నమస్తే తెలంగాణ, న్యూస్‌నెట్‌వర్క్, ఫిబ్రవరి 11: మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులు, నాయకులు పోలింగ్ బూత్‌ల వద్దే డబ్బు పంపిణీకి తెరలేపారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం, షాద్‌నగర్, శంకర్పల్లి, మొయినాబాద్, చేవెళ్ల వంటి మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు డబ్బులు పంపిణీ చేశారు. డబ్బులు పంచుతున్నారని ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ పరిధిలోని శేరిగూడలో స్వతంత్ర అభ్యర్థి ఆందోళనకు దిగటంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
ఇబ్రహీంపట్నంలోని 3వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి డబ్బులు పంపిణీ చేశారు. షాద్‌నగర్‌లోని పలువార్డుల్లో కూడా అధికారపార్టీ అభ్యర్థులు పోలింగ్ కేంద్రాల వద్దనే డబ్బుల పంపిణీ చేసినట్టు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మంచిర్యాల జిల్లా చెన్నూర్‌లో కాంగ్రెస్ అభ్యర్థి భర్త పెద్దింటి శ్రీనివాస్ ఓటర్లకు బహిరంగంగానే డబ్బులు పంపిణీ చేసిన ఘటన వివాదాస్పదమైంది. 2వ వార్డు నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పెద్దింటి పద్మ పోటీ చేస్తుండగా ఆమె భర్త పెద్దింటి శ్రీనివాస్ పోలింగ్ కేంద్రం సమీపంలోనే ఓటర్లను ప్రభావితం చేస్తూ డబ్బులు పంపిణీ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో పలువురు అభ్యర్థులు పోలింగ్ కేంద్రం ముందు ఆందోళనకు దిగారు.
మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్లో బీజేపీ నేత పోలింగ్ చీటీలతోపాటు ఓటర్లకు డబ్బులను పంపిణీ చేస్తుండగా ఎస్సై కిరణ్‌కుమార్ పట్టుకున్నారు. అతని వద్ద నుంచి రూ.35 వేల నగదు సీజ్‌చేసి, కేసు నమోదు చేశారు. ఆదిలాబాద్ మున్సిపాలిటీలోని పోలింగ్ కేంద్రాల వద్ద నగదు పంపిణీ చేస్తూ బోరాజ్ మండలం విద్యానగర్ గ్రామానికి చెందిన కాటిపెల్లి రాజారెడ్డి పట్టుబడ్డాడు. అక్కడి వన్‌టౌన్ పోలీసులు అతడి వద్ద రూ.3,440, భుక్తాపూర్ వాసి మేకల కృష్ణకుమార్ వద్ద నుంచి రూ.2,700 చొప్పున నగదును స్వాధీనం చేసుకున్నారు. ఆదిలాబాద్ పట్టణంలోని మహాలక్ష్మి వాడలో ఓటు వేయడానికి వెళ్తున్న ఓటర్లకు అరటి పండ్లు పంచుతూ ప్రలోభపెడుతున్న ఆటో డ్రైవర్ మహమ్మద్ అర్షద్‌ను పోలీసులు గుర్తించి కేసు నమోదు చేశారు. తర్వాత అతడి ఆటోను సీజ్ చేశారు.
కోరుట్లలోని 2వ వార్డులో సోహెల్ అనే వ్యక్తి అదే పేరుతో ఉన్న ఓటర్ స్లిప్ పట్టుకొని పోలింగ్ బూత్‌కు వెళ్లాడు. ఇది గమనించిన ఎంఐఎం అభ్యర్థి ఫిర్యాదు చేయడంతో పోలీసులు అదుపులోకి తీసుకొని స్టేషన్‌కు తరలించారు. కరీంనగర్‌లోని 34వ డివిజన్ హుస్సేనిపురలోని సూఫా కాన్వెంట్ పోలింగ్ కేం ద్రంలో ఇద్దరు మైనర్లు ఇతరుల పేరుతో ఓటు వేసేందుకు రాగా ఎంఐఎం అభ్యర్థి మజారుద్దీన్ గుర్తించి పోలీసులకు తెలిపాడు. ఆదిలాబాద్‌లోని 11వ వార్డులోగల రామ్‌నగర్ పోలింగ్ బూత్‌కు ఓటు వేసేందుకు వచ్చిన ఓ మహిళ దగ్గర కత్తి దొరకడంతో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.