ రాష్టాన్ని వ్యతిరేకించిన శక్తులే నేడు తెలంగాణలో పాలన కొనసాగిస్తూ, కేసీఆర్‌గారి లాంటి మహనీయులపై బురద జల్లే ప్రయత్నం చేస్తే ఎప్పటికీ చరిత్రహీనులుగానే మిగిలి పోతారు. తెలంగాణ సమాజమంతా కేసీఆర్‌గారి వెన్నంటే ఉన్నది. రాజకీయ వేధింపులకు భయపడే ప్రసక్తే లేదు.
-సబితాఇంద్రారెడ్డి, మాజీ మంత్రి,
తెలంగాణ దార్శనికుడైన కేసీఆర్ పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం కక్షపూరిత వైఖరిని అవలంబిస్తున్నది. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఆయన ఇంటికి సిట్ అధికారులు నోటీసులు అంటించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నా. దశాబ్దాల స్వరాష్ట్ర కలను సాకారం చేసింది కేసీఆరే. సాధించిన తెలంగాణను కేవలం పదేండ్లలో అభివృద్ధి, సంక్షేమంలో దేశంలోనే నంబర్ వన్‌గా నిలబెట్టిన గొప్ప దార్శనికుడు. అలాంటి కేసీఆర్ పట్ల రేవంత్ సర్కార్ కక్షపూరితంగా వ్యవహరించడం గర్హనీయం. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను ప్రజలు గమనిస్తున్నారు. రాబోయే కాలంలో కాంగ్రెస్‌కు ప్రజలు బుద్ధిచెప్పడం ఖాయం.
-పువ్వాడ అజయ్‌కుమార్, మాజీ మంత్రి
హైదరాబాద్ సీపీ సజ్జనార్‌కు ఎర్రవెల్లికి దారి తెలియకపోతే చూపిస్తాం. ఎర్రవెల్లిలో కేసీఆర్ నివాసానికి సిట్ అధికారులు వెళ్లడానికి సంకోచిస్తే, సిట్‌పై ప్రజలు తిరగబడుతారనుకుంటే, బీఆర్ఎస్ శ్రేణులమంతా రక్షణగా ఉంటాం. ఇచ్చిన హామీలు నెరవేర్చడం చేతకాక కాంగ్రెస్ నేతలు ఇలాంటి రాజకీయ కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నారు. దమ్ముంటే ఇచ్చిన హామీలు నెరవేర్చాలి. సిట్ నోటీసులు ఇచ్చినప్పుడే విచారణకు హాజరవుతానని కేసీఆర్ స్పష్టంగా చెప్పారు.
-శంభీపూర్ రాజు, ఎమ్మెల్సీ
తెలంగాణను సాధించిన కేసీఆర్ గౌరవానికి భంగం కలిగించేలా సిట్ అధికారులు వ్యవహరించారు. ఇది అత్యంత దారుణం. ఈ విచారణ అంతా సీఎం రేవంత్‌రెడ్డి కనుసన్నల్లోనే జరుగుతున్నది. ఇదంతా రేవంత్‌రెడ్డి పైశాచికానందానికి పరాకాష్ట. కేసీఆర్ పట్ల ప్రభుత్వం అనుసరిస్తున్న దుర్మార్గపు వైఖరిని తీవ్రంగా ఖండిస్తున్నాం.కాంగ్రెస్ చేస్తున్న ప్రతి తప్పుడు పనిని వెలికితీసి తెలంగాణ ప్రజల ముందుపెడతాం. వారి వేధింపులన్నింటినీ ప్రజలు గమనిస్తున్నారు. త్వరలోనే వారికి గుణపాఠం చెప్తారు.
– ఎమ్మెల్సీ తాతా మధు
కోట్లాదిమంది ప్రజల ఆరాధ్యుడు కేసీఆర్‌పై రేవంత్ సర్కార్ కుట్రలకు దిగడాన్ని ఖండిస్తున్నాం. స్వరాష్ట్ర స్వప్నాన్ని సాకారం చేసి, దశాబ్దకాలం పాటు తెలంగాణను దేశంలోనే అగ్రగామిగా నిలిపిన మహానేత కేసీఆర్. అలాంటి నాయకుడిపై బురద చల్లాలని ప్రయత్నించడం సూర్యుడిపై ఉమ్మి వేయడమే. ప్రజల్లో పెరుగుతున్న వ్యతిరేకతను పకదారి పట్టించేందుకు, సింగరేణి బొగ్గు కుంభకోణం మరకల నుంచి దృష్టి మళ్లించేందుకు సిట్ పేరుతో నోటీసులు జారీ చేయడం రేవంత్‌రెడ్డి చిల్లర రాజకీయాలకు పరాకాష్ట. చరిత్ర సృష్టించినవాడు కేసీఆర్ అయితే, ఆ చరిత్రను మలినం చేయాలని చూస్తున్న చరిత్రహీనుడు రేవంత్‌రెడ్డి. అధికారం శాశ్వతం కాదు.. తెలంగాణ సమాజమంతా కేసీఆర్ వెంటే ఉంది. రాజకీయ వేధింపులకు భయపడే ప్రసక్తే లేదు. ప్రజలే మీకు తగిన బుద్ధి చెబుతారు.
-తకళ్లపల్లి రవీందర్రావు, ఎమ్మెల్సీ
రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే కేసీఆర్‌కు సిట్ నోటీసులు ఇచ్చింది. కేసీఆర్ విచారణకు పూర్తిగా సహకరిస్తానని చెప్పారు. ఎర్రవల్లిలో విచారణ జరపాలని కోరితే ఏకపక్షంగా దానిని తిరస్కరించారు. మున్సిపల్ ఎన్నికల సమయంలో ప్రజల దృష్టిని అసలు సమస్యల నుంచి మళ్లించేందుకు ఇలాంటి వ్యవహారాలు చేస్తున్నారు. తెలంగాణ ప్రజలు అన్నింటినీ గమనిస్తున్నారు. కేసీఆర్ నాయకత్వంపై ప్రజలకు పూర్తి నమ్మకం ఉన్నది. ఇలాంటి చర్యలు బీఆర్ఎస్ పార్టీని, కేసీఆర్‌ను బలహీనపర్చలేవు.
-నామా నాగేశ్వర్రావు, ఖమ్మం మాజీ ఎంపీ
విచారణ పేరిట అధికార పార్టీ ప్రతిపక్ష నేతలపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చావు నోట్లో తల పెట్టి తెలంగాణ రాష్ర్టాన్ని సాధించారు. అభివృద్ధిలో రాష్ర్టాన్ని అగ్రగామిగా నిలిపారు. అలాంటి గొప్ప నాయకుడిని విచారణ పేరిట ఇబ్బందులకు గురిచేయడం సరికాదు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారెంటీలు, అనేక హామీలను నమ్మి ప్రజలు ఓట్లు వేస్తే, వాటిని నెరవేర్చకుండా మోసం చేసింది.
– బాల్క సుమన్, మాజీ విప్
రాష్ట్ర సాధకుడు కేసీఆర్ చరిత్రకు మరక అంటించాలనే నీచ, నికృష్ట ప్రయత్నమే సిట్ నోటీసులు. ఉద్దేశపూర్వకంగానే రేవంత్‌రెడ్డి ప్రభుత్వం కేసీఆర్‌ను వేధిస్తున్నది. ప్రతీకారేచ్ఛతో రగిలిపోతున్న సర్కార్ కేసీఆర్ పట్ల అమానుషంగా ప్రవర్తిస్తున్నది. విచారణకు సహకరించడానికి సిద్ధంగా ఉన్నప్పటికీ ప్రభుత్వం అవమానకరంగా వ్యవహరించే ధోరణిలో చిల్లర రాజకీయం చేస్తున్నది. ప్రజలకిచ్చిన హామీలను నెరవేర్చాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిర్మాణాత్మక ప్రతిపక్షంగా చీల్చి చెండాడుతున్నందుకు ఇలా కక్షసాధింపు చర్యలకు పూనుకుంటున్నది.
-పల్లె రవికుమార్‌గౌడ్, కార్పొరేషన్ మాజీ చైర్మన్
ఉద్యమ నేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను అవమానించడం అంటే తెలంగాణ నేలను అవమానించడమే. తెలంగాణ ఆత్మకు మలినం ఆపాదించడమే. తెలంగాణ ఉద్యమ సారథిగా, సాధకుడుగా, రెండు విడతల ముఖ్యమంత్రిగా రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడపించిన కేసీఆర్‌ను కేసులు, నోటీసుల పేరిట వేధింపులకు, కక్ష సాధింపులకు గురిచేయడం సరికాదు. కాంగ్రెస్ ప్రభుత్వం పాలనను గాలికొదిలేసి కక్ష రాజకీయాలతో టైమ్‌పాస్ చేస్తున్నది. ఈ తరహా కక్ష రాజకీయాలకు ఇకనైనా ముగింపు పలకాలి.
-దేవీప్రసాద్, కార్పొరేషన్ మాజీ చైర్మన్
రాష్ర్టాన్ని సాధించిన కేసీఆర్‌కు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చే గౌరవం ఇదేనా? కేసీఆర్‌కు సంబంధం లేని అంశాలను తెరమీదికి తీసుకొస్తూ బీఆర్ఎస్ ప్రతిష్ట దిగజార్చే విధంగా కాంగ్రెస్ ప్రయత్నిస్తున్నది. రాష్ట్రాన్ని పదేండ్లు ముఖ్యమంత్రిగా పరిపాలించి బంగారు తెలంగాణ సాధన దిశగా కృషి చేసిన కేసీఆర్‌పై బురదజల్లడం సరికాదు. కాంగ్రెస్ నాయకులు ఇష్టానుసారంగా మాట్లాడటాన్ని ప్రజలు గమనిస్తున్నారు.
-కోలేటి దామోదర్ గుప్తా, కార్పొరేషన్ మాజీ చైర్మన్