Congress | హైదరాబాద్, నవంబర్11(నమస్తే తెలంగాణ): నిన్న, మొన్నటి వరకు ఒకేమాట, ఒకే బాటగా నడిచిన ఆ అన్నదమ్ముల మధ్య కోల్డ్‌వార్ నడుస్తున్నదా? వారిద్దరి మధ్య దూరం పెరిగిందా? ఆరు నెలలుగావారిద్ద మధ్య మాటలు లేవా? ఒకరినొకరు పలరించుకోవడం లేదా? సొంత నియోజకవర్గంలో సీఎం పాదయాత్ర చేస్తుంటే, అమెరికా పర్యటన పేరుతో ఒక సోదరుడు కావాలనే దూరంగా ఉన్నారా? ఇటీవలి పరిణామాలు, అన్నదమ్ముల ప్రవర్తన తీరు చూస్తుంటే పరిస్థితి అలాగే ఉన్నదంటున్నారు కాంగ్రెస్ కార్యకర్తలు. మంత్రి పదవి మీద మమకారం ఆ అన్నదమ్ముల మధ్య దూరం పెంచుతున్నదనే టాక్ వినిపిస్తున్నది. ముఖ్య నాయకుడు అటు అన్నను ఎగేసి, ఇటు తమ్మున్ని సగేసి రాజకీయం సాగిస్తున్నారని కార్యకర్తలు అనుకుంటున్నారు.
నిజానికి, అన్నదమ్ముల మధ్య కొన్నాళ్లుగా తీవ్రమైన రాజకీయ వైరం కొనసాగుతూ వచ్చింది. అన్నతో విభేదించిన తమ్ముడు గతంలో కాంగ్రెస్‌కు రాజీనామా చేసి బీజేపీలో చేరారు. అనంతరం జరిగిన ఉప ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు. సాధారణ ఎన్నికల నాటికి తిరిగి కాంగ్రెస్ గూటికి చేరారు. ఇద్దరూ గెలిచారు. దీంతో ఇద్దరి మధ్య మంత్రి పదవి పేచీ వచ్చిందని పార్టీ కార్యకర్తలు చెప్తున్నారు. ఇద్దరికిద్దరు తగ్గేదే లేదు అన్నట్టు ఎవరి లాబీయింగ్ వారు నడిపించారు. అప్పటికే కాంగ్రెస్‌లో సీనియర్ నేతగా.. కష్టాల్లో పార్టీని అంటిపెట్టుకొని ఉన్న నమ్మకస్తుడిగా ఉన్న అన్నను మంత్రి పదవి వరించింది.
అయితే, పార్టీ అ ధికారంలోకి వస్తే మంత్రి పద వి ఇస్తారన్న హామీతోనే తమ్ముడి తిరిగి కాంగ్రెస్‌లో చేరారని ఆయన అనుచరులు చెప్తున్నారు. దీంతో మొదటి విస్తరణలోనే తనకు మంత్రి పదవి వస్తుందని తమ్ముడు ఆశలు పెట్టకున్నారట. ఆయనే స్వయంగా చాలా సందర్భాల్లో పలు వేదికల మీద బహిరంగంగానే తనకు మంత్రి పదవి వస్తుందని ప్రకటించుకున్నారు. హోం శాఖ మంత్రిగా చేయాలని ఉన్నదంటూ మనసులో కోరికను వెలిబుచ్చారు. కాని సొంత సోదరుని రూపంగా ఎదరు తన్నడంతో ఆయన మంత్రి పదవి దక్కలేదు. ఈ లోపే పార్లమెంట్ ఎన్నికలు రావడంతో భువనగిరి కాంగ్రెస్ అభ్యర్థిగా తన వాళ్లను నిలుపుకోవడానికి ఎవరి ప్రయత్నం వాళ్లు చేశారని పార్టీ కార్యకర్తలు చర్చించుకుంటున్నారు.
ఒకరు తన మరో సోదరుని కుమారునికి టికె ట్ ఇప్పించడానికి ప్రయత్నించగా, మరొకరు తన భార్య కోసం టికెట్ అడిగారని అ ప్పట్లో ప్రచారం జరిగింది. ఆ ఇద్దరికీ కాకుండా ము ఖ్యనేత తనకు అత్యంత న మ్మకస్తుడైన వ్యక్తికి టికెట్ ఇచ్చారని, ముఖ్యనే త ఇక్కడే తన రా జకీయ చతురత చూపారని పార్టీ వర్గాలు చెప్తున్నా యి. మంత్రి పదవిలో ఉన్న అన్నను పిలుపించుకొని, ఎంపీ అభ్యర్థిని గెలపిస్తే మంత్రి పదవికి ఢోకా ఉండదని చెప్పారట. మరోవైపు తమ్మున్ని పిలిచి ఎంపీ అభ్యర్థి గెలుపు మీ భుజాల మీద పెడుతున్నా..ఆయన్ను గెలపించుకొని వస్తే మీకు మంత్రి పదవి దక్కుతుందనే ఆశ కల్పించారని వారి అనుచరులు చెప్తున్నారు. దీంతో మంత్రి పదవిపై ఆశలు పెట్టుకున్న తమ్ముడు, మంత్రి పదవిని కాపాడుకోవడానికి అన్న ఎవరికి వారు కష్టపడి కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలిపించారట.
మంత్రివర్గ విస్తరణ ఉంటుందనే ప్రచారం నేపథ్యంలో తమ్ముడు ముఖ్యనేత వద్దకు వెళ్లి మంత్రి పదవి తనకు ఇవ్వాలని అడిగారట. అన్న అప్పటికే మంత్రిగా ఉన్నందున అదే ఇంట్లో మరో మంత్రి పదవి సాధ్యం కాదని, ఇది ఉదయ్‌పూర్ డిక్లరేషన్‌కు విరుద్ధమని, అన్న పదవీత్యాగం చేస్తే, తమ్ముడికి నిరభ్యంతరంగా ఇవ్వవచ్చని అధిష్ఠానం చెప్పిందని ఆ ముఖ్యనేత బదులిచ్చారట. దీంతో తమ్ముడు ఆ దిశగా కూడా ప్రయత్నాలు చేసినట్టు తెలిసింది. ఇప్పటికే రెండు పర్యాయాలు మంత్రిగా చేశారు కాబట్టి, తన కోసం పదవీత్యాగం చేయాలని, హోంశాఖ మంత్రిగా చేయాలనే తన కల నెరవేరుతుందని చెప్పి రాయబారుల ద్వారా ఒప్పించే ప్రయత్నం చేశారట.
ఇందుకు అన్న ఒప్పుకోలేదని, నీ మంత్రి పదవి నువ్వే తెచ్చుకో.. నేను మాత్రం ఉన్న పదవిని వదిలేది లేదని తెగేసి చెప్పినట్టు తెలిసింది. దీంతో ఇద్దరు సోదరుల మధ్య దూరం పెరుగుతూ వచ్చిందని, గత ఆరు నెలల నుంచి పలకరింపులు కూడా లేవని కార్యకర్తలు చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే మూసీ పునర్జీవ పాదయాత్ర పేరుతో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి యాదాద్రి భువనగిరి జిల్లాలో పాదయాత్ర చేసినప్పుడు ఒక సోదరుడు మాత్రం ఈ యాత్రకు హాజరు కాలేదని కాంగ్రెస్ పార్టీ వర్గాలు చెప్తున్నాయి. అన్న మీద కోపంతోనే ఆయన పాదయాత్రకు దూరంగా ఉన్నారని, మరోవైపు మరో కీలక నేతకు సన్నిహితంగా మెలగడానికి ప్రయత్నిస్తున్నారని కాంగ్రెస్ కార్యకర్తులు చర్చించుకుంటున్నారు.