సంగారెడ్డి, మే 4 (నమస్తే తెలంగాణ): సంగారెడ్డి డీసీసీ సమావేశం రసాభాసగా మారింది. ఇందిరమ్మ కమిటీల్లో తమకు ప్రాధాన్యం దక్కడంలేదని వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఎదుటే కాంగ్రెస్ నాయకులు ఘర్షణకు దిగారు. పార్టీ జిల్లా ఇన్చార్జి, ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డిని, జహీరాబాద్ ఇన్చార్జి చంద్రశేఖర్, పటాన్చెరు కార్యకర్తలు నిలదీశారు. పటాన్‌చెరులోని కమిటీల్లో బీఆర్ఎస్ నుంచి వచ్చిన ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి పెత్తనమేంటని ప్రశ్నించారు. ఫ్లెక్సీలోని మహిపాల్‌రెడ్డి ఫొటోను తొలిగించి, ఆ స్థానంలో మాజీ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి ఫొటోను అతికించారు. సమావేశంలో అసంతృప్త నేతలంతా వేదిక వద్దకు దూసుకురావడంతో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. మంత్రి దామోదర మౌనం వహించగా జహీరాబాద్ ఎంపీ సురేశ్ షెట్కార్ ఇరువర్గాలను శాంతింపజేసేందుకు ప్రయత్నించారు. చివరికి పోలీసులు రంగంలోకి దిగి గొడవ పెరగకుండా చూశారు. డీసీసీ సమావేశానికి జిల్లాకు చెందిన నాయకుడు, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి, ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి, పటాన్చెరు నాయకుడు కాటా శ్రీనివాస్ గైర్హాజరయ్యారు.
కాంగ్రెస్‌లో గొడవలు కొత్తకాదు
కాంగ్రెస్ పార్టీలో గ్రూపు రాజకీయాలు, గొడవలు సహజమే. గొడవలు ఇప్పుడు కొత్తవేమీ కాదు. నారాయణఖేడ్‌లో గ్రూపు రాజకీయాలున్నా ఎన్నికల్లో గెలుపొందాం. గ్రూపు రాజకీయాలు పార్టీని నాశనం చేసేలా మారవద్దు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినందున నేతలు, కార్యకర్తలు పదవులు అనుభవించాల్సిన అవసరముంది. శ్రేణులందరికీ న్యాయం జరిగేలా చూడటమే మా పని. కార్యకర్తలకు ఏమైనా సమస్యలుంటే పరిష్కరిస్తాం.
– దామోదర రాజనర్సింహ, వైద్యారోగ్యశాఖ మంత్రి