హైదరాబాద్, అక్టోబర్ 22 (నమస్తే తెలంగాణ): నమస్తే తెలంగాణ కార్యాలయంపై కాంగ్రెస్ మూకల దాడి అప్రజాస్వామికమని జర్నలిస్టు, ప్రజాసంఘాల నేతలు తీవ్రంగా ఖండించారు. పత్రికా కార్యాలయంపై దాడి అంటే పత్రికా స్వేచ్ఛను హరించడమేనని, బాధ్యుపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ దాడిని టీయూడబ్యూజే రాష్ట్ర అధ్యక్షుడు అల్లం నారాయణ, ప్రధాన కార్యదర్శి ఆస్కాని మారుతిసాగర్, రాష్ట్ర నాయకుడు రమేశ్ హజారే, కోశాధికారి యోగానంద్, తెలంగాణ ఎలక్ట్రానిక్ మీడియా రాష్ట్ర అధ్యక్షుడు విష్ణువర్ధన్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి రమణకుమార్ తప్పుబట్టారు. దాడికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
అవినీతికి సమానంగా అసహనం పెరుగుతున్నది..
పత్రికల్లో వచ్చే వార్తలపై అభ్యంతరాలుంటే చట్టపరమైన చర్యలకు అవకాశాలు ఉంటాయన్న విషయాన్ని సమాజంలోని కొన్ని వర్గాలు, ముఖ్యంగా రాజకీయ నాయకులు మరచిపోతున్నారు. వారిలో పెరుగుతున్న అవినీతితో సమానంగా అసహనం కూడా రోజురోజుకు ఎకువవుతున్నది. అందుకు వరంగల్‌లో నమస్తే తెలంగాణ కార్యాలయంపై వర్ధన్నపేట ఎమ్మెల్యే వర్గీయుల దాడే అందుకు తాజా ఉదాహరణ. దాడిని తీవ్రంగా ఖండిస్తున్నా. సదరు శాసనసభ్యుడు బేషరతుగా క్షమాపణ చెప్పాలి. ఆయన తన వైఖరి మార్చుకోకపోతే ఆ ఎమ్మెల్యే మీద కాంగ్రెస్ అధిష్ఠానం చర్యలు తీసుకోవాలి.
– దేవులపల్లి అమర్, ఐజేయూ స్టీరింగ్ కమిటీ సభ్యుడు,మాజీ జాతీయ అధ్యక్షుడు
‘నమస్తే తెలంగాణ’పై దాడి దుర్మార్గం
నమస్తే తెలంగాణ వరంగల్ యూనిట్ ఆఫీస్‌పై యూత్ కాంగ్రెస్ నాయకులు దాడి చేయడం దుర్మార్గం. భౌతిక దాడులకు పూనుకోవడం, జర్నలిస్టులను భయభ్రాంతులకు గురిచేయడం సిగ్గుచేటు. వార్తల విషయంలో భేదాభిప్రాయాలు ఉన్నప్పుడు న్యాయపరంగా, చట్టపరంగా ముందుకు వెళ్లాలి కానీ, పత్రిక ఆఫీస్‌పై వందలాది మందితో దాడులకు పూనుకోవడం సమంజసం కాదు. దాడికి పాల్పడిన వారు, దీని వెనుక ఉన్నవారు ఎంతటి పెద్ద వారైనా సరే ఉపేక్షించకుండా చర్యలు తీసుకోవాలి.
– అల్లం నారాయణ, టీయూడబ్యూజే రాష్ట్ర అధ్యక్షుడు
జర్నలిస్టులకు ఎమ్మెల్యే బహిరంగ క్షమాపణ చెప్పాలి
వరంగల్ నమస్తే కార్యాలయంపై దాడి చేయడం అప్రజాస్వామిక చర్య. ఇది భావప్రకటనా స్వేచ్ఛ మీద జరిగిన దాడి. నిర్భయంగా కథనాలు రాసే మీడియాపై దాడికి పాల్పడటం దారుణం. ఇటీవలి కాలంలో భావ ప్రకటనా స్వేచ్ఛను నొక్కే కుట్రలు జరుగుతున్నాయి. ఇలాంటి దాడులు మీడియా స్వేచ్ఛకు గొడ్డలిపెట్టు లాంటివి. ఈ దాడికి పూర్తిగా వర్ధన్నపేట ఎమ్మెల్యేనే బాధ్యత వహించాలి. తక్షణమే ఎమ్మెల్యే ‘నమస్తే తెలంగాణ’ పత్రికకు, జర్నలిస్టులకు బహిరంగంగా క్షమాపణలు చెప్పాలి. ఇలాంటి దాడులను తీవ్రంగా ప్రతిఘటిస్తాం. మీడియా సత్తా చూపుతాం.
– విరాహత్ అలీ, టీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షుడు
వర్ధన్నపేట ఎమ్మెల్యేనే బాధ్యత వహించాలి
వరంగల్ నమస్తే కార్యాలయంపై కాంగ్రెస్ కార్యకర్తలు దాడి చేయడం అప్రజాస్వామిక చర్య. ఇది భావప్రకటనా స్వేచ్ఛ మీద జరిగిన దాడి. నిర్భయంగా వార్తలు మీడియాపై ఇలా దౌర్జన్యానికి పాల్పడటం హేయం. కథనాలపై భిన్నాభిప్రాయులుంటే ప్రెస్ కౌన్సిల్‌కు ఫిర్యాదు చేయాలి కానీ ఇలా ప్రవర్తించడాన్ని ఎంతమాత్రం క్షమించకూడదు. ఈ దాడికి పూర్తిగా వర్ధన్నపేట కాంగ్రెస్ ఎమ్మెల్యే నాగరాజు బాధ్యత వహించాలి. ఇలాంటి దాడులను తీవ్రంగా ఖండిస్తున్నా.
– బీ బసవ పున్నయ్య, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టీడబ్ల్యూజేఎఫ్
భావప్రకటనా స్వేచ్ఛను హరించడమే
ప్రజాసమస్యలను వెలుగులోకి తెస్తున్న పత్రికపై కత్తిగట్టడం శోచనీయం. ఇలాంటి వైఖరి ప్రజాస్వామ్యానికి పెనుముప్పుగా పరిణమిస్తుంది. పార్టీ ముసుగులో ఉన్న కొన్ని అసాంఘిక శక్తులు దాడులు చేసి పత్రికా సిబ్బందిని భయపెట్టాలని చూడడం ఎంతవరకు సమంజసం. భావప్రకటనా స్వేచ్ఛను హరించే ఇలాంటి చర్యలు ఎంతమాత్రం మంచిదికాదు. ఈ దుర్మార్గాన్ని ప్రజాస్వామికవాదులు, జర్నలిస్టు సంఘాలు, ప్రజాసంఘాల బాధ్యులు ముక్తకంఠంతో ఖండించాలి. దాడికి సంబంధించి పోలీసులు కేసు నమోదు చేయాలి.
– కట్టా శేఖర్‌రెడ్డి, ‘నమస్తే తెలంగాణ’ పూర్వ ఎడిటర్
ఉన్నత పదవిలో ఉన్నవారే హింసను ప్రేరేపిస్తున్నారు
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన రాష్ట్రంలో దాడుల సంస్కృతి పెరిగిపోయింది. ‘రాష్ట్రానికి నాయకత్వం వహిస్తున్న.. ఉన్నత పదవిలో ఉన్న వారే తొక్కుతా.. పేగులు మెడకేసుకుంటా.. లాగుల్లో తొండలు వదులుతా..’ అంటూ హింసను ప్రేరేపించేలా మాట్లాడుతున్నారు. అదే దారిలో వారి పార్టీ నాయకులు వెళ్తున్నారు. పత్రికలో వచ్చిన వార్తలపై అభ్యంతరాలుంటే ప్రెస్‌కౌన్సిల్, రాజ్యాంగబద్ధ సంస్థలకు ఫిర్యాదు చేయాలి. కానీ భౌతిక దాడులకు దిగడం సహించరానిది. ఇలాంటి హింసాత్మక చర్యలు భావప్రకటన స్వేచ్ఛకు గొడ్డలిపెట్టు.
– బుద్ధామురళి, ఆర్టీఐ మాజీ చీఫ్ కమిషనర్