పెద్దపల్లి: పంచాయతీ ఎన్నికల్లో ఓటమిని జీర్ణించుకోలేక అధికార పార్టీ (Congress)నేతలు దాడులకు పాల్పడుతున్నారు. పెద్దపల్లి జిల్లా అంతర్గాం మండలం టీటీఎస్ అంతర్గాం (TTS Anthergoan) గ్రామ పంచాయతీకి సర్పంచ్‌గా కాంగ్రెస్ తరపున గీట్ల శంకర్ రెడ్డి, స్వతంత్ర అభ్యర్థిగా సాఫ్ట్వేర్ ఉద్యోగి అంగోతు రవికుమార్ నాయక్ పోటీచేశారు. ఈ నెల 14న పోలింగ్ నిర్వహించగా రవికుమార్ విజయం సాధించి సర్పంచ్‌గా ఎన్నికయ్యారు.
ఈ క్రమంలో తనకు ఓటు వేసి గెలిపించిన ప్రజలకు కృతజ్ఞతలు చెప్పాడనికి సర్పంచ్ ఆంబోతు రవికుమార్ నాయక్, వార్డ్ మెంబర్ అనిల్ రెడ్డితో కలిసి ఇంటింటికి తిరుగుతుండగా గీట్ల శంకర్ రెడ్డి వర్గీయులు కర్రలు, సుత్తెలతో వారిపై దాడికి తెగబడ్డారు. దీంతో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. విషయం తెలుసుకున్న సర్పంచ్ వర్గీయులు గ్రామంలోని అంబేద్కర్ చౌరస్తాకు చేరుకొని ధర్నాకు దిగారు. ఘటనా స్థలానికి చేరుకున్న అంతర్గాం ఎస్ఐ వెంకట్ ధర్నా చేస్తున్న వారికి ఎంత నచ్చజెప్పిన వినలేదు. ఎస్టీ అనే నెపంతో తనపై దాడికి పాల్పడ్డారు అని రవి నాయక్ ఆరోపించారు. తనకు మద్దతు తెలిపిన వారిని భయభ్రాంతులకు గురిచేస్తున్నారని, అందరం కలిసి పనిచేస్తామని చెప్పినప్పటికీ దాడులు చేయడం సరికాదన్నారు.