అప్పుడు అలా..
‘ధరణి పోర్టల్‌ను ప్రైవేటు కంపెనీకి అప్పగించిన బీఆర్ఎస్ సర్కారు వేల ఎకరాలను దోచుకున్నది. రాష్ట్ర ప్రజల రహస్య వివరాలను ప్రైవేటు కంపెనీ చేతుల్లో పెట్టింది’
-ఇదీ ఎన్నికల ప్రచారంలో రేవంత్‌రెడ్డితోపాటు కాంగ్రెస్ పార్టీ చేసిన ఆరోపణ
ఇప్పుడు ఇలా..
‘భూ భారతి పోర్టల్ నిర్వహణను అత్యంత విశ్వసనీయ సంస్థకు అప్పగించాలి’
-ఇటీవల భూ భారతిపై సమీక్షలో సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్య
‘కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ ఎన్ఐసీ నిర్వహణలో ఉన్న ప్రస్తుత భూ భారతి పోర్టల్ తాత్కాలికమే. శాశ్వత పోర్టల్‌ను తీసుకొనిరాబోతున్నాం. ఇందుకోసం త్వరలోనే టెండర్లు పిలుస్తాం. ఈ ఏడాది చివర్లో లేదా వచ్చే ఏడాది ప్రారంభంలో కొత్త పోర్టల్‌ను అందుబాటులోకి తెస్తాం
-ఒక పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి
Bhu Bharati | హైదరాబాద్, ఏప్రిల్ 19(నమస్తే తెలంగాణ): ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలను పరిశీలిస్తే, భూ భారతి పోర్టల్‌ను ప్రైవేటు సంస్థకు అప్పగించే ప్రయత్నం జరుగుతున్నదనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది. ధరణి పోర్టల్ నిర్వహణ విషయంలో నాడు బీఆర్ఎస్ సర్కారును విమర్శించిన వారే.. నేడు ప్రైవేటు సంస్థకు అప్పగించేందుకు ప్రయత్నిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీని వెనుకు ఏదైనా రహస్య ఎజెండా దాగి ఉన్నదా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నాడు బీఆర్ఎస్ సర్కారు చేసింది తప్పయితే, నేడు కాంగ్రెస్ చేస్తున్నది ఒప్పెలా అవుతుందనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఈ నేపథ్యంలో నాడు బీఆర్ఎస్ సర్కారు ధరణి పోర్టల్ నిర్వహణను ప్రైవేటు సంస్థకు అప్పగించడం 100% కరెక్టేననే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ కేవలం రాజకీయాల కోసం ధరణిని బూచీగా చూపించి, బీఆర్ఎస్ సర్కారుపై ఆరోపణలు చేసి ఎన్నికల్లో లబ్ధిపొందిందనే విమర్శలున్నాయి.
ధరణి స్థానంలో తీసుకొచ్చిన భూభారతి పోర్టల్ అభివృద్ధి, నిర్వహణ బాధ్యతను ప్రైవేటు సంస్థకు అప్పగించడం దాదాపు ఖాయమైనట్టు తెలిసింది. ఇందుకు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి వ్యాఖ్యలే నిదర్శనం. భూ భారతి పోర్టల్ అభివృద్ధి కోసం త్వరలోనే టెండర్లు పిలుస్తామని మంత్రి పొంగులేటి ప్రకటించారు. టెండర్లు పిలవడం అంటే దాదాపుగా ప్రైవేటు సంస్థకు కట్టబెట్టడమే అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రైవేటు సంస్థలతో పోటీ పడి టెండర్ దక్కించుకునే స్థోమత ప్రభుత్వ సంస్థలకు ఉండదు.
రైతులు ఎదుర్కొంటున్న భూ సమస్యలను తీర్చాలనే లక్ష్యంతో నాటి సీఎం కేసీఆర్ ప్రత్యేకంగా ధరణి పోర్టల్‌ను అందుబాటులోకి తీసుకొచ్చారు. రాష్ట్ర భూ వ్యవస్థతో ముడిపడిన వెబ్‌సైట్‌ను జాగ్రత్తగా, పక్కాగా నిర్వహించాలంటే అంతంత మాత్రమే నిపుణులు, ఉద్యోగులు ఉన్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంస్థలతో సాధ్యం కాదనే ఉద్దేశంతో అప్పట్లో ధరణి పోర్టల్ నిర్వహణ బాధ్యతను ప్రైవేటు కంపెనీకి అప్పగించారు. తొలుత ఐఎల్ అండ్ ఎఫ్ఎస్ సంస్థకు, ఆ తర్వాత టెర్రాసిస్ సంస్థకు అప్పగించారు. అయితే, ఈ నిర్ణయంపై కాంగ్రెస్ పార్టీ తీవ్ర ఆరోపణలు చేసింది. ఆ సంస్థలు కేటీఆర్‌కు సంబంధించినవని, వాటి ద్వారా అవినీతికి పాల్పడ్డారంటూ కాంగ్రెస్ నేతలు ఆరోపించారు.
కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్‌గాంధీ, ప్రియాంకగాంధీతోపాటు అప్పటి పీసీసీ అధ్యక్షుడు, ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఇతర నేతలంతా ధరణిపై ఇష్టమొచ్చినట్టుగా ఆరోపణలు చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ధరణిని మార్చేసి భూ భారతిని తీసుకొస్తామని, ఈ పోర్టల్ బాధ్యతను ప్రభుత్వరంగ సంస్థకు అప్పగిస్తామని ప్రకటించారు. కానీ, అదే కాంగ్రెస్ పెద్దలు.. ఇప్పుడు భూ భారతి పోర్టల్‌ను ప్రైవేటు సంస్థకు అప్పగించేందుకు రంగం సిద్ధం చేస్తుండటం గమనార్హం.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే తామేదో గొప్ప పని చేస్తున్నట్టుగా ధరణి పోర్టల్ బాధ్యతలను కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ నేషనల్ ఇన్ఫర్మటిక్స్ సెంటర్ (ఎన్ఐసీ)కి అప్పగించింది. కొత్తగా రూపొందించిన భూ భారతి పోర్టల్‌ను కూడా ఎన్ఐసీతోనే తయారుచేయించినట్టు తెలిసింది. అయితే, ఇప్పుడు హఠాత్తుగా ఎన్ఐసీని పక్కకు పెట్టాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. కోరి కోరి తీసుకొచ్చిన ఎన్ఐసీని ఏడాది తిరక్క ముందే పక్కకు పెట్టాలనే ఆలోచన ఎందుకు చేస్తున్నదనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి.
‘భూ భారతి పోర్టల్‌ను అభివృద్ధి చేసిన ఎన్ఐసీకి శాశ్వతంగా నిర్వహణ బాధ్యతను ఎందుకు అప్పగించడం లేదు? భూ భారతి, ధరణి పోర్టల్ నిర్వహణ ఎన్ఐసీతో కావడం లేదా? అత్యంత విశ్వసనీయ సంస్థకు భూ భారతి పోర్టల్ బాధ్యతలను అప్పగించాలంటూ సీఎం రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ ఎన్ఐసీని అవమానించడం కాదా? ఆ సంస్థకు విశ్వసనీయత లేదా? అలాంటప్పుడు విశ్వసనీయత లేని సంస్థకు అధికారంలోకి రాగానే ధరణి పోర్టల్ బాధ్యతలను ఎందుకు అప్పగించినట్టు? భూభారతి పోర్టల్ అభివృద్ధిని ఎందుకు అప్పగించినట్టు? ఎన్ఐసీ సంస్థ ఎందుకు చేదైంది?’ అనే ప్రశ్నలు ఎదురవుతున్నాయి.
భూ భారతిపై ప్రభుత్వ ప్రకటనలు, చేస్తున్న వ్యవహారాలు చూస్తుంటే నవ్విపోదురు గాక నాకేటి సిగ్గు అన్నట్టుగా ఉన్నది. భూ భారతి పోర్టల్ పూర్తిస్థాయిలో సిద్ధంకాలేదని, ఇది తాత్కాలికమని స్వయంగా మంత్రి పొంగులేటి ప్రకటించారు. అలాంటప్పుడు పూర్తిగా సిద్ధంకాని వెబ్‌సైట్‌ను గొప్పగా ప్రారంభించడం ఏమిటనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తాత్కాలిక వెబ్‌సైట్‌ను ప్రారంభించేందుకు పెద్ద పెద్ద మీటింగ్‌లు, రూ.కోట్లకు కోట్లు వెచ్చించి ప్రకటనలు ఎందుకనే ప్రశ్నలు ఎదురవుతున్నాయి.
సాధారణంగా ఏ పథకాన్ని అయినా సరే ప్రారంభించడానికి ముందుగా పైలట్ ప్రాజెక్టు చేపట్టి అందులోని సమస్యలను గుర్తిస్తారు. ఆ తర్వాత వాటిని పరిష్కరించి రాష్ట్రవ్యాప్తంగా అమల్లోకి తెస్తారు. కానీ, భూభారతి విషయంలో ప్రభుత్వం ఇందుకు పూర్తి విరుద్ధంగా వ్యవహరించింది. పోర్టల్‌ను గొప్పగా ప్రారంభించిన తర్వాత పైలట్ ప్రాజెక్టుగా అమలు చేస్తున్నది. దీంతో కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై విమర్శలొస్తున్నాయి. ప్రారంభించిన తర్వాత పైలట్ ప్రాజెక్టు చేపట్టడమేమిటి? ఇదేం పద్ధతి?’ అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.